బెంగళూరు :
ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలి.. ఎలాంటి నేలల్లో ఏరకమైన ఎరువులు వాడాలి.. తదితర వివరాలన్నింటిని రైతన్నల అరచేతుల్లోకి తీసుకొచ్చింది బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ. బాగల్‌కోటె, బీజాపుర జిల్లాల్లోని ఎంపిక చేసిన 250 మంది ప్రగతిశీల రైతులకు ‘ఈ-కిసాన్’ పేరిట ఈ సంస్థ ట్యాబ్లెట్లను అందజేసింది.
బాగల్‌కోటెలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వాహకులు ఎస్‌ఆర్ పాటిల్ ఈ ట్యాబ్లెట్లను రైతులకు అందజేశారు. వ్యవసాయానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ఈ ట్యాబ్లెట్లలో నిక్షిప్తం చేసినట్లు ఐటీశాఖ మంత్రి ఎస్‌ఆర్ పాటిల్ వెల్లడించారు.
ప్రయోజనాలేంటి....
వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు కావలసిన అన్ని సూచనలను ఈ ట్యాబ్లెట్లలో పొందుపరిచారు. ట్యాబ్లెట్, అందులో పొందుపరిచిన సాఫ్ట్‌వేర్‌తో కలిపి మొత్తం ఒక్కో ట్యాబ్లెట్‌కు రూ.15 వేలను వెచ్చించారు. ఈ ట్యాబ్లెట్లకు బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ నుంచే ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. ఆరు నెలల పాటు రైతులకు పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నారు. ఇక కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రైతులు సమాచారాన్ని పొందవచ్చు.
ఇందులో సాధారణ పంటల సాగుతో పాటు ఉద్యాన పంటల సాగుకు కావలసిన సూచనలు, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వచ్చిన నూతన పరికరాలు, రైతులకు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు కల్పిస్తోంది, ఏయే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి రైతు శిక్షణా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి తదితర అన్ని వివరాలను రైతులు పొందవచ్చు. ఇందుకు గాను రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక ఈ ట్యాబ్లెట్లకు 3జీ కవరేజీ సౌకర్యాన్ని సైతం బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంస్థ కల్పిస్తోంది.