పేరుకే లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఆర్థిక రంగాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తున్నారు. కరోనాతో సహజీవనం ఇక తప్పదు. ఇప్పటికే లక్ష కేసులు దాటేశాం. అయినా ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే లాక్‌డౌన్ సమర్థవంతంగానే పనిచేసిందనే చెప్పాలి
భారత్‌లో లాక్‌లు తెరుచుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రం కేసుల ఆధారంగా ఆంక్షలు సడలిస్తోంది. చాలా రాష్ట్రాలు మార్కెట్లు తెరిచినా అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం కొనసాగిస్తున్నాయి. రాకపోకలు ఎక్కువైతే భౌతిక దూరం పాటించడానికి వీలుకాక కేసులు పెరిగిపోతాయన్న ఆందోళన ప్రభుత్వాల్లో ఉంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనం కరోనాని బాగా కట్టడి చేశామనే అభిప్రాయం నెలకొంది. ప్రపంచ దేశాల్లో ప్రతీ లక్ష మందిలో సగటున 60 మందికి వైరస్ సోకితే, భారత్‌లో ఏడుగురికి మాత్రమే సోకింది. ఇప్పటివరకు 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించాం. భారత్‌లో మే 18న అత్యధికంగా 5,242 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రికవరీ రేటు కూడా భారత్‌లో ఎక్కువగానే ఉంది. దేశంలో కోవిడ్ రోగుల సగటు రికవరీ రేటు 40% ఉంటే మృతుల సగటు రేటు 3.1%గా ఉంది.
సెకండ్ వేవ్?
భారత్‌లో లక్ష కోవిడ్ కేసుల్లో 67శాతం ఈ నెలలో నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో 11శాతానికిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన పుట్టిస్తోంది. కేసులు ఇలా పెరుగుతూ ఉంటే మరో 8 రోజుల్లో లక్షా 50 వేల కేసులు దాటేస్తామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళ, హిమాచల్‌ప్రదేశ్, అస్సాం, గోవా రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి అందరికీ తోవ చూపించిన గోవాలో మళ్లీ కేసులు నమోదు కావడంతో సెకండ్ వేవ్ మొదలైందా అన్న సందేహాలైతే వస్తున్నాయి.
వేరే రాష్ట్రాల నుంచి గోవాకి వచ్చిన వారిలో ఏడుగురికి గత వారంలో కరోనా పాజిటివ్ వచ్చింది. మార్చి చివరి వారం తర్వాత మళ్లీ కేసులు నమోదు కావడం ఇప్పుడే. హిమాచల్ ప్రదేశ్‌లో కరోనాతో బాధపడుతున్నవారందరినీ ఈ నెల మొదట్లో డిశ్చార్జ్ చేసి అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. గత వారం రోజుల్లోనే మళ్లీ 34 మందికి కరోనా సోకడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. మార్చి 30 తర్వాత కేరళలో సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ గత నాలుగైదు రోజుల్లోనే 50కి పైగా కేసులు నమోదయ్యాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారితో ఈ కొత్త కేసులు వచ్చాయి. అదే విధంగా అసోంలో 40 మందికి కోవిడ్ సోకడం అందరిలోనూ ఆందోళన పెంచుతోంది.
బిహార్‌కి వలస కూలీల టెన్షన్
ఢిల్లీ నుంచి బిహార్ వస్తున్న వలస కూలీలకి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతూ ఉండడంతో ఆ రాష్ట్రంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాజధాని నుంచి వచ్చిన వలస కూలీల్లో 835 మందిలో 218 మందికి కరోనా సోకిందని పరీక్షల్లో వెల్లడైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతీ నలుగురిలో ఒకరికి కరోనా ఉండడంతో క్వారంటైన్ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. బిహార్‌తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, యూపీ రాష్ట్రాలకు తిరిగివస్తున్న వలస కూలీలతో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment