ఇందూరు, న్యూస్‌లైన్: నాలుగు రోజులుగా కొనసాగిన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల నామినేషన్‌ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా నా మినేషన్‌లు దాఖలు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్‌పీటీసీ నామినేషన్‌లు వేయడానికి మండలాల నుంచి రాజకీయ నాయకులు, అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.
సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అభ్యర్థుల తాకిడి భారీగా కొనసాగింది. సమయం దాటిన తరువాత, అప్పటికే అక్కడ ఉన్న 150 మంది అభ్యర్థులను జిల్లా పరిషత్‌లోపలికి అనుమతించారు. టోకెన్ల ద్వారా వారి నామినేషన్‌లను క్రమ సంఖ్యలో తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు నామినేషన్‌లను స్వీకరించారు.
ఒక్క సారిగా అభ్యర్థులు లోనికి రావడంతో అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. మండల కార్యాలయాలలో కూడా ఎంపీటీసీకి పోటీ చేసే అభ్యర్థులు పోటీపోటీగా నిమినేషన్‌లు వేశారు. నాలుగో రోజు దాదాపుగా జడ్‌పీటీసీకి 500 మంది అభ్యర్థులకు టోకెన్‌లు ఇచ్చారు. ఎంపీటీసీకి సూమారుగా 3వేల నామినేషన్లు రావచ్చని అధికారులు అంచనా వేశారు. నామినేషన్‌లకు శుక్రవారం పరిశీలిస్తారు.
తిరస్కరించినవాటిపై అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేస్తే, వాటిని వెంటనే పరిష్కరిస్తారు. జడ్‌పీటీసీ నామినేషన్‌లు వేసిన పలువురి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ మండలం నుంచి పుప్పా శోభ (కాంగ్రెస్), ఎల్లారెడ్డి మండలం నుంచి విమలమ్మ(వైఎస్ ఆర్‌సీపీ), నిజమాబాద్ మండలం నుంచి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాదే కృష్ణ అక్క ఈర్ల వసంత(బీజేపీ), నవీపేట్ మండలం నుంచి నర్సింగ్‌రావు(టీఆర్‌ఎస్).