సాక్షి, అమరావతి: కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించిన గడువులోగా పోలవరాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖకు కేంద్ర నిపుణుల కమిటీ సూచించింది. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) సభ్యులు కుశ్వీందర్ వోహ్రా నేతృత్వంలో 11 మంది సభ్యులతో కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ రెండో రోజు ఆదివారం పోలవరం హెడ్ వర్క్స్(జలాశయం) పనులను మరోసారి పరిశీలించింది. కుడి కాలువను జలాశయంతో అనుసంధానించే టన్నెల్, హెడ్ రెగ్యులేటర్‌ను తనిఖీ చేసింది.
అనంతరం కుడి కాలువను పరిశీలించింది. నిర్వాసితుల కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయిలో రెండు రోజుల పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో గత నెల 18న ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన గడువు మేరకు పోలవరం పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించింది.
పరీక్షలు వేగవంతం..
ఈసీఆర్‌ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి ఏర్పడిన గోతులను పూడ్చేందుకు 11 రకాల పరీక్షలను వేగంగా పూర్తి చేయాలని నిపుణుల కమిటీ ఆదేశించింది. జూలై 15లోగా పరీక్షల నివేదికను సీడబ్ల్యూసీకి అందజేయాలని సూచించింది. సెప్టెంబర్‌లోగా గోతులను పూడ్చే విధానాన్ని సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందని, వాటి ఆధారంగా అక్టోబర్ 1 నుంచి పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. దిగువ కాఫర్ డ్యామ్‌ను జూలై నాటికి రక్షిత స్థాయికి పూర్తి చేయాలని పేర్కొంది.
డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్) నిపుణులతో అధ్యయన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఆధారంగా పాత దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న భాగంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయాలా? అన్నది నిర్ణయిస్తామని పేర్కొంది. స్పష్టత రాగానే డయాఫ్రమ్ వాల్ పనులకు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ చేపట్టి గడువులోగా పూర్తి చేయవచ్చని పేర్కొంది.
పునరావాసంపై ప్రత్యేక దృష్టి..
పోలవరం నిర్వాసితులకు దశలవారీగా తొలుత 41.15 మీటర్లు, ఆ తర్వాత 45.72 మీటర్ల వరకూ పునరావాసం కల్పించాలని కేంద్ర నిపుణుల కమిటీ సూచించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 8,277 కుటుంబాలకు పునరావాసం కల్పించామని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వివరించారు. మిగతావారికి ఆగస్టులోగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రీయింబర్స్ ప్రక్రియలో జాప్యం జరగడం పనుల పురోగతిపై ప్రభావం చూపుతోందని పేర్కొనగా దీనిపై కేంద్రానికి నివేదిస్తామని కమిటీ పేర్కొంది. కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లనుంది.
వారంలో జల్ శక్తి శాఖకు నివేదిక
రెండు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలో పరిశీలించిన అంశాలు, అధికారులతో సమీక్షలో వెల్లడైన అశాలను బేరీజు వేసి పోలవరాన్ని గడువులోగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు కేంద్ర నిపుణుల కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై పీపీఏ, జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment