న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి రికవరీల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఏకంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 44,97,867కు చేరుకుంది. మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ఇటీవల వస్తున్న రోజూవారీ కేసులతో పోలిస్తే తగ్గాయి. మంగళవారం 75,809 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,62,663కు చేరుకుంది.
గత 24 గంటల్లో 1,053 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 88,935 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,75,861 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 17.54 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.86 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.60 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 21 వరకు 6,53,25,779 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 344 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.
భారతే బెటర్..
నాలుగు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో భారత్ నుంచి 17.7 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే కోలుకున్న వారిలో 19.5 శాతం ఉన్నారని చెప్పారు. అమెరికా నుంచి 22.4 శాతం కేసులు ఉండగా, అక్కడ కోలుకున్న వారి శాతం 18.6గా ఉందని చెప్పారు. బ్రెజిల్‌తో పోల్చినప్పటికీ, భారత్ నుంచే రికవరీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వీకీ పాల్ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో ప్రజలంతా భౌతిక దూరం పాటించడం వంటివి మరచిపోరాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment