విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: కౌలాలంపూర్‌లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు కరోనా కారణంగా స్వస్థలాలకు బయలుదేరి, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విమాన సర్వీసులు రద్దు కావడంతో 185 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన 91 మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్.. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అభయమిచ్చింది.
సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు చేశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ, విశాఖలకు ఎయిర్ ఏషియా విమాన సర్వీసు పునరుద్దరణకు అనుమతించింది. దీంతో 185 మంది విద్యార్థులు బుధవారం సాయంత్రం 6.20 గంటలకు విశాఖ చేరుకొని (మరో 85 మంది ఢిల్లీ వెళ్లారు) ఊపిరి పీల్చుకున్నారు. వారికి స్క్రీనింగ్ నిర్వహించగా ఎవ్వరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ 14 రోజుల పాటు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచిస్తూ వారిని 6 ప్రత్యేక బస్సుల్లో ఆయా ప్రాంతాలకు పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment