వృద్ధురాలి నుంచి రెండున్నర కిలోల బంగారం స్వాధీనం
చెన్నై: మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని తరలిస్తున్న అరవై ఏళ్ల మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి సోమవారం తెల్లవారుజామున చెన్నైకు ఓ విమానం చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఓ మహిళ హాండ్‌బ్యాగ్‌ను, సూట్‌కేసును తనిఖీలు చేయగా ఏమీ లభించలేదు. అయితే ఆమె ధరించిన దుస్తుల పట్ల అధికారులకు అనుమానం వేసింది. ఆమెను ప్రత్యేక గదికి తీసుకువెళ్లి మహిళా అధికారులు తనిఖీలు జరపగా లోదుస్తుల్లో బంగారాన్ని దాచినట్లు తెలిసింది.
ఆమె వద్ద జరిపిన విచారణలో దిరేష్ సెల్వరాణి (60) అని, విరుదునగర్‌కు చెందినదని తెలిసింది. ఆమె వద్ద రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ అంతర్జాతీయ స్థాయిలో రూ.85 లక్షలు. దిరేష్ సెల్వరాణిని అధికారులు అరెస్టు చేశారు. ఈమెకు స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విదేశాల నుంచి 60 ఏళ్ల మహిళ బంగారాన్ని అక్రమంగా తరలించడం విమానాశ్రయంలో సంచలనం కలిగించింది.