నాణ్యత డొల్ల | Expert Committee inspection of Polavaram project | Sakshi
Sakshi News home page

నాణ్యత డొల్ల

Published Fri, Sep 7 2018 3:56 AM | Last Updated on Fri, Sep 7 2018 5:10 AM

Expert Committee inspection  of Polavaram project  - Sakshi

పోలవరం స్పిల్‌ వే ప్రాంతంలో కాంక్రీట్‌ వాల్‌ను పరిశీలిస్తున్న సీడబ్ల్యూసీ సభ్యుడు వైకే శర్మ

సాక్షి, పోలవరం/పోలవరం రూరల్‌/అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) స్పిల్‌వే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడాన్ని కేంద్ర నిపుణుల కమిటీ తప్పుబట్టింది. స్పిల్‌వే పనుల్లో ఉపయోగిస్తున్న సిమెంట్, స్టీల్‌ నాసిరకంగా ఉన్నాయని తేల్చింది. సెంట్రింగ్‌(ఇనుప కడ్డీలను వంచడం) పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల కాంక్రీట్‌ పనుల్లో పటిష్టత ఉండదని పేర్కొంది.

పోలవరం జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు చేపట్టిన స్పిల్‌వే పనుల్లో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేసింది. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాక.. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర సర్కారు ‘నిపుణుల కమిటీ’ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు పోలవరం పనులను పరిశీలించిన ఈ కమిటీ, ఆయా సందర్భాల్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలు తీవ్ర ప్రకంపనలు రేపాయి.

స్పిల్‌వేకు చీలికలు
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలో సీడబ్ల్యూసీ సీఈ ఆర్కే పచౌరి, సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.కె.సింగ్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈ ఏకే ప్రధాన్, శాస్త్రవేత్త ఆర్‌.చిత్ర, పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా తదితరులు సభ్యులుగా ఉన్న కేంద్ర నిపుణుల కమిటీ గురువారం పోలవరం స్పిల్‌వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కాంక్రీట్‌ మిశ్రమంలో ఉపయోగిస్తున్న సిమెంట్, ఇసుక, కంకర నాణ్యతను పరీక్షించింది. సిమెంట్‌ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసింది.

అనంతరం స్పిల్‌ వే పనులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంది. స్పిల్‌వే(సిమెంటు గోడ)కు అక్కడక్కడ గ్యాప్‌లు(చీలికలు) ఏర్పడటాన్ని గుర్తించింది. నాసిరకమైన స్టీల్, సెంట్రింగ్‌ ఇష్టారాజ్యంగా చేయడం, నాణ్యత లేని సిమెంట్‌తో కూడిన మిశ్రమాన్ని వినియోగించి పనులు చేయడం వల్లే స్పిల్‌ వేలో చీలికలు ఏర్పడ్డాయని తేల్చింది. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంపై అధికారులను నిలదీసింది. నాణ్యతపై ఇకనైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది.

ఇలాగైతే కష్టమే..
క్షేత్రస్థాయి పరిశీలనకు ముందు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు హెడ్‌ వర్క్స్‌ వద్ద జలవనరుల శాఖ కార్యాలయంలో కేంద్ర కమిటీ సభ్యులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. స్పిల్‌వే పనులను నవంబర్‌ నాటికి పూర్తి చేస్తామని.. వరద తగ్గాక కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేపడతామని చెప్పారు. 2019 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. సగటున రోజుకు ఆరు వేల క్యూబిక్‌ మీటర్ల చొప్పున కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని అధికారులు వివరించారు.

అలాగైతే స్పిల్‌వే పనులు నవంబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశమే లేదని కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు. పనులను వేగవంతం చేస్తూనే నాణ్యత పాటించాలన్నారు. ఇప్పటికే చేసిన పనులకు రూ.2200 కోట్లకుపైగా కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉందని,  సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల(డీపీఆర్‌–2)ను ఆమోదించేలోగా పనులను వేగవంతం చేయడానికి రూ.10 వేల కోట్లను అడ్వాన్సుగా ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని అధికారులు కోరారు. దీనిపై కమిటీ సభ్యులు స్పందిస్తూ.. డీపీఆర్‌–2 ఆమోదం మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు.

డయాఫ్రమ్‌ వాల్, జెట్‌ గ్రౌటింగ్‌పై సందేహాలు
ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పునాది(డయాఫ్రమ్‌ వాల్‌) గోదావరి వరద ప్రవాహంలో మునిగిపోవడంతో వాటి నాణ్యతను కేంద్ర కమిటీ పరిశీలించలేకపోయింది. కాఫర్‌ డ్యామ్‌ పునాది(జెట్‌ గ్రౌటింగ్‌) పనులను కూడా పరిశీలించలేదు. వాటి నాణ్యతపైనా కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గాక నాణ్యతను పరిశీలించాలని నిర్ణయించింది. పరిశీలన పూర్తయ్యాక కమిటీ ఛైర్మన్‌ వైకే శర్మ మీడియాతో మాట్లాడారు. స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పారు. సిమెంట్, స్టీల్‌ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన హెడ్‌ వర్క్స్‌(జలాశయం) పనులపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు.

నేడు సమీక్షా సమావేశం
కేంద్ర నిపుణుల కమిటీ శుక్రవారం పోలవరం కుడి, ఎడమ కాలువలను పరిశీలించనుంది. అనంతరం పనుల ప్రగతి, నాణ్యతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజమహేంద్రవరంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. అనంతరం శుక్రవారం రాత్రికి కమిటీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. క్షేత్రస్థాయి పర్యటన, అధికారులతో నిర్వహించిన సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

రేలా పిటిషన్‌పైఏపీకి నోటీసులు
పోలవరంపై ‘సుప్రీం’ విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టువల్ల ముంపు ముప్పు ఉందని, స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ ఉత్తర్వులను పునరుద్ధరించాలని రేలా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై గురువారం జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

ముందుగా ఒడిశా ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. మరోవైపు.. ‘రేలా’ తరఫున న్యాయవాదులు జయంత్‌ భూషణ్, కె. శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఇంజినీర్ల సిఫారసుల మేరకు 2011లో కేంద్రం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ జారీ చేసిందని నివేదించారు. దీంతో ‘రేలా’ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసు లు జారీ చేస్తూ విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఒడిశా పిటిషన్‌తో పాటు ‘రేలా’ పిటిషన్‌ను కలిపి విచారిస్తామంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement