ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల వేడి
రేపు మూగబోనున్న ‘తొలి విడత’ మైకులు
6న మొదటి విడత, 11న రెండో విడత పోలింగ్
వీధులను జల్లెడ పడుతున్న అభ్యర్థులు
ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన
ఇందూరు, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల ఆరున జరిగే ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారం నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులకు నిర్దేశించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 18 మండలాలలో 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ రిటర్నింగ్ అధికారికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిధంగా ఈనెల 11న జరిగే రెండో విడత ఎన్నికలకు 9వ తేదీలోగా ప్రచారం ముగిం చాలని సూచించింది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థు లు ప్రచార జోరును ఒక్కసారిగా పెంచారు. పల్లెల్లో గల్లిగల్లీకి తిరుగుతూ ఓట్ల కోసం జల్లెడ పడుతున్నారు.ప్రత్యేకంగా వాహనాలకు మైక్‌లు బిగించి ప్రచారం చేయిస్తున్నారు.
కళాకారుల బృందాలను ఏర్పాటు చేసి ఆట, పాట లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోటీ అభ్యర్థులు గ్రామ సర్పంచులను, నాయకులను వెంటేసుకుని ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు విరామమెరుగక ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎక్కడ లేని ఆప్యాయతను ఒలకబోస్తూ ఓటర్లను పలకరిస్తున్నారు.
మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి వేయాలని ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి రహస్యంగా మ ద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అభ్యర్థులు సైతం నిబంధనలు అతిక్రమించి ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారులు హెచ్చ రికలు జారీ చేశారు.