ఇరుకు గదుల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ
జిల్లాలో ఒక్క కేంద్రానిక్కూడా అన్ని వసతులు లేవు
సకల సౌకర్యాలతో ‘గుర్తింపు’ సాధించేదెప్పుడో?
కనిపిస్తున్న ఈ పూరి గుడిసె అంగన్‌వాడీ కేంద్రమంటే నమ్మండి. ఇది పెద్దమండ్యం మండలంలోని పంచాయతీ కేంద్రం సీ.గొల్లపల్లె అంగన్‌వాడీ కేంద్ర ం. కేంద్రం లో 6 నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 20మంది, 3ఏళ్లనుంచి ఆరేళ్ల చిన్నారులు 16 మంది ఉన్నారు. వీరంతా పాఠశాల వేళకు ఇక్కడికి వస్తారు. పౌష్టికాహారం స్వీకరించాక ఇళ్లకు వెళ్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఏలా ఉన్నాయో చెప్పేందుకు ఇదో నిదర్శనం.
బి.కొత్తకోట: పొరుగున ఉన్న మహరాష్ట్రలోని అంగన్‌వాడీ కేంద్రాలు సకల సౌకర్యాలతో కొనసాగుతూ ఐఎస్‌ఓ గుర్తింపు పొందాయి. సాక్షాత్తూ మన ప్రతినిధులు వెళ్లి పరిశీలించారు. మన సర్కారుకు కూడా అక్కడ తీరుతెన్నులపై నివేదిక ఇచ్చారు. ఐఎస్‌ఓ గుర్తింపు మాటేమో గానీ మన జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు కనీస సౌకర్యాలకు కూడా దూరమయ్యాయి. బాల్యాన్ని ఇరుకుగదుల్లో బంధించేస్తున్నాయి. ఇరుకుగా, గాలి సోకని గదుల్లో కూర్చోబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో అన్ని వసతులు కలిగినవి వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రంలో మూడు గదులు, మరుగుదొడ్డి, స్నానా లగది, విద్యుత్, నీటివసతి ఉండాలి. దీనికిగానూ పట్టణప్రాంతాల్లో రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 అద్దెగా నిర్ణయించి చెల్లిస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,768 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో 6నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 2,20,679 మంది, 24,018మంది బాలింతలు వస్తున్నారు. ఇందులో 1,528 కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. ఈ భవనాల్లో మారుమూల ప్రాంతాల్లోని కొన్నింటి కనీస భద్రతకూడా లేదు. ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలకు అనువైన భవనాలు ఇచ్చేందుకు యజమానులు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఇరుకు గదుల్లోనే కేంద్రాల నిర్వహణ సాగిపోతోంది.
కేంద్రానికి 51మంది
అధికారులు చెబుతున్న లెక్కల ప్రకా రం ప్రధాన అంగన్‌వాడీ కేంద్రానికి సగటున 15 నుంచి 20మంది, మినీ కేంద్రానికి 10నుంచి 15మంది ఉన్నా రు. అధికారిక లెక్కల ప్రకారం గర్భిణుల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు సగటున 51మంది ఉన్నారు. ఇంతమందిని ఇరుకు గదిలో ఉంచడం అసౌకర్యంగా మారింది. కొత్త కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణలు చేపట్టారు. 1,528 అద్దె భవనాల్లో 2015-16లో మంజూరైన 159 భవనాలను ఒక్కోదానికి రూ.9లక్షలు మంజూరు చేశారు. ఈ భవనాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు నిధులు సరిపోని పరిస్థితి. 2016-17 సంవత్సరానికి 312 భవనాలు మంజూరుచేయగా ఒక్కో భవనానికి రూ.12లక్షలు కేటాయించారు. ఈ నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.
పశువులపాక అసంపూర్తి భవనం
మండల కేంద్రం పెద్దతిప్పసముద్రంలో ఏనిమిదేళ్ల క్రితం రూ.7లక్షల బీఆర్‌జీఎఫ్ నిధులతో అంగన్‌వాడీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాలుగేళ్ల క్రితమే పనులు నిలిపివేయడంతో అసంపూర్తిగా ఆగిపోయింది. దీన్ని ఇప్పటివరకు ఏ అధికారి పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం పశువులపాకగా మారిపోయింది. కొందరు స్థానికులు ఇందులో పశువులు, మేకలకు షెల్టర్‌గా వాడుకుంటున్నారు.
గుర్తింపు సాధిస్తాం
అంగన్‌వాడీ కేం ద్రాలకు కలెక్టర్ నిధులు మంజూ రు చేశారు. రూ.12 లక్షల వ్యయంతో నిర్మించే భవనాలకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. పక్కా భవనం, ప్రహరీగోడ, తా గునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, మైదానం లాంటి ఆవరణం ఉంటాయి. ఇలా సంపూర్ణ సౌకర్యాలతో ఐఎస్‌ఓ గుర్తింపు దక్కించుకుంటాం.
-ఎస్.లక్ష్మి, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ, చిత్తూరు