ఇందూరు,న్యూస్‌లైన్:అంగన్‌వాడీ సిబ్బందికి తీపి కబురు. గౌరవ వేతనం పెంచుతూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యకర్తలకు *500, ఆయాలకు *250 వేతనం పెంచుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీలం సహాని అన్ని జిల్లాల ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్‌లకు ఉత్తర్వులు జారీచేశారు. వేతన పెంపుతో కార్యకర్తల వేతనం *4,200, ఆయాలకు *2,200కు చేరాయి. పెరిగిన వేతనాలతో జిల్లాలో 2,400 మంది కార్యకర్తలు, 2,350 మంది ఆయాలకు లబ్ధి చేకూరనుంది. అంగన్‌వాడీ సిబ్బంది గౌరవ వేతనాలు పెంపుతో జిల్లాలో నెలకు *17.87 లక్షలు, ఏడాదికి *2.14 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు భారం పడనుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతనాలు అమలు కానున్నాయి. వేతనాల పెంపుపై అంగన్‌వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పనివేళలు పెంపు...
అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాల పెంపుతో పాటు వారికి పనివేళలను ప్రభుత్వం పెంచింది. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1-30వరకు పనిచేస్తున్నాయి. ఈ విషయంపై జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములును న్యూస్‌లైన్ వివరణ కో రగా... సిబ్బందికి వేతనాలు,పనివేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనికి సంబంధించి ఉత్తర్వులు అందాయని తెలిపారు.
ఇక వారానికి ఎనిమిది గుడ్లు
అంగన్‌వాడీల్లో వచ్చేనెల నుంచి అమలు
ఇందూరు : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వారానికి నాలుగు గుడ్లు కాకుండా వచ్చే నెల నుంచి వారానికి ఎనిమిది, నెలకు పదహారు చొప్పున గుడ్లు అందించనున్నారు. ఈ మేరకు మహిళా,శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 2659 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. ఇందులో 1.14 లక్షలకు పైగా పిల్లలు, 39,952 మంది బాలింతలు,గర్భిణులు పౌష్టికాహారం పొందుతున్నారు. ఇక నుంచి వీరందిరికి నెలకు పదహారు గుడ్లు అందనున్నాయి. అయితే గ్రామాల్లో కాని, పట్టణ ప్రాంతాల్లో కాని అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ కొత్త పద్ధతిని అమలు చేయకుండా పాత పద్ధతి ప్రకారం వారానికి నాలుగు గుడ్లు ఇస్తే తనకు వెంటనే ఫిర్యాదు చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు జిల్లా డెరైక్టర్ రాములు సూచించారు.
అంగన్‌వాడీ సిబ్బందికి శుభవార్త
Published Thu, Oct 24 2013 2:32 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement