సర్కారుదే వడ్డీ భారం..మహిళాభివృద్ధికి ఊతం | Rising Business Opportunities for Women in AP With YSR Zero Interest Scheme | Sakshi
Sakshi News home page

సర్కారుదే వడ్డీ భారం..మహిళాభివృద్ధికి ఊతం

Published Sat, Apr 25 2020 3:48 AM | Last Updated on Sat, Apr 25 2020 4:52 AM

Rising Business Opportunities for Women in AP With YSR Zero Interest Scheme - Sakshi

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

దేశ వ్యాప్తంగా మహిళలు చాలా మంది ఇప్పటికీ ఏ చిన్న అవసరం వచ్చినా డబ్బుల కోసం అధిక వడ్డీలకు ఏదో ఒక మైక్రో ఫైనాన్స్‌ సంస్థ వద్ద చేతులు చాచే పరిస్థితి. తీసుకున్న అప్పునకు వడ్డీ తడిసి మోపెడయ్యేది. చిన్న చిన్న వ్యాపారాలు చేసి వారు సంపాదించిందంతా వడ్డీ కట్టడానికే సరిపోయేది. ఒక వేళ బ్యాంకుల్లో రుణం తెచ్చుకున్నా ఇదే పరిస్థితి. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో ఇకపై రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కష్టాలకు చెక్‌ పడినట్లే. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించిన ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’తో మహిళలు పూర్తి ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగనున్నారు. ఇంటిలో చిన్నచిన్న అవసరాలకే కాదు భర్త సంపాదనకు తోడు మహిళలెవరైనా ఓ మోస్తరు వ్యాపారం ప్రారంభించడానికి కూడా రాష్ట్రంలో ఇప్పుడు సున్నా వడ్డీకే రుణం దక్కే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన మహిళలు దాదాపు కోటి మందికిపైగా పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 90 లక్షల మందికి పైగా మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద వారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ఈ ఏడాదికి గాను వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చెల్లించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కొత్తగా సంఘాలు ఏర్పడి, ఇప్పటికీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోని లాంటి వారు దాదాపు పది లక్షల మంది.. రాను రాను ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం వివరాల ప్రకారం రాష్ట్రంలో 8,91,210 పొదుపు సంఘాలకు రూ.27,950 కోట్లు రుణంగా ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని వారు సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే.. దానిపై  వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

మధ్యలో.. మాట చెప్పి మోసం చేసిన చంద్రబాబు 
► మన రాష్ట్ర పొదుపు సంఘాల కార్యకలాపాల్లో ఒక క్రమశిక్షణ ఉంది. మహిళలు ప్రతి నెలా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేసుకోవడం.. సంఘాల వారీగా సమావేశమై తమ సాధక బాధకాలను ఆ సమావేశాల్లో చర్చించుకోవడం అలవాటుగా మారింది. 
► అవసరమైన వారికి పొదుపు డబ్బును నామమాత్రపు వడ్డీతో అప్పు ఇవ్వడం, ఇతరత్రా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహిళలు క్రమశిక్షణతో వ్యవహరించేవారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే వారు. మహిళల క్రమశిక్షణ చూసి.. బ్యాంకులు ఆ సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. 
► 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా (పొదుపు) సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని బేషరతుగా మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆ మాట నిలుపుకోకుండా మోసం చేయడంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల క్రమశిక్షణ ఒక్కసారిగా గాడి తప్పింది. రుణ మాఫీ హామీపై చంద్రబాబు చేసిన  మోసంతో మహిళలు తమ అప్పుల వడ్డీలపై చక్ర వడ్డీలు చెల్లించక తప్పలేదు. 
► రాష్ట్రంలోని పొదుపు సంఘాల ద్వారా ప్రతి నెలా కోటి రూపాయల వరకు ఉండాల్సిన మహిళల పొదుపు.. చంద్రబాబు ప్రభుత్వ మోసం కారణంగా అప్పట్లో ఒకానొక సమయంలో కేవలం రూ.7 లక్షలకు పడిపోయింది. ఐదు లక్షల సంఘాలు ఒక్కసారిగా క్రమశిక్షణ తప్పి ‘ఏ’ గ్రేడ్‌లో ఉండాల్సినవి బీ, సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. 
► పావలా వడ్డీ పథకం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించే వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీ అమలులో ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులను పొదుపు సంఘాలకు చెల్లించడం మానేసింది. దీంతో మహిళలపై మరింత వడ్డీ భారం పడింది. 

అవాంతరాలలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి..
► వైఎస్‌ జగన్‌ తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూశారు. వారు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించిన వడ్డీని తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. 
► రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నా.. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపునే అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న పట్టుదలతో శుక్రవారం (ఏప్రిల్‌ 24న) వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టారు. 

వైఎస్‌ పావలా వడ్డీ పథకమే పెద్ద విప్లవం..
► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004కు ముందు చిన్న చిన్న అప్పులపై మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు వసూలు చేసే అధిక వడ్డీల కారణంగా మహిళల ఇబ్బందులను చూసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలించిపోయారు.  
► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై కేవలం పావలా వడ్డీని మాత్రమే మహిళల నుంచి వసూలు చేసి, మిగిలిన వడ్డీ భారాన్ని ప్రభుత్వం చెల్లించడమే పావలా వడ్డీ పథకం.
► రాష్ట్రంలోని ప్రతి మహిళను లక్షాధికారిగా చూడాలన్నదే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంకల్పం. ఈ నేపథ్యంలో ఈ పథకం పొదుపు సంఘాల చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. 
► దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్‌ ఆలోచనల నుంచి వచ్చిన ఈ పథకం వల్ల అప్పట్లో మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పొదుపు
సంఘాల బాట పట్టారు.
► ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు 8.78 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, అందులో 2,90,928 పొదుపు సంఘాలు వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 2004–08 «మధ్య కాలంలో నాలుగేళ్లలో ఏర్పడినవే కావడం గమనార్హం. 
► పావలావడ్డీ పథకం వల్ల మన రాష్ట్రంలో మహిళలు పొదుపు సంఘాల్లో చేరడానికి చూపిన ఆసక్తి చూసి, కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా 250 జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. 

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కారెంశెట్టి సునీత. గుంటూరు నగరంలోని అంకమ్మనగర్‌లో సంతోష్‌ డ్వాక్రా సంఘం సభ్యురాలు. గ్రూపు తరఫున రూ.10 లక్షలు రుణం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సున్నా వడ్డీ పథకం కింద శుక్రవారం రూ.32,548 వారి ఖాతాల్లో జమ అయింది. చంద్రబాబు పాలనలో లక్ష రూపాయలకు పైగా వడ్డీ చెల్లించామని వాపోయింది. వైఎస్‌ జగన్‌ మాట ఇచ్చినా, కరోనా కష్టాల మధ్య వడ్డీ సొమ్ము జమ చేస్తారని ఊహించలేదని సంభ్రమాశ్చర్యాల మధ్య చెప్పింది. ఈ రోజు తన లాగే లక్షలాది మంది మహిళలు ఆనంద పడుతున్నారంటే అందుకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని, ఆయన ఇచ్చిన ఊతంతో ఇకపై ఆర్థికంగా మరింతగా నిలదొక్కుకుంటామనే నమ్మకం కలిగిందని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement