ఇదండీ.. మన స్మార్ట్ అంగన్‌వాడీ!
ఈ ఫొటో చూశారా!.. ఆ ఏదో షాపు.. అయితే మనకేంటి అంటారా?.. అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీరునుకుంటున్నట్లు అది పాన్‌షాపో.. చిన్న కిరాణా కొట్టో కాదు.. పేదవర్గాలకు చెందిన పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు.. గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు మన పాలకులు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రం. అది కూడా ఏ పల్లెలోనో లేదు.. రాష్ట్ర ఆర్థిక రాజధాని, స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న మన విశాఖ మహనగర నడిబొడ్డులోనే ఉండటం విశేషం. నగరంలోని సీతంపేట ప్రాంతంలోని మధురానగర్ చాకలిగెడ్డ అంగన్‌వాడీ కేంద్రం దుస్థితి ఇది. దీని పరిధిలో సుమారు 320 కుటుంబాలు ఉండగా 1258 మంది జనాభా ఉన్నారు.
వీరిలో పేదవర్గాలకు చెందిన 16 మంది గర్భిణులు, ఆరుగురు బాలింతలు, 10 మంది పిల్లలకు ఈ అంగన్‌వాడీ కేంద్రం ద్వారా సేవలు, పౌష్టికాహారం అందాల్సి ఉంది. కేంద్రంలో ఓ కార్యకర్త, ఆయా ఉండాల్సి ఉండగా శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించే సమయంలో ఆయా, ఆమెతోపాటు నలుగురు చిన్నారులు మాత్రమే బిక్కుబిక్కుమంటూ కనిపించారు. పౌష్టికాహారం, వారికి చదువు చెప్పడం వంటివేవీ కనిపించలేదు. ఒక ఇంటి మేడ మెట్ల కింద ఇరుకైన గదిలో ఏర్పాటు చేసిన ఆ కేంద్రం పరిస్థితి చూస్తే.. అదేదో నామమాత్రంగా నడుస్తున్నట్లే కనిపిస్తోంది. స్మార్ట్ సిటీ అని పాలకులు ఆర్భాటం చేస్తున్న విశాఖ నగరంలో పరిస్థితి ఏమాత్రం స్మార్ట్‌గా లేదని ఈ కేంద్రాన్ని చూసేవారెవరికైనా అర్థమవుతుంది.