
ఆకాశంలో ఈత మార్గం..
రెండు ఆకాశహర్మ్యాలను కలుపుతూ మధ్యలో బ్రిడ్జి ఉండటం కొత్తేమీ కాదు. కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ ట్విన్ టవర్లను కలుపుతూ 41, 42 అంతస్తుల్లో ఇలాంటి బ్రిడ్జి విఖ్యాతి చెందింది కూడా. అయితే లండన్‌లోని నైన్ ఎల్మ్స్ జిల్లాలో మాత్రం కొత్త బ్రిడ్జి రాబోతోంది. ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లాలంటే ఈత కొట్టాల్సిందే.
ఎందుకంటే... రెండు పదంతస్తుల భవనాలను కలుపుతూ ఏకంగా ఓ స్విమ్మింగ్ పూల్‌ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా గాజుతో ఉంటుంది. అంటే అందులో ఈతకు దిగిన వారికి కిందనున్నవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. 90 అడుగుల పొడవు, 4 అడుగుల లోతు ఉండే ఈ స్విమ్మింగ్‌పూల్ నుంచి చూస్తే బ్రిటన్ పార్లమెంటు భవనం ఏరియల్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుందట!