ఇందూరు ఆదర్శం | Meritocracy of district says pradyumna | Sakshi
Sakshi News home page

ఇందూరు ఆదర్శం

Published Tue, Jun 3 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

Meritocracy of district says pradyumna

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఇందూరు జిల్లా ‘తెలంగాణ’లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక ప్రణాళి కతో ముందుకెళ్తామన్నారు. మన పూర్వీకు లు సాధించిన ఘన కార్యాలెన్నో ఉన్నాయ ని, వాటిని భావితరాలకు అందిస్తే వారు నవోత్తేజంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఉదయం నిజామాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన వారికి కలెక్టర్ జోహారులు అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

 2013-14 సంవత్సరంలో వ్యవసా య రంగంలో అత్యధికంగా రూ. 1,834 కోట్ల రుణాలను అందించామన్నారు. రబీ సీజన్‌లో 274 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని, 32 వేల మంది రైతులకు ఆన్‌లైన్ ద్వారా మూడు రోజుల్లోపే డబ్బులు చెల్లించామన్నారు.

 గతేడాది మహిళా సంఘాలకు రూ. 426 కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా రూ. 475 కోట్ల  రుణాలిచ్చామన్నారు. ఆ ఏడాది మహిళా సంఘాలు రూ. 54 కోట్ల వడ్డీ రాయితీ పొందాయన్నారు. ఎక్కువ వడ్డీ రాయితీని పొందిన జిల్లాలో ఇందూరుది ప్రథమ స్థానమని పేర్కొన్నారు. స్త్రీనిధి పథకం కింద రూ. 132 కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యంకాగా రూ. 142 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఈ విషయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంనుంచి పురస్కారాన్ని అందుకున్నామన్నారు.

 సూక్ష్మ నీటిపారుదల పథకం కింద 2013-14 సంవత్సరంలో 5,010 హెక్టార్ల లక్ష్యానికి గాను 4,431 హెక్టార్లలో నీటి పారుదల సదుపాయం కల్పించామన్నారు. బంగారుతల్లి పథకం కింద 10,129 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2013-14 సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా ప్రథమ స్థానం లో ఉందని, గతేడాది 19,621 ఇళ్ల నిర్మాణాల లక్ష్యానికిగాను 16,517 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. జిల్లాలో రెండు స్టేడియాల నిర్మాణానికి రూ.10.20 కోట్లు మంజూరయ్యాయన్నారు.

 నిజామాబాద్ నగరంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా రూ. 56 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో 25 వేల కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఆర్మూర్‌కు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ. 70 కోట్ల విలువ గల పథకం మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా రూ. 34 కోట్లతో చేపట్టిన పనులు ముగింపు దశలో ఉన్నాయని, దీని ద్వారా పట్టణంలో 10 వేల అదనపు తాగునీటి కనెక్షన్లు ఇవ్వవచ్చని వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, జిల్లా జడ్జీ షమీమ్ అక్తర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు, ఎస్పీ తరుణ్‌జోషి, డీఆర్‌వో రాజశేఖర్, డీపీవో సురేశ్‌బాబు, డ్వామా పీడీ శివలింగయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం, గృహనిర్మాణ సంస్థ పీడీ చైతన్యకుమార్, జడ్పీ సీఈవో రాజారాం, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు విమలాదేవి, శ్రీనివాసాచారి, కొండల్‌రావు, దివాకర్, భీమానాయక్, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement