సీనియర్ లాయర్ సుదర్శన్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయింపు
ఆపై దౌర్జన్యంగా చొక్కా కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లిన సీఐ ప్రజలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోని సీఐ
రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న సుదర్శన్‌రెడ్డి
గాలివీడులో వైఎస్సార్‌సీపీ నేతపై ‘అధికార’ దౌర్జన్యం
మరో 12 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనా కేసు నమోదు
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల గూండాగిరి పెచ్చుమీరిపోతోంది. సీఎం, మంత్రుల మనసెరిగి వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే ఏకైక కర్తవ్యంగా పోలీసు అధికారులు చెలరేగిపోతున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో పోలీసులు అధికార పార్టీ గూండాల్లా రెచ్చిపోయారు. లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పెద్ద స్థాయిలో ఉన్న సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డిని కాలర్ పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎంపీడీవోపై దాడి చేశారనే అక్రమ కేసు బనాయించింది కాకుండా, పోలీసులు ఈ దాష్టీకానికి తెగబడటం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో కక్షసాధింపు ధోరణిలో, పక్కా పన్నాగంతో జె. సుదర్శన్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. సుదర్శన్‌రెడ్డి గాలివీడు మండలం మాజీ ఎంపీపీ. ప్రస్తుతం ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. సీనియర్ న్యాయవాది అయిన ఆయన గతంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా గతంలో కీలక పదవిని నిర్వర్తించారు.
ఆయన కుటుంబం రాయచోటి నియోజకవర్గంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా చేస్తున్న న్యాయ పోరాటంలో సుదర్శన్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు చర్యలకు తెగబడింది. ఎంపీడీవోపై దాడి చేశారని అక్రమ కేసు బనాయించి పోలీసుల ద్వారా దౌర్జన్యానికి పాల్పడింది. ప్రభుత్వ పక్కా ఆదేశాలతోనే సీఐ కొండారెడ్డి శుక్రవారం గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సుదర్శన్‌రెడ్డిని చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.
ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ఉన్న ప్రజలు ఎంతగా అభ్యంతరం పెడుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా లాక్కెళ్లి పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను సీఐ కొండారెడ్డి నిర్భీతిగా ఉల్లంఘించి మరీ ఈ దాషీ్టకానికి పాల్పడ్డారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన సుదర్శన్‌రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకెళ్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సుదర్శన్‌తో పాటు మరో ఇద్దరికి రిమాండ్
రాయచోటి : గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జవహర్‌బాబుపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఎంపీడీవో ఫిర్యాదు ఇచ్చారు. గాలివీడు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డితో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు.
ఎన్.వెంకటరెడ్డి, ఎం.బయారెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, జె.ధనుంజయరెడ్డి, ఎన్.రమణారెడ్డి, భానుమూర్తిరెడ్డి, జి.రామాంజులురెడ్డి, ఎన్.రామాంజుల్‌రెడ్డి, యు.ధర్మారెడ్డి, రెడ్డికుమార్, ఎం.ఆంజనేయరెడ్డి, పి.బయారెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరిలో జల్లా సుదర్శన్‌రెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, ఎం.బైరెడ్డిలను పోలీసులు శనివారం లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచారు.
వీరికి కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశానుసారం శనివారం సాయంత్రం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని గాలివీడు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment