ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ‘సంక్షేమాన్ని’ చక్కదిద్దేందుకు మొన్నటి వరకు ఆయా శాఖల జిల్లా అధికారులను వసతి గృహాల బాట పట్టించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. నెలకు రెండు సార్లు వసతి గృహాల్లో రాత్రుల్లో బస చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలేంటో ప్రోఫార్మాలో నమోదు చేయించారు. ఇప్పుడు వారం రోజులుగా ఫోన్ ద్వారా పర్యవేక్షణ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాలు మొత్తం ఎన్ని ఉన్నాయి..వార్డెన్లు ఎందరు, వారి సెల్‌ఫోన్ నెంబర్లతో పాటు ఒక్కో వసతి గృహంలో ఎందరు విద్యార్థులు ఉంటున్నారు.. వారి పేర్లతో సహా పూర్తి వివరాలను కలెక్టర్ సంక్షేమాధికారుల దగ్గరి నుంచి సేకరించారు.
ఈ వివరాన్ని కాల్ సెంటర్ ఉద్యోగులకు అందజేశారు. ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కాల్ సెంటర్ ఉద్యోగులు ఐదు ఎస్సీ, రెండు బీసీ,ఒక ఎస్టీ వసతి గృహాల వార్డెన్‌లకు ఫోన్ చేసి వారు ఎక్కడున్నారో అడిగి తెలుసుకుంటారు. పని చేయాల్సిన సమయంలో వసతి గృహంలో లేకపోతే కారణాలేంటో రికార్డు చేస్తారు. కాగా వార్డెన్‌కు ఫోన్ చేసిన సమయంలో కాల్ సెంటర్ ఉద్యోగులు ఒక విద్యార్థి పేరు చెప్పి మాట్లాడించాలని సూచించిన వెంటనే సదరు విద్యార్థితో మాట్లాడించాలి. ఈ రోజు ఏం భోజనం పెట్టారు..? మీకు రోజు మెనూ ప్రకారం భోజనం,గుడ్లు,పాలు ఇతర ఆహారం అందిస్తున్నారా..? లేదా..? అనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఒక వేళ సమాచారం లేకుండా వార్డెన్ బయటకు వెళ్లినా... పేరు చెప్పిన విద్యార్థి లేకపోయినా ఇక ఆ వార్డెన్ సంగతి అంతే. అలాగే కాల్ సెంటర్ ఉద్యోగులు వార్డెకు ఫోన్ చేసిన సమయంలో ఫోన్ ఎత్తకపోయినా.. ఫోన్ స్విచ్ఛాప్ చేసినా... ఆ వార్డెన్ పేరు,సెల్ నెంబరు వివరాలతో కలెక్టర్‌కు నివేదిక అందిస్తారు. వారిపై కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. మరోసారి పునరావృతం అయితే నోటీసులు కూడా జారీ చేయనున్నారు. ఈపాటికే ముగ్గురు వార్డెలపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు...
వసతి గృహాల పర్యవేక్షణకు కలెక్టర్ శ్రీకారం చుట్టిన కాల్ సెంటర్ కార్యక్రమంతో ‘సంక్షేమం’ గాడిన పడుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు సైతం రాత్రి వరకు స్థానికంగా ఉంటూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టడమే కాకుండా, సాయంత్రం నుంచి రాత్రి వరకు వారికి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అయితే కాల్ సెంటర్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందోనని వార్డెన్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తమ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తేచాలు కాల్ సెంటర్ వారేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇటు విద్యార్థులతో మాట్లాడిస్తే వారు ఏం చెబుతారోనని, వారికి ముందుగానే చెప్పి జాగ్రత్త పడుతున్నారు.