రాష్ట్రాభివృద్ధికి విద్యార్థులే పునాదులు
నందిపేట రూరల్ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి విద్యార్థులే పునాదులు కావాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆకాంక్షించారు. వ్యక్తిగతంగానే కాకుండా దేశ, భాషాభివృద్ధికి శిక్షణ వ్యవస్థ కీలకమని అన్నారు. సోమవారం మండలంలోని డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా శిక్షణ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. 5 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ప్రభుత్వం పాఠశాలల్లో ఎన్ని వసతులు కల్పించినా ఎక్కడో ఒకచోట విమర్శలు ఎదురవుతునే ఉన్నాయన్నారు. పాఠశాలల్లో అదనపు గదులు కట్టించినంత మాత్రాన సమస్యలు తీరిపోవని, పాఠశాలకు పూర్తిస్థాయిలో విద్యార్దులు వచ్చినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. మనం చేసే ప్రయత్నం మంచిదై సదుద్దేశంతో చేస్తేనే విజయం సాధిస్తామని, ప్రయోజనంలేని పనిచేయడం వ్యర్థమన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. అందుకు తమ సహాయం పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని తాను చెప్పడం లేదని, అందులో రెండు శాతం తక్కువయినా జ్ఞానాన్ని మాత్రం విద్యార్థులు సముపార్జించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మన పక్కనే ఉన్న సరస్వతి మాతా ఆశీస్సులతో జిల్లాలోని ప్రతి విద్యార్థి మంచిఫలితాలు సాధించాలని, అందుకు డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థులే ఆదర్శం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి శ్రీనివాసాచారి, స్థానిక సర్పంచ్ హరి దాస్, ఆర్‌వీఎం పీఓ కిషన్‌రావు, సీఎంఓ స్వర్ణలత, మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌చార్జి హెచ్‌ఎం అశోక్, ఎంపీడీఓ నాగవర్ధన్, విద్యాకమిటీ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు.
దీపికకు కలెక్టర్ అభినందన
నందిపేట రూరల్ : ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 10/10 గ్రేడు సాధించిన మండలంలోని తల్వేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పి. దీపికను కలెక్టర్ ప్రద్యుమ్న అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని దీపిక, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పోటీపడి ఈ ఘనత సాధించడం హర్షించదగిన విషయమన్నారు. చదువుకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల అనే తేడా ఏమీ ఉండదని, ముందుగా చదువుకోవడానికి ప్రయత్నం, సాధించాలనే పట్టుదల ఉంటే ఫలితం మనముందే సాక్షాత్కరిస్తుందన్నారు.
అందుకు దీపికే నిదర్శనమన్నారు. విద్యార్థులకు చదువుచెప్పడంతోనే ఉపాధ్యాయుల బాధ్యత తీరదని, నిజాయితీగా పనిచేసి చదువుకు సార్థకత చేకూరేలా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినపుడే తగు న్యాయం చేసినవారవుతారన్నారు. దీపికను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.