న్యూఢిల్లీ: కరోనా తగ్గిపోయాక, తిరిగి సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలో కరోనా తిరిగి సోకుతున్న కేసులు వస్తున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్‌లో రెండోసారి వస్తున్న కరోనా గురించి∙సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రష్యా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ వారు తయారు చేసిన వ్యాక్సిన్ మూడో దశ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అయితే శరీరంలో యాంటీబాడీలను పెంచడంలో అది 76 శాతం మందిలో సానుకూల ప్రభావాన్ని చూపినట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైందన్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మన దేశంలోనే రికవరీలు జరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు.
ఆగని కరోనా ఉధృతి
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 83,809 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,30,236కు చేరుకుంది. మంగళవారం 83 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,054 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80,776 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 38,59,399 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,90,061 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment