సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ (ఇందూరు) లోక్‌సభ స్థానానికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర ఇన్‌చార్జి ఉమేశ్ సిన్హా స్పష్టం చేశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తుండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనుమానాలకు తెరదించారు. నిజామాబాద్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందంతో కలసి ఉమేశ్ సిన్హా సమీక్షించారు. మంగళవారం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్, సీఈఓ రజత్‌కుమార్‌తో కలసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇందూరులో ఏర్పాట్లపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ‘నిజామాబాద్ ఓ అసాధారణ కేసు. 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ
అక్కడ ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన సందర్భంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈవీఎంను తొలిసారిగా కనుగొన్నది హైదరాబాద్‌లోనే. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులున్నా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్రానికి ఇది మరో మైలురాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌యూనిట్‌ను వాడబోతున్నాం’అని ఉమేశ్ జైన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లును మాత్రమే వాడారన్నారు.
అన్నీ సమయానికి పూర్తయ్యేలా!
‘బీహెచ్‌ఈఎల్ కంపెనీ నుంచి ఈవీఎంల లాట్ ఒకటి బుధవారానికి నిజామాబాద్ చేరుకుంటుంది. ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రతీది సమయానికి పూర్తవుతుందని ఆశిస్తున్నాం. ఈవీఎంల టెస్టింగ్, ఇతర ప్రక్రియలన్నీ సమయానికి పూర్తవుతాయని భావిస్తున్నాం. ఈ యంత్రాలను బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్‌తో పాటు ఇక్కడున్న సాంకేతిక బృందం ఇప్పటికే పరీక్షించిచూసింది. ఈ ఏర్పాట్లు సజావుగా పూర్తవుతాయని భావిస్తున్నాం’అని ఉమేశ్ సిన్హా పేర్కొన్నారు. సవాలుగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నేటి నుంచి ఈవీఎంలకు ఎఫ్‌ఎల్‌సీ
‘నిజామాబాద్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం, సీఈఓ కార్యాలయం, బీహెచ్‌ఐఎల్, ఈసీఐఎల్ అధికారులతో సోమవారం రాత్రి సవివరంగా చర్చించాం. మంగళవారం ఉదయం కూడా బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ సీనియర్ అధికారుల బృందంతో చర్చిచాం. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎన్నికలకు 25వేల బ్యాలెట్ యూనిట్లు, 2వేల కంట్రోల్ యూనిట్లు, 2వేల వీవీప్యాట్ యంత్రాలతో పాటు ప్రథమ స్థాయి తనిఖీల (ఎఫ్‌ఎల్‌సీ) నిర్వహణకు 600 మంది ఇంజనీర్లు అవసరం. బుధవారం ఉదయం ఈవీఎంల ఎఫ్‌ఎల్‌సీను ఇంజనీర్లు ప్రారంభిస్తారు. పోలింగ్ ముగిసే వరకు వారు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వినియోగంపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ కోసం మాస్టర్ ట్రైనర్లను నియమించాం’అని ఉమేశ్ సిన్హా తెలిపారు.
సెక్టోరల్ అఫీసర్లు, పోలింగ్ సిబ్బంది సంఖ్య సైతం పెరిగిందన్నారు. సాధారణంగా సెక్టోరల్ అధికారులు 8–10 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారని, నిజామాబాద్ విషయంలో మాత్రం ఒక సెక్టోరల్ అధికారికి 5, అంతకు తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. జోనల్ అధికారులు, ఇతర పర్యవేక్షక అధికారుల సంఖ్యను పెంచనున్నామన్నారు. నిజామాబాద్ ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు వస్తున్నారన్నారు. ఎన్నికల సిబ్బంది శిక్షణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు జరిగాయన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వినియోగంపై ప్రజల్లో విసృత అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, పోస్టర్లతో అవగాహన కల్పిస్తామన్నారు. ఈవీఎంల వినియోగంపై ప్రజలు, పార్టీలు, అభ్యర్థులకు అవగాహన కేంద్రాలను జిల్లా, అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment