వేసవిని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇందూరు, న్యూస్‌లైన్ : వేసవిని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండే అంగన్‌వాడీ పని వేళల్లో మార్పులు చేశారు. వేసవి కాలం ముగిసే వరకు ఇక నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరకు అంగన్‌వాడీ కేంద్రాలను నడిపించాలని ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
వీటిని సోమవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి పంపించారు. మే నెల నుంచి వేసవి ముగిసే వరకు ఈ సమయ వేళలను పాటించాలని, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీలో కార్యకర్తలు, ఆయాలు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని ఐసీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని అంగన్‌వాడీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్యకర్తలకు, ఆయాలకు, లింక్ వర్కర్‌లకు పెండింగ్‌లో ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేసి వారి ఖాతాల్లో వేయాలని ఐసీడీఎస్ కమిషనర్ పీడీ రాములుకు ఆదేశాలు ఇచ్చారు.
కార్యక్తలకు, ఆయాలకు 15 రోజుల సెలవులు
అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు 15 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చినట్లు ఐసీడీఎస్ పీడీ రాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే ఒకటి నుంచి 15వ తేదీ వరకు కార్యకర్తలు, 15 నుంచి 30వ తేదీ వరకు ఆయాలు సెలవులో వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కార్యకర్తలు సెలవులో ఉన్నందున ఆయాలే అంగన్‌వాడీలను నడపాలని, ఆయాలు సెలవులో వెళ్లినప్పుడు కార్యకర్తలు నడపాలన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం చేసి, అంగన్‌వాడీలను నడపకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.