సాక్షి, అమరావతి: వ్యవసాయపనులు ఉండని ఈ వేసవి రోజుల్లోను గ్రామీణ ప్రాంతాల్లో పేదలు పనుల కోసం పట్టణాలకో, నగరాలకో వలస పోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా సొంత ఊళ్లలోనే పనులు కల్పిస్తోంది.
ఇప్పుడు రోజూ 30 లక్షల నుంచి 35 లక్షల మంది ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి జూన్ పదోతేదీ వరకు గత 70 రోజుల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 37.59 లక్షల పేద కుటుంబాలు ఈ పనులు చేసుకుని రూ.2,952.66 కోట్ల మేర లబ్ధిపొందినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అదికారులు వెల్లడించారు.
శనివారం (ఈ నెల పదోతేదీ) కూడా 35.70 లక్షల మంది సొంత ఊళ్లలోనే ఈ పనులు చేసుకుని లబ్ది పొందారు. మరోవైపు ఈ పనులకు హాజరయ్యేవారికి ఒక్కొక్కరికి రోజుకు సరాసరిన రూ.245 చొప్పున గిట్టుబాటు అవుతోందని, పనులకు హాజరయ్యేవారిలో 60 శాతం వరకు మహిళలే ఉంటున్నారని అధికారులు తెలిపారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపాధి పనులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య విరామం కల్పించింది.
ఎండతీవ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈ పనులు చేయిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల డ్వామాల పీడీలతో ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ వేసవిలో పేదలకు పనుల కల్పన కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారు.
11.62 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి
ఈ వేసవిలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 37.59 లక్షల గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఉపాధిహామీ పథకం పనులు చేసుకుని లబ్ది పొందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 8,36,826 ఎస్సీ కుటుంబాలు, 3,25,204 ఎస్టీ కుటుంబాలు (మొత్తం 11,62,030 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు) ప్రయోజనం పొందినట్లు చెప్పారు.
12.06 కోట్ల పనిదినాలు
గత నాలుగు సంవత్సరాల మాదిరే.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండని వేసవి కాలంలోను ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో ఈ ఏడాది కూడ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఈ వేసవిలో ఇప్పటివరకు 73.52 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించారు.
అందులో ఆరోవంతు (16 శాతానికి పైగా) మేర 12.06 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించిన మన రాష్ట్రం ఈ పథకం కింద పనుల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండోస్థానంలో ఉన్న తమిళనాడు 8.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు
కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment