indur
-
షెడ్యూల్ ప్రకారమే ఇందూరు ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ (ఇందూరు) లోక్‌సభ స్థానానికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర ఇన్చార్జి ఉమేశ్ సిన్హా స్పష్టం చేశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తుండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనుమానాలకు తెరదించారు. నిజామాబాద్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందంతో కలసి ఉమేశ్ సిన్హా సమీక్షించారు. మంగళవారం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్, సీఈఓ రజత్‌కుమార్‌తో కలసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇందూరులో ఏర్పాట్లపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ‘నిజామాబాద్ ఓ అసాధారణ కేసు. 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ అక్కడ ఈవీఎంలు, వీవీప్యాట్లతో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన సందర్భంలో ఈవీఎంలు, వీవీప్యాట్లతో ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈవీఎంను తొలిసారిగా కనుగొన్నది హైదరాబాద్‌లోనే. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులున్నా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్రానికి ఇది మరో మైలురాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌యూనిట్‌ను వాడబోతున్నాం’అని ఉమేశ్ జైన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లును మాత్రమే వాడారన్నారు. అన్నీ సమయానికి పూర్తయ్యేలా! ‘బీహెచ్ఈఎల్ కంపెనీ నుంచి ఈవీఎంల లాట్ ఒకటి బుధవారానికి నిజామాబాద్ చేరుకుంటుంది. ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రతీది సమయానికి పూర్తవుతుందని ఆశిస్తున్నాం. ఈవీఎంల టెస్టింగ్, ఇతర ప్రక్రియలన్నీ సమయానికి పూర్తవుతాయని భావిస్తున్నాం. ఈ యంత్రాలను బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్‌తో పాటు ఇక్కడున్న సాంకేతిక బృందం ఇప్పటికే పరీక్షించిచూసింది. ఈ ఏర్పాట్లు సజావుగా పూర్తవుతాయని భావిస్తున్నాం’అని ఉమేశ్ సిన్హా పేర్కొన్నారు. సవాలుగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నేటి నుంచి ఈవీఎంలకు ఎఫ్ఎల్సీ ‘నిజామాబాద్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం, సీఈఓ కార్యాలయం, బీహెచ్ఐఎల్, ఈసీఐఎల్ అధికారులతో సోమవారం రాత్రి సవివరంగా చర్చించాం. మంగళవారం ఉదయం కూడా బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ సీనియర్ అధికారుల బృందంతో చర్చిచాం. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎన్నికలకు 25వేల బ్యాలెట్ యూనిట్లు, 2వేల కంట్రోల్ యూనిట్లు, 2వేల వీవీప్యాట్ యంత్రాలతో పాటు ప్రథమ స్థాయి తనిఖీల (ఎఫ్ఎల్సీ) నిర్వహణకు 600 మంది ఇంజనీర్లు అవసరం. బుధవారం ఉదయం ఈవీఎంల ఎఫ్‌ఎల్‌సీను ఇంజనీర్లు ప్రారంభిస్తారు. పోలింగ్ ముగిసే వరకు వారు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగంపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ కోసం మాస్టర్ ట్రైనర్లను నియమించాం’అని ఉమేశ్ సిన్హా తెలిపారు. సెక్టోరల్ అఫీసర్లు, పోలింగ్ సిబ్బంది సంఖ్య సైతం పెరిగిందన్నారు. సాధారణంగా సెక్టోరల్ అధికారులు 8–10 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారని, నిజామాబాద్ విషయంలో మాత్రం ఒక సెక్టోరల్ అధికారికి 5, అంతకు తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. జోనల్ అధికారులు, ఇతర పర్యవేక్షక అధికారుల సంఖ్యను పెంచనున్నామన్నారు. నిజామాబాద్ ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు వస్తున్నారన్నారు. ఎన్నికల సిబ్బంది శిక్షణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు జరిగాయన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగంపై ప్రజల్లో విసృత అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, పోస్టర్లతో అవగాహన కల్పిస్తామన్నారు. ఈవీఎంల వినియోగంపై ప్రజలు, పార్టీలు, అభ్యర్థులకు అవగాహన కేంద్రాలను జిల్లా, అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. -
ఐడీసీఎంఎస్ డీలా
ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో కొనసాగిన ఐడీసీఎంఎస్ క్రమంగా డీలా పడుతోంది. రూ.కోట్లలో స్థిరాస్తులున్నా.. సంస్థలోని ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని దుస్థితిలో ఉంది. కీలక బాధ్యతల్లో కొందరు అక్రమార్కుల కారణంగానే ఈ స్థితికి చేరిందని సంస్థలోని ఉద్యోగుల నుంచే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నిర్వహణకే పరిమితమైన ఐడీసీఎంఎస్, వీటి ద్వారా వచ్చే కమీషన్‌తోనే ఖర్చులు వెళ్లదీస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సహకార సంఘాలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ ఐడీసీఎంఎస్ (ఇందూరు జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పలు వ్యాపార కార్యకలాపాలు.. రూ.కోట్లలో టర్నోవర్.. ఇలా ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు కనీసం ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా జీతభత్యాలు చెల్లించలేని స్థితికి దిగజారింది. పాలకవర్గం పట్టింపులేని ధోరణి ఒకవైపు.. సంస్థ అధికారుల అలసత్వం మరోవైపు.. సంస్థ ప్రతిష్ట మసకబారడానికి కారణమవుతున్నాయి. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులకు రెండునెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ దాదాపు ఏడాదిన్నర కాలంగా చెల్లించలేదు.. ఇది సంస్థ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఐడీసీఎంఎస్‌కు జిల్లాలో వివిధ చోట్ల రూ. కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ వంటి పట్టణాల్లో ప్రధాన వ్యాపార కూడళ్లలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, గోదాములు, స్థలాలున్నాయి. వాటి నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్మూర్‌లో 18 షాపుల మడిగెలుండగా వీటి కిరాయి వసూళ్లు అస్తవ్యస్తంగా మారింది. వీటి అగ్రిమెంట్ పూర్తై ఏడాది గడుస్తున్నప్పటికీ కేటాయింపుల ప్రక్రియ చేపట్టలేదు. కొన్ని మడిగెలకైతే ఏడాది కాలంగా అద్దె వసూలు చేయకపోవడం గమనార్హం. కొందరు ‘గుడ్‌విల్’ పేరుతో పైపైన జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కీలక బాధ్యతల్లో అక్రమార్కులు.. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, సస్పెన్షన్ వేటు పడిన అధికారులు ఈ సంస్థలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి కారణంగానే సంస్థ పరిస్థితి ఇలా మారిందని సంబంధిత వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గతంలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో సూపర్‌మార్కెట్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా తయారవడంతో ఇందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దానిని లీజుకు తీసుకుని నడిపారు. ఈ వ్యవహరంలో రూ.లక్షల్లో అవకతవకలు జరిగినట్లు సహకార శాఖ విచారణలో తేలింది. దీంతో సంబంధిత అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు ఈ అధికారే ఈ సంస్థ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ‘కొనుగోలు కేంద్రాల’కే పరిమితం.. ప్రస్తుతం ఈ సంస్థ ధాన్యం, సోయా కొనుగోలు కేంద్రాల నిర్వహణకే పరిమితమైంది. వీటి ద్వారా వచ్చే అరకొర కమీషన్ మొత్తంతో సంస్థ ఖర్చులు వెళ్లదీసుకునే స్థితిలో ఉంది. కొన్ని సీజన్లలో ఫర్టిలైజర్ సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ హాస్టళ్లకు నిత్యావసర సరుకుల కాంట్రాక్టు పొందిన ఈ సంస్థ వాటి సరఫరాను సక్రమంగా నిర్వహించకపోవడంతో సరుకులు పనికి రాకుండాపోయా యి. నెలలపాటు సరుకులు గోదాముల్లో నిల్వ ఉంచడంతో భారీ మొత్తంలో సంస్థకు నష్టం వాటిల్లింది. పలు అవకతవకలు.. ఐడీసీఎంఎస్ కార్యకలాపాల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల కిత్రం ఐడీసీఎంఎస్ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు హమాలీ చార్జీల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా చెక్కుల ద్వారా ఈ మొత్తాన్ని డ్రా చేసుకుని కొన్ని గ్రామాల్లోని రైతులకు మాత్రమే పంపిణీ చేశారనే విమర్శలున్నాయి. నిధులు రావాల్సి ఉంది.. నిధులు అందుబాటులో లేకపోవడంతో రెండునెలల జీతాలు చెల్లించలేకపోయాం. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన కమీషన్ రాగానే చెల్లిస్తాం. మడిగెల అద్దె వసూలుకు చర్యలు తీసుకుంటాం. వ్యాపార కార్యకలాపాల నిర్వహణపై పాలకవర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మా బాధ్యత. – బి.రమేశ్, ఐడీసీఎంఎస్ మేనేజర్ -
ఇండోర్.. ఇకపై ఇందూర్?!
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన ఇండోర్.. పేరును మార్చేందుకు అధికార భారతీయ జనతాపార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. ఇండోర్ పేరును ఇందూర్‌గా మార్చాలంటూ ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కౌన్సెలర్ ప్రతిపాదించారు. ఇంద్రేశ్వర్ మహాదేవుడి పేరు మీద ఈ నగరం ఏర్పడిందని.. కాల క్రమంలో అది కాస్తా ఇండోర్‌గా రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు. ‘ఎవరు అంగీకరించినా. అంగీకరించకపోయినా.. ఇది చరిత్ర వాస్తవం. దీనిని ఎవరూ మార్చలేరు. ఈ నగరం ఇంద్రేశ్వర్ పేరుమీద ఏర్పడింది. ఇప్పుడు తిరిగి దీనిని ఇందూర్‌గా మార్చాలి’ అని బీజేపీ కౌన్సెలర్ సుధీర్ డిగ్డే స్పష్టం చేశారు. హోల్కర్ రాజుల కాలంలో ఈ పట్టణాన్ని ఇందూర్ అని పిలిచేవారని.. ఈ పేరును బ్రిటీష్ అధికారులు ఇండోర్‌గా మార్చారని ఆయన పేర్కొన్నారు. ఇండోర్ నగరానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను సైతం సుధీర్ డిగ్డే మునిసిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకువచ్చారు. డిగ్డే ప్రతిపాదనపై మునిసిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ సింగ్ నరుకా స్పందించారు. తదపరి సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
అంగన్వాడీల పనివేళల్లో మార్పు
ఇందూరు, న్యూస్‌లైన్ : వేసవిని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండే అంగన్వాడీ పని వేళల్లో మార్పులు చేశారు. వేసవి కాలం ముగిసే వరకు ఇక నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరకు అంగన్వాడీ కేంద్రాలను నడిపించాలని ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సోమవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి పంపించారు. మే నెల నుంచి వేసవి ముగిసే వరకు ఈ సమయ వేళలను పాటించాలని, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీలో కార్యకర్తలు, ఆయాలు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని ఐసీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని అంగన్వాడీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్యకర్తలకు, ఆయాలకు, లింక్ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేసి వారి ఖాతాల్లో వేయాలని ఐసీడీఎస్ కమిషనర్ పీడీ రాములుకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్తలకు, ఆయాలకు 15 రోజుల సెలవులు అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు 15 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చినట్లు ఐసీడీఎస్ పీడీ రాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే ఒకటి నుంచి 15వ తేదీ వరకు కార్యకర్తలు, 15 నుంచి 30వ తేదీ వరకు ఆయాలు సెలవులో వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కార్యకర్తలు సెలవులో ఉన్నందున ఆయాలే అంగన్వాడీలను నడపాలని, ఆయాలు సెలవులో వెళ్లినప్పుడు కార్యకర్తలు నడపాలన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం చేసి, అంగన్వాడీలను నడపకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఊరులో ప్రచార హోరు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేడి రేపు మూగబోనున్న ‘తొలి విడత’ మైకులు 6న మొదటి విడత, 11న రెండో విడత పోలింగ్ వీధులను జల్లెడ పడుతున్న అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన ఇందూరు, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల ఆరున జరిగే ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారం నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులకు నిర్దేశించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 18 మండలాలలో 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ రిటర్నింగ్ అధికారికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఈనెల 11న జరిగే రెండో విడత ఎన్నికలకు 9వ తేదీలోగా ప్రచారం ముగిం చాలని సూచించింది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థు లు ప్రచార జోరును ఒక్కసారిగా పెంచారు. పల్లెల్లో గల్లిగల్లీకి తిరుగుతూ ఓట్ల కోసం జల్లెడ పడుతున్నారు.ప్రత్యేకంగా వాహనాలకు మైక్‌లు బిగించి ప్రచారం చేయిస్తున్నారు. కళాకారుల బృందాలను ఏర్పాటు చేసి ఆట, పాట లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోటీ అభ్యర్థులు గ్రామ సర్పంచులను, నాయకులను వెంటేసుకుని ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు విరామమెరుగక ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎక్కడ లేని ఆప్యాయతను ఒలకబోస్తూ ఓటర్లను పలకరిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి వేయాలని ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి రహస్యంగా మ ద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అభ్యర్థులు సైతం నిబంధనలు అతిక్రమించి ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారులు హెచ్చ రికలు జారీ చేశారు. -
రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ఇందూరు, న్యూస్‌లైన్ : జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మే7న ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జిల్లాలోని రాజకీయ పక్షాలకు, అధికారులకు ఊరట నిచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 30న జరుగ నుండగా, ఎంపీ,ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులు ఉపశమనం పొం దారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలి తా లు తమ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఇప్పటి వరకు వారు ఆందోళ న చెందారు. ప్రస్తుతం జిల్లాలో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మున్సిపాలిటీల్లోనైతే ప్రధాన పార్టీలు దూకుడును పెంచాయి. డివిజన్లు, వా ర్డు స్థానాలకు పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించాలని పార్టీల జిల్లా స్థాయి నేతలు గల్లీలను చుట్టుముడుతున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే రేపటి సార్వత్రిక ఎన్నికల్లో తమకు లాభించవచ్చేనే ఆశాభావంతో వారు ఉంటున్నారు. ఇ ది లా ఉండగా పార్టీల గుర్తుపై మున్సిపల్,పరిషత్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రధానంగా అభ్యర్థుల వ్యక్తిత్వ ం, గుణగణాలను పరిగణనలోకి తీసుకుని ఓట్లు పడతాయనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయి. ఏప్రిల్ 6న మొద టి విడత, ఏప్రిల్ 11న రెండో విడత ఎన్నికలు నిర్వహించగా.. మే 7న ఫలితాలను ప్రకటిస్తారు. రెండు విడత ల్లో ఎన్నికల నిర్వహణ అధికారులకు సైతం సిబ్బంది సమస్యను తీర్చనుం ది. ఎన్నికలు వరుసగా రావడంతో ఎన్నికల విధులకు సిబ్బందిని కేటాయించడం ఎలాగని అధికారులు అంతర్మథనం చెందారు. ప్రస్తుతం జిల్లాలోని 36 మండలాలను విభజించి విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. -
నామినేషన్ల ఘట్టం ముగిసింది
ఇందూరు, న్యూస్‌లైన్: నాలుగు రోజులుగా కొనసాగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా నా మినేషన్లు దాఖలు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్లు వేయడానికి మండలాల నుంచి రాజకీయ నాయకులు, అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అభ్యర్థుల తాకిడి భారీగా కొనసాగింది. సమయం దాటిన తరువాత, అప్పటికే అక్కడ ఉన్న 150 మంది అభ్యర్థులను జిల్లా పరిషత్లోపలికి అనుమతించారు. టోకెన్ల ద్వారా వారి నామినేషన్లను క్రమ సంఖ్యలో తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు. ఒక్క సారిగా అభ్యర్థులు లోనికి రావడంతో అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. మండల కార్యాలయాలలో కూడా ఎంపీటీసీకి పోటీ చేసే అభ్యర్థులు పోటీపోటీగా నిమినేషన్లు వేశారు. నాలుగో రోజు దాదాపుగా జడ్పీటీసీకి 500 మంది అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. ఎంపీటీసీకి సూమారుగా 3వేల నామినేషన్లు రావచ్చని అధికారులు అంచనా వేశారు. నామినేషన్లకు శుక్రవారం పరిశీలిస్తారు. తిరస్కరించినవాటిపై అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేస్తే, వాటిని వెంటనే పరిష్కరిస్తారు. జడ్పీటీసీ నామినేషన్లు వేసిన పలువురి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ మండలం నుంచి పుప్పా శోభ (కాంగ్రెస్), ఎల్లారెడ్డి మండలం నుంచి విమలమ్మ(వైఎస్ ఆర్సీపీ), నిజమాబాద్ మండలం నుంచి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాదే కృష్ణ అక్క ఈర్ల వసంత(బీజేపీ), నవీపేట్ మండలం నుంచి నర్సింగ్‌రావు(టీఆర్ఎస్). -
పౌష్టికాహారలోపం మీ నిర్వాహకమే
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్వేల్లో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురైయ్యారని తేలిందని, మహిళా,శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతా,శిశువులకు సరైన పౌష్టికాహారం అందక పోవడమే దీనికి కారణమని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఐసీడీఎస్ ఉద్యోగులు, సిబ్బంది ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పౌష్టికాహార అభివృద్ధి పథకం(ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ) పై జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓల, సూపర్వైజర్లకు జిల్లా పరిషత్‌లో బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాలల్లో గర్భిణులకు నెలకు ఒకసారి బరువు,ఇతర పరీక్షలు నిర్వహించి... ప్రతిరోజు పౌష్టికాహారం అందించకపోవడం వల్లే అనారోగ్యంతో, తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని తెలిపారు. ఇదే పోషణ లోపానికి ప్రధాన కారణమన్నారు. పుట్టిన పిల్లలకు సక్రమంగా పౌష్టికాహారం ఇవ్వకపోవడం కూడా కారణమన్నారు. జనవరి నెలలో పుట్టిన 60 మంది పిల్లలు పౌష్టికాహార లోపం, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. మాతా,శిశు మరణాలు పూర్తిస్థాయిలో తగ్గడం లేదని, సమస్య ఎక్కడుందో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.మాతాశిశు సంరక్షణ అన్ని చర్యలు తీసుకోవాలని, పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ అంగన్వాడీ కేంద్రాన్ని మాడల్ అంగన్వాడీ కేంద్రంగా మార్చాలని, తాగునీటి, టాయిలెట్లు, సొంత భవనాలు కచ్చింతగా ఉండాలన్నారు. ఇందుకు 500 కొత్త భవనాలు, టాయిలెట్లు మంజురయ్యాయని, వాటిని వారంలోగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ ఉద్యోగులపై బాధ్యతలు.. అన్ని శాఖల కంటే ఐసీడీఎస్ శాఖపై చాలా బాధ్యత ఉందని ఐసీడీఎస్ రాష్ట్ర జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి అన్నారు. పిల్లలకు, గర్భిణులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలన్నారు. జిల్లాలో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురయ్యారంటే, దానికి కారణం పౌష్టికాహారం అందించకపోవడమేనని అన్నారు. వచ్చే తరం పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలన్నారు. కాగా ఫ్రీ స్కూల్ పిల్లలు అంగన్వాడీలకు వచ్చే విధంగా, వారి హాజరు శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జెడ్పీ సీఈఓ రాజారాం, డీపీవో సురేశ్‌బాబు, డీఈఓ శ్రీనివాసచారి పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో మళ్లీ హలో.. హలో..
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మళ్లీ హలో.. హలో.. వినిపించనుంది. గత రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ సేవలు నిలిచాయి. బకాయి బిలుల్లు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సీడీపీఓలు రాష్ట్ర అధికారులకు ఎస్ఎంఎస్లు చేయకపోవడంతో రోజువారి, వారంతపు, నెల సమాచారం కొరవడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో బీఎస్ఎన్ల్ కంపెనీకి బకాయి పడిన రూ.5లక్షలను విడుదల చేసింది. దీంతో అంగన్వాడీల్లో సెల్ సేవలు పునరుద్దరణ అయ్యాయి. సెల్ ద్వారా సోమవారం నుంచే ఎస్ఎంఎస్తో ఆన్లైన్లో ప్రతి సమాచారం రాష్ట్ర అధికారులకు చేరవేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాములు జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్వైజర్లకు, సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మాదిరి ఎస్ఎంఎస్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తే వేతనంలో కోతలు విధిస్తామని హెచ్చరికలూ పంపారు. మూడు రకాల సమాచారం.. మినీ, మెయిన్ కలిపి జిల్లాలో మొత్తం 2400లకుపైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మొదటగా ఇందులో పని చేసే కార్యకర్తలు ప్రతి రోజు 11 నుంచి 12గంటల్లోపు పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ స్కూల్)లో ఎందరు పిల్లలు వచ్చారు, ఎందరికి భోజనం పెట్టారు అనే వివరాలతో పాటు గర్భిణులు, బాలింతలు వివరాలు ఐసీడీఎస్ డెరైక్టరేట్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. రోజు వారీగా సరుకుల ఖర్చు, బ్యాలెన్స్ వివరాలను కూడా చేరవేయాలి. రెండోది సందర్భ సమాచారం. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు జరిగిన వెంటనే సమాచారమందించాలి. మూడోది ప్రతి నెలా అంగన్వాడీ ప్రోగ్రెస్ రిపోర్టులను ఎస్ఎంఎస్ చేయాలి. కార్యకర్త, సూపర్వైజర్, సీడీపీఓలు ఇక ప్రతీది ఎస్ఎంఎస్ ద్వారానే సమాచారమందించాలి. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. -రాములు, ఐసీడీఎస్ పీడీ రెండు నెలల క్రితం నిలిచిపోయిన సెల్‌ఫోన్ సేవలు ప్రభుత్వం నిధులు మంజురు చేయడంతో పునరుద్దరణ చేయించాం. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు, సూపర్వైజర్లు, సీడీపీఓలు రోజువారీ సమాచారాన్ని తప్పకుండా పంపించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆదేశాలను విధిగా పాటించాలి. -
ఇందూరులో మరింత అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందూరు అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల చేరువలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలంతా పాడిపంట లు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషంగా ఉం డాలని మంత్రి ఆకాంక్షించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు రూ. 3.30 కోట్లు కేటాయించామని తెలిపారు. రబీ సీజన్లో రైతులకు 33 శాతం రాయితీతో 16 వేల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామన్నారు. రూ. 10 కోట్లతో జిల్లాలో 57 గోదాములను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడానికి రూ. 518 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నవీపేట మండలంలో రూ. 4.73 కోట్లతో శాఖాపూర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశామన్నారు. దాహం తీర్చేందుకుజిల్లాలో తాగునీటి కొరతను తీర్చడానికి వివిధ పథకాల ద్వారా 570 పనులకుగాను రూ. 226 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. బంగారుతల్లి పథకం కింద ఆడపిల్లలకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. మార్పు పథకం కింద మాతాశిశు మరణాలను తగ్గించడంలో భాగంగా, ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 52 వేల మంది రోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యసదుపాయాన్ని కల్పించడానికి రూ. 138 కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో రూ. 48.32 కోట్లతో 16 మోడల్ పాఠశాలలు, రూ. 21.25 కోట్లతో 17 కసూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను నిర్మించామన్నారు. అమృతహస్తం అమృతహస్తం కింద తొమ్మిది నిత్యావసర సరుకులను బహిరంగమార్కెట్ ధరకంటే తక్కువ ధరకు పంపిణీ చేస్తున్నామన్నారు. నిర్మల్‌భారత్ అభియాన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లాలో 329 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 139 కోట్ల ఖర్చు చేసి 2.99 లక్షల కుటుంబాలకు పనులు కల్పించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన ప్రాధాన్యతతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డుతో సహా జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కోసం తక్షణమే చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్‌లో మైనారిటీ కమ్యూనిటీ హాలు నిర్మాణంతో పాటు, పార్క్ ఏర్పాటు కోసం తగిన చర్యలకు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా పేద రోగులకు సరైన వైద్యసేవలు అందే విధంగా కృషి చేసినట్లు వివరించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. -
ఐడియా అదిరింది!
