కౌలాలంపూర్‌ నుంచి అంటుకుందా?  | Many Countries In South Asia Are Now Trembling Due To Coronavirus | Sakshi
Sakshi News home page

కౌలాలంపూర్‌ నుంచి అంటుకుందా? 

Published Wed, Apr 1 2020 2:44 AM | Last Updated on Wed, Apr 1 2020 11:29 AM

Many Countries In South Asia Are Now Trembling Due To Coronavirus - Sakshi

నిజాముద్దీన్‌ మసీదుకు జమాత్‌ కోసం వచ్చిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఒక్క సదస్సు దక్షిణాసియాలోని అనేక దేశాలు ఇప్పుడు వణికిపోయేలా చేస్తోంది. దక్షిణాసియాలోని పలు దేశాల్లో కరోనా సోకిన వారిలో అత్యధికులు తబ్లిగి జమాత్‌ సదస్సులకు హాజరైన వారే ఉన్నారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ కేంద్రంగా అంతర్జాతీయంగా ఇస్లాం మత బోధన చేస్తున్న తబ్లిగి జమాత్‌ సంస్థకు వందేళ్ల చరిత్ర ఉంది.  ప్రవక్త చెప్పిన ఇస్లాం జీవనశైలి కలిగి ఉండాలని బోధిస్తుంది. ఈ సంస్థ కౌలాలంపూర్‌లోని పెటాలింగ్‌ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు 16 వేల మందితో సదస్సు నిర్వహించింది. దీనికి 1500 మంది విదేశీయులు హాజరయ్యారు.  సదస్సుకు హాజరైన 34 ఏళ్ల మలేసియన్‌ 17న  మృతిచెందాడు. అక్కడి పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు కేసులు జమాత్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తులవేనని వార్తలొచ్చాయి. సదస్సుకు హాజరైనS ప్రతినిధులు తమ సొంత దేశాల్లో, ఇతర దేశాల్లో ఆ వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యారు. కౌలాలంపూర్‌ సదస్సుకు హాజరైన ఇండోనేసియన్లలో 31 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌æ సమావేశాల్లో పాల్గొన్నారు.

నిజాముద్దీన్‌ మర్కజ్‌కు ఇలా.. 
ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న తబ్లిగి జమాత్‌ మర్కజ్‌కు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది ఏడాది పొడవునా జరుగుతుంది. తబ్లిగి జమాత్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనవరి 1 నుంచి మన దేశానికి 2,100 మంది ప్రతినిధులు రాగా.. మార్చి 21 నాటికి 1040 మంది ప్రతినిధులు దేశంలోనే ఉన్నారని, మిగిలిన వారు లాక్‌ డౌన్‌కు ముందే వెళ్లిపోయి ఉంటారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మార్చి 21 నాటికి దేశవ్యాప్తంగా 824 మంది విదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండగా.. మర్కజ్‌లో 216 మంది ఉన్నారని ప్రకటించింది. 1500 మంది స్వదేశీ ప్రతినిధులు మర్కజ్‌లో ఉన్నట్టు తెలిపింది. 2,100 మంది స్వదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించే పనిలో ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీలో మార్చి 13–15తేదీల్లో ‘ఇజ్తెమా’ పేరుతో జరిగిన సమావేశాలకు నాలుగైదు వేల మంది స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ముందే కౌలాలంపూర్‌ సదస్సులో పాల్గొన్న 31 మంది ఇండోనేసియా దేశస్తులు, ఇతర దేశస్తులు ఢిల్లీ చేరుకుని మర్కజ్‌లో సమావేశాలకు హాజరైనట్టు తెలుస్తోంది.

దేశం నలుమూలలకు.. : ‘ఇజ్తెమా’ ముగిసిన తరువాత మార్చి 16 నుంచి అనేకమంది తమ స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. మార్చి 22 నాటి జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 23న 1500 మంది స్వస్థలాలకు వెళ్లిపోయారని, లాక్‌డౌన్‌ ప్రకటనతో సమావేశాలు నిలిపి వేశామని, కానీ విధిలేని పరిస్థితుల్లో వెయ్యి మంది అందులోనే ఉండిపోవాల్సి వచ్చిందని తబ్లిగి జమాత్‌ వెల్లడించింది. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు వాహనాలను అనుమతించాల్సిందిగా తాము సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశామని, ఇదే విషయాన్ని హజ్రత్‌ నిజాముద్దీన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఇచ్చిన నోటీస్‌కు జవాబులో తెలిపామని వివరించింది. చట్టబద్ధమైన ఆదేశాలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. అయితే తాజాగా వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్‌ తేలిందని, కరోనా లక్షణాలు ఉన్న 411 మందిని ఆసుపత్రులకు పంపామని ఢిల్లీ సీఎం ప్రకటించారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 1339 మంది జమాత్‌ ప్రతినిధులను క్వారంటైన్‌కు తరలించామని హోం శాఖ ప్రకటించింది. టూరిస్ట్‌ వీసాపై వచ్చి మతపరమైన మిషనరీ పనుల్లో పాల్గొనరాదని ఇదివరకే హోం శాఖ ఆదేశాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రతినిధుల వీసా కేటగిరీని తనిఖీ చేయాలని రాష్ట్రాల పోలీస్‌ యంత్రాంగానికి సూచనలు ఇచ్చామని తెలిపింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధులను, వారికి జిల్లాల వారీగా, స్థానికంగా సమన్వయం చేస్తున్న 2,137 మంది స్వదేశీ ప్రతినిధులను స్క్రీనింగ్‌ చేసి క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. వీరందరూ ఎక్కడెక్కడ తిరిగారో వారి కదలికలను గుర్తించాలని రాష్ట్రాలను మార్చి 29న ఆదేశించినట్టు తెలిపింది.

పాజిటివ్‌ కేసులు ఇలా వెలుగులోకి.. 
నిజాముద్దీన్‌æ సమావేశాలకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారిలో పలువురికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో రామగుండంకు వచ్చిన ఇండోనేసియన్లలో 10 మందికి మార్చి 20నే పాజిటివ్‌ అని తేలింది. ఈ సదస్సుకు హాజరైన కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి మార్చి 26న తన స్వస్థలంలో కరోనాతో మరణించారు. మార్చి 27న మర్కజ్‌ నుంచి ఆరుగురిని, 28న 33 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అండమాన్‌లో బయటపడ్డ పాజిటివ్‌ కేసులకు మర్కజ్‌ సమావేశాలకు సంబంధం ఉన్నట్టు తేలింది.

ఇతర దేశాల్లోనూ ఇదే తీరు.. 
దక్షిణాసియాలోని వివిధ దేశాల్లో కేసులకు కౌలాలంపూర్‌ సదస్సుకు లింక్‌ ఉన్నట్టు స్పష్టమవుతోంది. మలేషియాలో 2,400 కేసుల్లో మూడో వంతు కేసులకు ఈ సదస్సుకు సంబంధం ఉందని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. లాహోర్‌ సమీపంలో గల రాయ్‌విండ్‌లో తబ్లిగీ జమాత్‌ అక్కడి మర్కజ్‌లో వార్షిక సదస్సు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ సభ్యులు 27 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏ ప్రాంతాల వారు హాజరయ్యారు 
మర్కజ్‌కు గడిచిన రెండు నెలలుగా ఇండోనేసియా, నేపాల్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్,  అఫ్గానిస్తాన్, మయన్మార్, అల్జీరియా, కిర్గిస్తాన్, ఇంగ్లండ్, సింగపూర్‌ దేశాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే మన దేశం నుంచి 20కి పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు ఐదారు వేలకు మందికి పైగా ప్రతినిధులు హాజరైనట్టు ప్రాథమిక అంచనా. తబ్లిగి సమావేశాలకు హాజరైన వారిని గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్‌లతోపాటు కర్ణాటక, గుజరాత్‌ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కర్ణాటక నుంచి 54 మంది పాల్గొనగా 13 మందిని గుర్తించామని వీరందరికీ వైరస్‌ సోకలేదని పరీక్షల ద్వారా స్పష్టమైందని ఆ రాష్ట్రం తెలిపింది.హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి 17 మంది ఈ సమావేశాలకు హాజరయ్యారని అంచనా. కాగా దేశవ్యాప్తంగా తబ్లిగి జమాత్‌ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధుల వివరాలను కేంద్రం సేకరించింది. ఇలా తెలంగాణలో 82 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నట్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement