ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్వేల్లో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురైయ్యారని తేలిందని, మహిళా,శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతా,శిశువులకు సరైన పౌష్టికాహారం అందక పోవడమే దీనికి కారణమని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఐసీడీఎస్ ఉద్యోగులు, సిబ్బంది ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పౌష్టికాహార అభివృద్ధి పథకం(ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ) పై జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓల, సూపర్‌వైజర్‌లకు జిల్లా పరిషత్‌లో బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్‌వాడీ కేంద్రాలల్లో గర్భిణులకు నెలకు ఒకసారి బరువు,ఇతర పరీక్షలు నిర్వహించి... ప్రతిరోజు పౌష్టికాహారం అందించకపోవడం వల్లే అనారోగ్యంతో, తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని తెలిపారు. ఇదే పోషణ లోపానికి ప్రధాన కారణమన్నారు.
పుట్టిన పిల్లలకు సక్రమంగా పౌష్టికాహారం ఇవ్వకపోవడం కూడా కారణమన్నారు. జనవరి నెలలో పుట్టిన 60 మంది పిల్లలు పౌష్టికాహార లోపం, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. మాతా,శిశు మరణాలు పూర్తిస్థాయిలో తగ్గడం లేదని, సమస్య ఎక్కడుందో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.మాతాశిశు సంరక్షణ అన్ని చర్యలు తీసుకోవాలని, పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ అంగన్‌వాడీ కేంద్రాన్ని మాడల్ అంగన్‌వాడీ కేంద్రంగా మార్చాలని, తాగునీటి, టాయిలెట్లు, సొంత భవనాలు కచ్చింతగా ఉండాలన్నారు. ఇందుకు 500 కొత్త భవనాలు, టాయిలెట్లు మంజురయ్యాయని, వాటిని వారంలోగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఐసీడీఎస్ ఉద్యోగులపై బాధ్యతలు..
అన్ని శాఖల కంటే ఐసీడీఎస్ శాఖపై చాలా బాధ్యత ఉందని ఐసీడీఎస్ రాష్ట్ర జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి అన్నారు. పిల్లలకు, గర్భిణులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలన్నారు. జిల్లాలో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురయ్యారంటే, దానికి కారణం పౌష్టికాహారం అందించకపోవడమేనని అన్నారు.
వచ్చే తరం పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలన్నారు. కాగా ఫ్రీ స్కూల్ పిల్లలు అంగన్‌వాడీలకు వచ్చే విధంగా, వారి హాజరు శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జెడ్పీ సీఈఓ రాజారాం, డీపీవో సురేశ్‌బాబు, డీఈఓ శ్రీనివాసచారి పాల్గొన్నారు.
పౌష్టికాహారలోపం మీ నిర్వాహకమే
Published Thu, Feb 13 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement