YSR Asara 2nd Phase Celebrations In Andhra Pradesh Also Sunday - Sakshi
Sakshi News home page

సెలవు రోజూ ‘ఆసరా’ సంబరాలు

Published Mon, Oct 18 2021 2:46 AM | Last Updated on Mon, Oct 18 2021 8:48 AM

YSR Asara Celebrations In Andhra Pradesh Also Sunday - Sakshi

ప్రకాశం జిల్లా సీఎస్‌పురంలో ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ నుంచి వైఎస్సార్‌ ఆసరా చెక్కు అందుకుంటున్న మహిళలు

సాక్షి, అమరావతి: సెలవు రోజు అయినప్పటికీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 41 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వైఎస్సార్‌ ఆసరా సంబరాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో మహిళలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలతో కూడిన బ్యానర్లను చేతపట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల నృత్యాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్త పరిచారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పును ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

వరుసగా రెండో ఏడాది రెండో విడత డబ్బుల పంపిణీ 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడంతో మహిళలు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పుల నుంచి సీఎం జగన్‌ కాపాడారని, ఆయన మేలు మరచిపోలేమన్నారు. ఎన్నో పథకాలతో తమకు అండగా నిలిచారని, ఇది పేదల ప్రభుత్వమని కొనియాడారు. నేటితో రెండవ విడత పంపిణీ పూర్తవుతుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు, అయినవిల్లి, సఖినేటిపల్లి, తుని, సామర్లకోట, పెద్దాపురం రంగంపేట మండలాల్లో ఆదివారం వైఎస్సార్‌ ఆసరా సంబరాలు కొనసాగాయి. తాళ్లరేవులో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, సఖినేటిపల్లిలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, అయినవిల్లిలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, సామర్లకోటలో ఎంపీ వంగా గీత చెక్కులు పంపిణీ చేశారు.


కర్నూలు జిల్లా నందికొట్కూరులో లబ్ధిదారులకు ఆసరా చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆర్థర్, తదితరులు

గొల్లపూడిలో ఆనందోత్సాహం 
► కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో వైఎస్సార్‌ ఆసరా సంబరాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, సమాచార శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 699 స్వయం సహాయక సంఘాలకు రూ.6.92 కోట్ల రుణమాఫీ చెక్కులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.
► కైకలూరు మండలం పెంచికలమర్రులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌), నందిగామ నియోజకవర్గం గొట్టుముక్కలలో ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు, పామర్రు మండలం కనుమూరులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, విజయవాడ 16వ డివిజన్‌లో పార్టీ నేత దేవినేని అవినాష్‌  చెక్కులు అందజేశారు. 

గుంటూరు, అనంతలో క్షీరాభిషేకం
► గుంటూరు నగరంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జి మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుచెక్కులు అందజేశారు.
► అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో, గుడిబండలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో సంబరాలు చేసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  
► కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే తొగరూరు ఆర్థర్, కౌతాళం మండలం హాల్వి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. 
► పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చెక్కులు పంపిణీ చేశారు. ఇరగవరం మండలంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, కైకరంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజా, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, విస్సాకోడేరులో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెక్కులు పంపిణీ చేశారు. 
► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు నిర్వహించారు. వజ్రపుకొత్తూరులో మంత్రి సీదిరి అప్పలరాజు, సోంపేటలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ సాయిరాజ్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.  


ప.గోదావరి జిల్లా తిరుమలంపాలెంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు. చిత్రంలో ఎమ్మెల్యే వెంకట్రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement