
హైకోర్టు న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి చివరకు రిమ్స్ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఖరి ‘పచ్చ’ పగను బట్టబయలు చేస్తోందని హైకోర్టు న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డి చెప్పారు. పోలీసుల తీరు నిజమైన ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా చెప్పవచ్చని అన్నారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పోసానిపై 15 కేసులు పెట్టారని, ఆశ్చర్యకరంగా 15వ కేసులో మాత్రమే అరెస్ట్ చేశారని తెలిపారు.
పోసాని అరోగ్య సమస్యలను ఆయన, కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించి, మరునాడు ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకోవాల్సి ఉందని చెప్పినా, పోలీసులు వినిపించుకోకుండా అరెస్టు చేశారని తెలిపారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ పోసానిని జీపు ఎక్కించుకుని తీసుకెళ్లిన సంబేపల్లి పోలీసులు.. తెల్లారేవరకు జీపులోనే తిప్పుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. మరునాడు మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ 9 గంటలపాటు విచారించారని తెలిపారు.
కోర్టుకు తరలించే ముందు పీహెచ్‌సీ వైద్యులతో పరీక్షలు చేయించారని, గొంతు, చేయి నొప్పితో ఉన్న ఆయనకు బీపీ, షుగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారని తెలిపారు. రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నారు. రాజంపేట జైలులో ఛాతి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, అయినా మధ్యాహ్నం వరకు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా వేధింపులకు గురి చేశారని తెలిపారు. ఈసీజీలో హార్ట్ బీట్ తేడా కనిపించడంతో కడప రిమ్స్‌కు తరలించారన్నారు. అప్పుడూ ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ని అంబులెన్స్‌లో కాకుండా పోలీస్ వ్యాన్‌లో తరలించడం దారుణమని, వేధింపులకు పరాకాష్ట అని చెప్పారు.