ఉపాధిహామీ పనులపై కేంద్రం ఫోకస్
శాశ్వత ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచన
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై కేంద్రం దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో ఫోకస్ ఏరియాల్లో ఉపాధి పనులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిం ది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనతో పాటు శాశ్వత ఆస్తులను ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలవుతున్న సుమారు 5,000 పాఠశాలలల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ కింద కిచెన్‌షెడ్స్ (వంటగదులు), అంగన్‌వాడీల ఏర్పాటు, వ్యవసాయ భూముల్లో వర్షపునీటిని ఒడిసి పట్టేందుకు 55వేలకు పైగా ఫామ్ పాండ్స్, నివాస ప్రాంతాల్లో రెండు లక్షలకు పైగా ఇంకుండు గుంతలు, సేంద్రియ ఎరువుల తయారీ నిమిత్తం 95 వేల వర్మీ కంపోస్ట్ పిట్‌లు, స్వచ్ఛభారత్ గ్రామీణ్ కింద మూడు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి విభాగం ప్రణాళికలను సిద్ధం చేసింది.
15 కోట్ల పనిదినాలకు ప్రణాళికలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధిహామీ కింద 15 కోట్ల పనిదినాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వచ్చే ఏడాది కనీసం 13.72 కోట్ల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత ్వం తాజా బడ్జెట్లో రూ. 2,352.78 కోట్ల అంచనాను ప్రతిపాదించింది. ఉపాధిహామీ కార్యక్రమాల్లో శాశ్వత ఆస్తుల కల్పన నిమిత్తం ఒక్కొక్క ఫామ్‌పాండ్‌కు రూ. 35 వేల నుంచి 55 వేలు, వర్మీ కంపోస్ట్ పిట్ ఏర్పాటుకు రూ. 16 వేలు, ఒక్కో ఐహెచ్‌ఎల్(మరుగుదొడ్డి)నిర్మాణానికి రూ. 12 వేలు, ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ. 8 లక్షలు, ఇంకుడుగుంతకు రూ. 6 వేలు వంటగదికి రూ. రెండు లక్షల చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు.
ఇవి కాక రూ. 120 కోట్లతో సిమెంట్‌రోడ్లు, రూ. 70 కోట్లతో 1,000 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు, రూ. 100 కోట్లతో జీవనోపాధికి సంబంధించిన పనులు(పశువుల షెడ్లు, కోళ్ల పెంపకం..తదితర), తెలంగాణ హరితహారం కార్యక్రమానికై రూ. 250 కోట్లతో నర్సరీల ద్వారా మొక్కల పెంపకం.. తదితర కార్యక్రమాలను ఉపాదిహామీ పథకం ద్వారా చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. రూర్బన్ మిషన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 17 సమూహా (క్లస్టర్)ల్లో నాలుగు సమూహాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రం మంజూరు చేసిన కస్టర్లలో రంగారెడ్డి జిల్లాలోని ఆల్లాపూర్, మెదక్ జిల్లాలోని ర్యాకల్, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లె క్లస్టర్లున్నాయి.