సాక్షి ప్రత్యేక ప్రతినిధి నాగా వెంకటరెడ్డి : రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి, సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వారి కుటుంబాల ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మహిళలను పర్యావరణ హితులుగా కూడా మారుస్తున్నారు.
జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకంలో వీరిని భాగస్వాములను చేస్తున్నారు. టోల్‌ప్లాజాలు, నగర శివార్లలో వ్యాపార అవకాశాలను ఏ మేరకు కల్పించవచ్చనేది కూడా పరిశీలించాలని సీఎం జగన్ సెర్ప్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు ఆర్థికంగా కూడా తోడ్పాటు లభిస్తుంది. స్వయం సంమృద్ధికి బాటలు వేసుకోనున్నారు. మహిళల జీవన ప్రమాణాలు కూడా పెంపొందుతాయి.
రూ.1.57 కోట్ల ప్రాజెక్టులో 761 సంఘాల భాగస్వామ్యం
నేషనల్ రూరల్ లైవ్‌లీ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం), నేషనల్ హైవేస్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) మధ్య గత ఏడాది కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటి వాటిని అయిదేళ్ల పాటు రక్షించి ఎన్‌హెచ్‌ఎఐకి అప్పజెప్పాలి.
ఈ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ పరి«ధిలోని ‘సెర్ప్’ తీసుకుంది. తొలుత ఎన్‌హెచ్– 544డి పరిధిలోని గిద్దలూరు – వినుకొండ సెక్షన్‌లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి– ఉమ్మడివరం గ్రామాల మధ్య ఉన్న 17.74 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా (మొత్తం 35.48 కి.మీ) 5,907 మొక్కలు నాటాలి.
గుంతలు తవ్వకం, మొక్కలు కొని నాటడం, కంచె ఏర్పాటు, నీటి సరఫరా, ఎరువులు వేయడం, అయిదేళ్ల పాటు పెంచే బాధ్యతలను త్రిపురాంతకం, పెదారవీడు మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 761 డ్వాక్రా సంఘాల్లోని 7,610 మంది సభ్యులకు ‘సెర్ప్’ అప్పగించింది. ఇందుకోసం ఎన్‌హెచ్‌ఏఐ అయిదేళ్లకు రూ.1.57 కోట్లు ఇస్తుంది. త్రిపురాంతకం, పెదారవీడు మండల సమాఖ్యలు, ఆరు గ్రామైక్య సంఘాలు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి.
ఏడాదిలో 3 నెలలు ఉపాధి.. దినసరి వేతనం రూ.400
ప్రాజెక్టులో భాగస్వాములవుతున్న ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి ఏడాదికి సుమారు మూడు నెలలు ఉపాధి లభిస్తుంది. సగటున దినసరి వేతనం రూ.400 వస్తుంది. తద్వారా ఏడాదికి రూ.36 వేలు చొప్పున అయిదేళ్లలో రూ.1.80 లక్షలు సమకూరుతుందని. ఈ స్వయం సహాయక సంఘాలకు గ్రామైక్య సంఘాలు నేతృత్వం వహిస్తాయి. డీఆర్‌డీఏ, సెర్ప్ ఉన్నతాధికారుల మార్గదర్శనం చేస్తారు.
కాంట్రాక్టు వ్యవస్థను దరిజేరనీయకుండా డ్వాక్రా సంఘాలే నీటి సరఫరాకు ట్యాంకర్లు, గుంతలు తవ్వేందుకు యంత్ర పరికరాలు, ఎరువులు సమకూర్చే బాధ్యతలను తీసుకున్నందున వ్యాపార వ్యవహారాలలోనూ వారికి అనుభవం వస్తుంది. ఎన్‌హెచ్‌ఏఐ నిర్దేశించిన మేరకు 5,907 బొగోనియా, స్పాథోడియా, మిల్లింగ్ టోనియా, మారేడు, పొగడ మొక్కలను ప్రభుత్వ నర్సరీలలోనే డ్వాక్రా సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి.
పచ్చదనం పెంపునకు ప్రణాళిక
రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో 24.62 శాతం గ్రీనరీ ఉండగా రాష్ట్రంలో 22.86 ఉంది. ఈ వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై కోటి మొక్కలు పెంచాలన్నది గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం. 660 మండలాల్లోని వెయ్యి కొండలనైనా ఎంపిక చేసుకుని ఒక్కో కొండపై కనీసం 10 వేల మొక్కల పెంపకం చేపట్టనుంది. సీడ్ బాల్స్ విధానంలో ఫలాలనిచ్చే ఉసిరి, రేగు, సీతాఫలం, వెలగ, నీడనిచ్చే వేప, కానుగ తదితర మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉపాధి హామీలో మొక్కల పెంపకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం ఓ ముఖ్యాంశం. పొదుపు సంఘాల మహిళలు ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. రాష్ట్ర , జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల వెంబడి మొక్కలు నాటి పెంచే ప్రక్రియను డ్వాక్రా సభ్యులు చేపట్టిన సంగతి తెలిసిందే. రానున్న కాలంలో జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకంలోనూ భాగస్వాములు కానున్నారు.
వ్యాపార అవకాశాలపైనా దృష్టి
గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని 8.64 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలలో దాదాపు 90 లక్షల మంది సభ్యులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మెప్మాలో లక్ష గ్రూపులు, పది లక్షల మంది వరకు సభ్యులు ఉన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా 2023 నాటికి 8,744 కిలోమీటర్లకు పెరుగుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా తిరుపతిలో ప్రకటించారు.
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవ, వేగం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ఈ జాతీయ రహదారులను ఉపయోగించుకొంటూ మహిళలకు పలు వ్యాపార అవకాశాలివ్వాలన్నది సీఎం జగన్ సంకల్పం. ఈమేరకు అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు.
రహదారుల టోల్‌ప్లాజాలు, ప్రధాన కూడళ్లు, నగర శివార్లలోని ఎన్‌హెచ్‌ఏఐ స్థలాల్లో స్థానిక డ్వాక్రా సంఘాలతో ఫుడ్ ప్లాజాలు, అవుట్‌లెట్‌ల ఏర్పాటు, గ్రామీణ ఉత్పత్తుల విక్రయాలకు స్టాళ్లు ఏర్పాటు చేయించాలని, ఇందుకోసం ఎన్‌హెచ్‌ఎఐతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారని సెర్ప్ సీఈవో ఎండి ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment