ఆలమట్టి ఆనకట్ట ఎత్తు పెంచే ప్రాజెక్టుకు ముందుగా కేంద్ర జల మండలి (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.
అంతర్ రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీకి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా సీడబ్ల్యూసీ పరిశీలించాల్సిందేననీ, ఆ తర్వాతే తాము ఎత్తు పెంపుపై మరోసారి ఆలోచిస్తామని కమిటీ చెప్పింది. సాధారణంగా కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టులకు జల వనరుల మంత్రిత్వ శాఖ అనుమతులిస్తుంది. ఎగువ కృష్ణానది ప్రాజెక్టులో భాగంగా ఆనకట్ట ఎత్తును పెంచి మరిన్ని నీళ్లను నిల్వ చేసి కొత్తగా 4 ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు కర్ణాటక ప్రణాళికలు రచిస్తోంది. వీటి ద్వారా ఉత్తర కర్ణాటకలోని 7 జిల్లాల్లో 5.3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎత్తు పెంచితే 907 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకునే సామర్థ్యం కర్ణాటకకు లభిస్తుంది. అయితే కర్ణాటక ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలు కేంద్రం, ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ వద్ద గతంలో పలుమార్లు అభ్యంతరాలు లేవనెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ తాజా నిర్ణయం కర్ణాటకకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.