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ‘సంక్షేమాన్ని’ చక్కదిద్దేందుకు మొన్నటి వరకు ఆయా శాఖల జిల్లా అధికారులను వసతి గృహాల బాట పట్టించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. నెలకు రెండు సార్లు వసతి గృహాల్లో రాత్రుల్లో బస చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలేంటో ప్రోఫార్మాలో నమోదు చేయించారు. ఇప్పుడు వారం రోజులుగా ఫోన్ ద్వారా పర్యవేక్షణ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాలు మొత్తం ఎన్ని ఉన్నాయి..వార్డెన్లు ఎందరు, వారి సెల్‌ఫోన్ నెంబర్లతో పాటు ఒక్కో వసతి గృహంలో ఎందరు విద్యార్థులు ఉంటున్నారు.. వారి పేర్లతో సహా పూర్తి వివరాలను కలెక్టర్ సంక్షేమాధికారుల దగ్గరి నుంచి సేకరించారు. ఈ వివరాన్ని కాల్ సెంటర్ ఉద్యోగులకు అందజేశారు. ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కాల్ సెంటర్ ఉద్యోగులు ఐదు ఎస్సీ, రెండు బీసీ,ఒక ఎస్టీ వసతి గృహాల వార్డెన్లకు ఫోన్ చేసి వారు ఎక్కడున్నారో అడిగి తెలుసుకుంటారు. పని చేయాల్సిన సమయంలో వసతి గృహంలో లేకపోతే కారణాలేంటో రికార్డు చేస్తారు. కాగా వార్డెన్‌కు ఫోన్ చేసిన సమయంలో కాల్ సెంటర్ ఉద్యోగులు ఒక విద్యార్థి పేరు చెప్పి మాట్లాడించాలని సూచించిన వెంటనే సదరు విద్యార్థితో మాట్లాడించాలి. ఈ రోజు ఏం భోజనం పెట్టారు..? మీకు రోజు మెనూ ప్రకారం భోజనం,గుడ్లు,పాలు ఇతర ఆహారం అందిస్తున్నారా..? లేదా..? అనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. ఒక వేళ సమాచారం లేకుండా వార్డెన్ బయటకు వెళ్లినా... పేరు చెప్పిన విద్యార్థి లేకపోయినా ఇక ఆ వార్డెన్ సంగతి అంతే. అలాగే కాల్ సెంటర్ ఉద్యోగులు వార్డెకు ఫోన్ చేసిన సమయంలో ఫోన్ ఎత్తకపోయినా.. ఫోన్ స్విచ్ఛాప్ చేసినా... ఆ వార్డెన్ పేరు,సెల్ నెంబరు వివరాలతో కలెక్టర్‌కు నివేదిక అందిస్తారు. వారిపై కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. మరోసారి పునరావృతం అయితే నోటీసులు కూడా జారీ చేయనున్నారు. ఈపాటికే ముగ్గురు వార్డెలపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు... వసతి గృహాల పర్యవేక్షణకు కలెక్టర్ శ్రీకారం చుట్టిన కాల్ సెంటర్ కార్యక్రమంతో ‘సంక్షేమం’ గాడిన పడుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు సైతం రాత్రి వరకు స్థానికంగా ఉంటూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టడమే కాకుండా, సాయంత్రం నుంచి రాత్రి వరకు వారికి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అయితే కాల్ సెంటర్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందోనని వార్డెన్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తమ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తేచాలు కాల్ సెంటర్ వారేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇటు విద్యార్థులతో మాట్లాడిస్తే వారు ఏం చెబుతారోనని, వారికి ముందుగానే చెప్పి జాగ్రత్త పడుతున్నారు. -
35 మార్కులు దాటితే డోకాలేనట్లే !
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో 44 ఐసీడీఎస్ సూపర్వైజర్ పోస్టులకు దాదాపు తొమ్మిది వందల మంది పరీక్ష రాశారు. ఒక్కో పోస్టుకు సుమారు 20మంది అంగన్వాడీ కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అక్టోబర్ 27న హైదరాబాద్‌లో పరీక్ష రాయగా, నెలాఖరునా ఫలితాలను వెలుబడ్డాయి. కాని అధికారులు కటాఫ్ మార్కులను ఇంకా ప్రకటించలేదు. కటాఫ్ మార్కులు, రోస్టర్‌కు సంబంధించిన మార్గదర్శకాలు అందలేవని, మరో మూడు రోజుల్లో ప్రకటిస్తారని ఐసీడీఎస్ ప్రాజేక్టు డెరైక్టర్ రాములు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. సూపర్వైజర్ పదోన్నతి పోటీకి పరీక్ష ద్వారా తాము అర్హత సాధించామా..లేదా.. అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే పరీక్ష పేపరు మొత్తం మార్కులు 45 ఉండగా 35 మార్కులుపైబడి వచ్చిన వారికి సూపర్వైజర్గా పదోన్నతి లభించినట్లే..! ఇక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 35మార్కులు పైబడిన వారిని ఓపెన్ కేటరిగిలో పిలువనున్నారు. అత్యధిక మార్కులు వచ్చినందుకు రోస్టర్ పాయింట్‌ను,రిజర్వేషన్లను లెక్కలోకి తీసుకోరు. అంటే అత్యధికంగా మార్కులు వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూడు రోజుల తర్వాత కటాఫ్ మార్కులు ప్రకటించిన అనంతరం 35మార్కులకు లోబడి ఉన్న అర్హులైన వారందరికి రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టునకు ముగ్గురు అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. -
అంగన్వాడీ సిబ్బందికి శుభవార్త
ఇందూరు,న్యూస్‌లైన్:అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు. గౌరవ వేతనం పెంచుతూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యకర్తలకు *500, ఆయాలకు *250 వేతనం పెంచుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీలం సహాని అన్ని జిల్లాల ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. వేతన పెంపుతో కార్యకర్తల వేతనం *4,200, ఆయాలకు *2,200కు చేరాయి. పెరిగిన వేతనాలతో జిల్లాలో 2,400 మంది కార్యకర్తలు, 2,350 మంది ఆయాలకు లబ్ధి చేకూరనుంది. అంగన్వాడీ సిబ్బంది గౌరవ వేతనాలు పెంపుతో జిల్లాలో నెలకు *17.87 లక్షలు, ఏడాదికి *2.14 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు భారం పడనుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతనాలు అమలు కానున్నాయి. వేతనాల పెంపుపై అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనివేళలు పెంపు... అంగన్వాడీ సిబ్బందికి వేతనాల పెంపుతో పాటు వారికి పనివేళలను ప్రభుత్వం పెంచింది. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1-30వరకు పనిచేస్తున్నాయి. ఈ విషయంపై జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములును న్యూస్‌లైన్ వివరణ కో రగా... సిబ్బందికి వేతనాలు,పనివేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనికి సంబంధించి ఉత్తర్వులు అందాయని తెలిపారు. ఇక వారానికి ఎనిమిది గుడ్లు అంగన్వాడీల్లో వచ్చేనెల నుంచి అమలు ఇందూరు : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వారానికి నాలుగు గుడ్లు కాకుండా వచ్చే నెల నుంచి వారానికి ఎనిమిది, నెలకు పదహారు చొప్పున గుడ్లు అందించనున్నారు. ఈ మేరకు మహిళా,శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 2659 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. ఇందులో 1.14 లక్షలకు పైగా పిల్లలు, 39,952 మంది బాలింతలు,గర్భిణులు పౌష్టికాహారం పొందుతున్నారు. ఇక నుంచి వీరందిరికి నెలకు పదహారు గుడ్లు అందనున్నాయి. అయితే గ్రామాల్లో కాని, పట్టణ ప్రాంతాల్లో కాని అంగన్వాడీ కార్యకర్తలు ఈ కొత్త పద్ధతిని అమలు చేయకుండా పాత పద్ధతి ప్రకారం వారానికి నాలుగు గుడ్లు ఇస్తే తనకు వెంటనే ఫిర్యాదు చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు జిల్లా డెరైక్టర్ రాములు సూచించారు.