ఇందూరు, న్యూస్‌లైన్ : పోషకాహార లోపంతో బాధపడే పిల్లలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పుష్టికరంగా తయారు చేసేందుకు ప్రత్యేక పోషకాహారం అందించాలని నిర్ణయిం చింది. జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న 3,051 మంది పిల్లలకు ఈనెలాఖరునుంచి ప్రత్యేక పోషకాహారం అందనుంది. ఈ మేరకు ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి నుంచి జిల్లా పీడీకి ఆదేశాలు అందాయి.
3,051 మంది పిల్లలకు పాలపొడి..
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్డుతో పాటు మరికొన్ని పౌష్టికాహారాలను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సర్వేద్వారా గుర్తించిన 3,051 మంది బలహీనమైన పిల్లలకు ప్రత్యేకంగా పాలపొడి అందించనున్నారు. వీరికి రోజుకు 14నుంచి 16 గ్రాముల పాలపొడిని మూడు నెలలపాటు అందిస్తారు. ఇందుకుగాను ఒక్కొక్కరికి నెల కు రూ. 75 చొప్పున ఖర్చు చేయనున్నారు. పాల పౌడర్ పం పిణీ బాధ్యతను జిల్లాలోని ఏపీ డెయిరీకి అప్పగించారు. నెలాఖరులోగా అంగన్‌వాడీ కేంద్రాలకు పాల పొడిని పం పిణీ చేస్తారు. తర్వాత కూడా పిల్లల బరువులో మార్పు లేకపోతే మరో మూడు నెలలు పాలపొడి అందిస్తారు.
అందరికీ శెనగలు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న( 3 నుంచి 5 ఏళ్లలోపువారు) పిల్లలందరికీ శెనగలు సరఫరా చేయనున్నారు. వీటిని ఉడకబెట్టి ఒక్కో విద్యార్థికి రోజుకు 15 గ్రాముల చొప్పున అందిస్తారు. జిల్లాలో 43,956 మంది పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు.
సరుకులు రాగానే..
-రాములు, పీడీ, ఐసీడీఎస్
పోషణలోపంతో బాధపడుతున్న పిల్లలకు పాల పౌడర్ అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అంగన్‌వాడీల్లోని పిల్లలందరికీ శెనగలు అందించనున్నాం. నెలాఖరు వరకు సరుకులు వస్తాయి. తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసి, పిల్లలకు అందేలా చూస్తాం.
అంగన్‌వాడీల్లో ‘ప్రత్యేక’ పోషకాహారం
Published Sat, Sep 14 2013 5:26 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement