కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యమే దిక్కవుతోంది. కాస్త ఎక్కువ సేపు ఉడికిస్తే గంజిగా మారే అన్నం, మంట తగ్గిస్తే బిరుసుగా తయారవుతుండటంతో విద్యార్థులు తరచూ కడుపునొప్పి బారిన పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ఇప్పటికే సంబంధిత మంత్రి రావెల కిశోర్‌బాబు పలుమార్లు చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వసతిగృహాల్లోని విద్యార్థులకు సోనా మసూరి బియ్యం సరఫరా అవుతుండగా.. ఇక్కడ మాత్రం ముక్కిన బియ్యం తోనే సరిపెడుతున్నారు.
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతిగృహాలను కలుపుకొని మొత్తం 122 వసతిగృహాలు ఉండగా.. దాదాపు 13వేల మంది విద్యార్థినీ విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి సంబంధించి 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి 15 కిలోలు.. ఇంటర్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ లెక్కన ప్రతి నెలా 2040 క్వింటాళ్ల బియ్యం జిల్లాలోని అన్ని ఎస్సీ వసతి గృహాలకు అందుతోంది.
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరఫరా అవుతున్న ఈ బియ్యం పూర్తి నాణ్యతాలోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సంచి బాగుంటే, మరో సంచిలో ఏమాత్రం బాగాలేని బియ్యం వస్తున్నాయని, ఎక్కువ శాతం మట్టిపెడ్డలు, రాళ్లు ఉంటున్నాయని వంట మనుషులు వాపోతున్నారు.
ముక్కిన బియ్యాన్ని ఎక్కువ సార్లు శుభ్రం చేస్తే నూకగా మారి అన్నం విరిగి పోతోందని వాపోతున్నారు. కళాశాల విద్యార్థులతో పాటు హైస్కూల్ స్థాయి విద్యార్థులకు కూడా ఇవే బియ్యం సరఫరా అవుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు.
నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి
సంక్షేమ వసతి గృహాలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి. ప్రస్తుతం సరఫరా అవుతున్న బియాన్ని పలుమార్లు శుభ్రం చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. రాళ్లు, మట్టి పెడ్డలు అధికంగా వస్తున్నాయి. గంజిగా ఉంటున్న అన్నాన్ని తినలేక అర్ధాకలితో ఉంటున్నాం. కొందరు విద్యార్థులు తరచూ కడుపునొప్పితో అల్లాడిపోతున్నారు.
- నాగేంద్ర, బీకాం ఫైనలియర్
ఇచ్చిన హామీని మంత్రి అమలు చేయాలి
సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని మంత్రి రావెల కిశోర్‌బాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. నాణ్యత లేని బియ్యం హాస్టళ్లకు సరఫరా అవుతున్నందున ఎక్కువ మంది విద్యార్థులు కడుపునిండా భోజనం చేయలేకపోతున్నారు. కళాశాల వసతి గృహాలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఫ్రెష్ విద్యార్థులకు ఇంతవరకు ప్రవేశాలు కల్పించలేదు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి.
- జి.నాగరాజు, బీఏ ఫైనలియర్
ముక్కిన బియ్యం.. మగ్గిన హామీ
Published Sun, Jul 12 2015 2:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement