సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందూరు అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల చేరువలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలంతా పాడిపంట లు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషంగా ఉం డాలని మంత్రి ఆకాంక్షించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు రూ. 3.30 కోట్లు కేటాయించామని తెలిపారు. రబీ సీజన్‌లో రైతులకు 33 శాతం రాయితీతో 16 వేల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామన్నారు. రూ. 10 కోట్లతో జిల్లాలో 57 గోదాములను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడానికి రూ. 518 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నవీపేట మండలంలో రూ. 4.73 కోట్లతో శాఖాపూర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశామన్నారు.
దాహం తీర్చేందుకుజిల్లాలో తాగునీటి కొరతను తీర్చడానికి వివిధ పథకాల ద్వారా 570 పనులకుగాను రూ. 226 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. బంగారుతల్లి పథకం కింద ఆడపిల్లలకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. మార్పు పథకం కింద మాతాశిశు మరణాలను తగ్గించడంలో భాగంగా, ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 52 వేల మంది రోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యసదుపాయాన్ని కల్పించడానికి రూ. 138 కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో రూ. 48.32 కోట్లతో 16 మోడల్ పాఠశాలలు, రూ. 21.25 కోట్లతో 17 కసూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను నిర్మించామన్నారు.
అమృతహస్తం
అమృతహస్తం కింద తొమ్మిది నిత్యావసర సరుకులను బహిరంగమార్కెట్ ధరకంటే తక్కువ ధరకు పంపిణీ చేస్తున్నామన్నారు. నిర్మల్‌భారత్ అభియాన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లాలో 329 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 139 కోట్ల ఖర్చు చేసి 2.99 లక్షల కుటుంబాలకు పనులు కల్పించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన ప్రాధాన్యతతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డుతో సహా జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కోసం తక్షణమే చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్‌లో మైనారిటీ కమ్యూనిటీ హాలు నిర్మాణంతో పాటు, పార్క్ ఏర్పాటు కోసం తగిన చర్యలకు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా పేద రోగులకు సరైన వైద్యసేవలు అందే విధంగా కృషి చేసినట్లు వివరించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.
ఇందూరులో మరింత అభివృద్ధి
Published Wed, Jan 1 2014 6:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement