సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం విజయవాడలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టు పనుల తీరును రెండ్రోజులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిటీ ఈ సీజన్‌లో పూర్తి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనుంది. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాక, 3 నెలలకు ఒకసారి పనులను పరిశీలించి, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని ఇటీవల కేంద్రం పునర్ వ్యవస్థీకరించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కనీ్వనర్‌గా ఉన్న ఈ కమిటీలో సీఎస్‌ఆర్‌ఎంఎస్ డైరెక్టర్ ఎస్‌ఎల్ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి బీపీ పాండే, ఎన్‌హెచ్‌పీసీ మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్) డైరెక్టర్ దేవేంద్రకుమార్‌ను సభ్యులుగా నియమించింది.
శనివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడమ కాలువ పనులను పరిశీలించింది. ఆదివారం పోలవరం హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఎడమ గట్టు, కుడి గట్టు, అనుసంధానాలు (కనెక్టివిటీస్), ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్)లను తనిఖీ చేశారు. పనులపై పోలవరం సీఈ సుధాకర్‌బాబును ఆరా తీశారు. ఈ సీజన్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను కొలిక్కి తెస్తామని పోలవరం అధికారులు తెలిపారు. తద్వారా వచ్చే సీజన్‌లో వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి ప్రధాన ఆనకట్ట ఈసీఆర్‌ఎఫ్ పనులను నిర్విఘ్నంగా చేయడం ద్వారా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని వారు వివరించారు.
పునరావాస పనులు వేగవంతం
41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల్లోని 18,620 కుటుంబాలకుగానూ ఇప్పటిదాకా 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని పోలవరం అధికారులు కమిటీకి తెలిపారు. మిగతా 14,698 కుటుంబాలకు మేలోగా పునరావాసం కలి్పంచే పనులను వేగవంతం చేశామని వివరించారు. కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తి చేయాలంటే నిధులు అవసరమని, సవరించిన అంచన వ్యయ ప్రతిపాదనల (రూ.55,548.87 కోట్లు)కు ఆమోదముద్ర వేసి నిధులు విడదలయ్యేలా చూడాలని కేంద్ర కమిటీని కోరారు. ఇప్పటివరకూ చేసిన పనులకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.5,103 కోట్లను విడుదల చేసేలా చూడాలని కోరారు. అనంతరం కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులతో పోల్చితే నిర్వాసితుల సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయమే అధికమని, నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే ప్రధానమని చెప్పారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment