ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో 44 ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పోస్టులకు దాదాపు తొమ్మిది వందల మంది పరీక్ష రాశారు. ఒక్కో పోస్టుకు సుమారు 20మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అక్టోబర్ 27న హైదరాబాద్‌లో పరీక్ష రాయగా, నెలాఖరునా ఫలితాలను వెలుబడ్డాయి. కాని అధికారులు కటాఫ్ మార్కులను ఇంకా ప్రకటించలేదు. కటాఫ్ మార్కులు, రోస్టర్‌కు సంబంధించిన మార్గదర్శకాలు అందలేవని, మరో మూడు రోజుల్లో ప్రకటిస్తారని ఐసీడీఎస్ ప్రాజేక్టు డెరైక్టర్ రాములు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. సూపర్‌వైజర్ పదోన్నతి పోటీకి పరీక్ష ద్వారా తాము అర్హత సాధించామా..లేదా.. అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అయితే పరీక్ష పేపరు మొత్తం మార్కులు 45 ఉండగా 35 మార్కులుపైబడి వచ్చిన వారికి సూపర్‌వైజర్‌గా పదోన్నతి లభించినట్లే..! ఇక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 35మార్కులు పైబడిన వారిని ఓపెన్ కేటరిగిలో పిలువనున్నారు. అత్యధిక మార్కులు వచ్చినందుకు రోస్టర్ పాయింట్‌ను,రిజర్వేషన్లను లెక్కలోకి తీసుకోరు. అంటే అత్యధికంగా మార్కులు వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూడు రోజుల తర్వాత కటాఫ్ మార్కులు ప్రకటించిన అనంతరం 35మార్కులకు లోబడి ఉన్న అర్హులైన వారందరికి రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టునకు ముగ్గురు అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.