నిజామాబాద్‌అర్బన్,న్యూస్‌లైన్ :
సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కల్టెకర్ ప్రద్నుమ్న పేర్కొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం...సాధారణ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ ఏప్రిల్ 2న విడుదల కాగా, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.ప్రతి మండలానికి ఐదు వీడియో బృందాలు పనిచేస్తాయన్నారు. ఎన్నికల్లో చోటు చేసుకునే ప్రతి అంశంపై,అభ్యర్థులు నిర్వహించే సభలు సమావేశాలు,ర్యాలీలు, ప్రచారం కార్యక్రమాలపై అధికారుల ప్రత్యేక నిఘా ద్వార వీడియో చిత్రీకరణ చేస్తారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా బ్యాలెట్ ఓటును పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్, సెక్టోరల్ అఫీసర్లను నియమించామని కలెక్టర్ తెలిపారు. రిటర్నింగ్ అధికారుల అనుమతి లేకుండా అభ్యర్థులు ఎలాంటి సభలు, సమావేశాలు,ర్యాలీలు చేపట్టకూడదన్నారు. ప్రచారంలో ఉపయోగించే వాహనాలకు అనుమతి లేకపోతే సీజ్ చేస్తామన్నారు. ఓటర్లను ప్రభావం చేసే అంశాలపైనా, అభ్యర్థులు ఓటర్లపై ఒత్తిడి తీసుకువచ్చినా, భయభ్రాంతులకు గురిచేసిన అంశాలపై అధికారుల బృందాలు అధ్యయనం చేస్తాయన్నారు. కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో కళాజాతా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తినా, ఓటర్లకు సందేహం కలిగినా నివృత్తి చేసేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఈ టోల్‌ఫ్రీ నంబర్ 18004256644 సంప్రదించవచ్చన్నారు. లేదా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. పత్రికలలో లేదా టెలివిజన్ ఛానల్స్‌లో ప్రచురించే పేయిడ్ న్యూస్ గుర్తించి వాటి ఖర్చును అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామన్నారు. అభ్యర్థులు ఎన్నికల సామగ్రి కోసం చేసే ఖర్చు రూ. 10 వేలు మించకూడదన్నారు.
ఐదు కేసులు నమోదు : ఎస్పీ
జిల్లా ఎస్పీ తరుణ్‌జోషీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న రూ. 14.81 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో సమస్యాత్మక,అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా గ్రామాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలోని 9 నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్‌లలో, పోలీసు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు వినియోగించే ప్రతి వాహనానికి అనుమతి పత్రాలు ఉండాలన్నారు. బెల్టు షాపులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. లెసైన్స్ ఆయుధాలు కలిగిన ప్రతి ఒక్కరు సంబంధిత పోలీసు స్టేషన్‌లలో డిపాజిట్ చేయాలని సూచించారు. అభ్యర్థులు చేసే ప్రచారం ఎవరికీ ఇబ్బంది కలుగకుండా ఉండాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ప్రచారం కోసం మైకులు వాడాలన్నారు. మందిరాలు, మజీదులు, చర్చిలు,ప్రార్థనల స్థలాలలను ప్రచారం కోసం వాడకూడదన్నారు.
వీడియో నిఘాలో ఎన్నికలు
Published Fri, Mar 7 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement