సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పరిశీలించనుంది. ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనున్న కమిటీ శనివారం ఎడమ కాలువ పనులను పరిశీలించి, రాజమహేంద్రవరానికి చేరుకుంటుంది. ఆదివారం పోలవరం హెడ్‌వర్క్స్‌ను(జలాశయం పనులు) పరిశీలించనుంది. సోమవారం(ఈ నెల 30న) కుడి కాలువ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, సమీక్షా సమావేశంలో వెల్లడైన విషయాల ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు జనవరి 2న నివేదిక ఇవ్వనుంది.
నిపుణుల కమిటీని పునర్‌వ్యవస్థీకరించిన కేంద్రం
ప్రస్తుత సీజన్‌లో కాఫర్ డ్యామ్‌తోపాటు స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను పూర్తి చేయడం, 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర నిపుణుల కమిటీకి వివరించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కారుకు అప్పగించాక.. మూడు నెలలకోసారి పనులను పరిశీలించి, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేందుకు అప్పటి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ అధ్యక్షతన నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మసూద్ హుస్సేన్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నిపుణుల కమిటీ చైర్మన్‌గా వైకే శర్మను నియమించింది.
ఇటీవల ఆయన పదవీ విరమణ చేయడంతో నిపుణుల కమిటీని కేంద్రం పునర్‌వ్యవస్థీకరించింది. సీడబ్ల్యూసీ సభ్యులు హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కన్వీనర్‌గా నిపుణుల కమిటీలో సీఎస్‌ఆర్‌ఎంఎస్ డైరెక్టర్ ఎస్‌ఎల్ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యకార్యదర్శి బీపీ పాండే, ఎన్‌హెచ్‌పీసీ మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్) డైరెక్టర్ దేవేంద్రకుమార్‌ను సభ్యులుగా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment