kishore babu
-
ఏయూలో ఉద్యోగాలు కోత కథనాలన్నీ అవాస్తవాలే
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుల ఉద్యోగాల భర్తీలో 200 పోస్టులకు కోత అని, ఏయూకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఏయూ అకడమిక్ డీన్ ఆచార్య ఎ.కిశోర్‌బాబు తెలిపారు. శనివారం పచ్చ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. 2015–16లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన రేషనలైజేషన్ కమిటీ అధ్యయనం తరువాత 2017లో ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్ 39ని విడుదల చేసిందని, దీనిలో ఏయూలో 936 ఖాళీలకు గాను రేషనలైజేషన్ తరువాత 750 ఉద్యోగాలు ఉన్నట్లు తేల్చిందని చెప్పారు. కమిటీ సూచించిన ఖాళీల్లో తొలి దశలో 281, రెండో దశలో 104 ఉద్యోగాలు వెరసి 391 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయాలంటూ జీవో 39లో పేర్కొందని తెలిపారు. అయినప్పటికీ ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేకపోయిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్ 61ని విడుదల చేస్తూ ఏయూలో ఒకే దఫాలో మొత్తం 726 ఖాళీలు భర్తీ చేయాలని సూచించిందని చెప్పారు. ప్రస్తుత రేషనలైజేషన్ కమిటీ గత ఎనిమిది నెలల కాలంగా శాస్త్రీయంగా పరిశీలన జరిపి అందరి నుంచి వివరాలు తీసుకుని 726 ఉద్యోగాలు భర్తీచేయడానికి నోటిఫికేషన్ సిద్ధం చేయాలని సూచించిందని వెల్లడించారు. దీనిని పరిశీలిస్తే ఏయూలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో భర్తీ చేయాలని విడుదల చేసిన ఖాళీల కంటే అధికంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సూచించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. ఏయూ అవసరాల దృష్ట్యా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 24 పోస్టులే తగ్గాయి ప్రస్తుతం ఏయూలో దూరవిద్య కేంద్రం పూర్తిగా ఆటోమేషన్ చేయడంతో పాటు విజయనగరం, కాకినాడ, తాడేపల్లిగూడెం పీజీ సెంటర్లను మూసివేయడం, ఇతర విశ్వవిద్యాలయాల్లో విలీనం చేయడం జరిగింది. క్యాంపస్‌లో న్యూక్లియర్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ వంటి కోర్సులకు విద్యార్థుల నుంచి తగినంత స్పందన లేకపోవడంతో నిలిపివేశారు. దీనికారణంగా కేవలం 24 ఉద్యోగాలు మాత్రమే తగ్గాయనే వాస్తవాన్ని గుర్తెరగాలని సూచించారు. -
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?
టీడీపీ తీరు అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కె.పార్థసారథి విమర్శించారు. పుష్కరాలకు ఆహ్వానించే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఆహ్వానానికి వచ్చేటపుడు మీడియాను కూడా వెంటబెట్టుకుని వచ్చారని అన్నారు. ఆహ్వానించడానికి వచ్చినవారిని తాము గౌరవంగానే చూసుకున్నామని తెలిపారు. వారికి సాదరంగా స్వాగతం పలికామని, అయినా వాళ్లు మాత్రం వెళ్తూ వెళ్తూ ఈ అంశాన్ని రాజకీయం చేశారని, ఇంతకంటే కుసంస్కారం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. పుష్కరాలు ప్రారంభమైన 24 గంటల తర్వాత ఆహ్వానం ఇస్తారా, అయినా అసలు ఆహ్వానం అందించేటపుడు సంబంధిత వ్యక్తి ఉన్నారా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి కదా అని ఆయన అన్నారు. వైఎస్ జగన్ అందుబాటులో లేరని తెలిసి మరీ రాజకీయానికి పాల్పడ్డారని, టీవీల ద్వారా లీకులిచ్చి, నిఘాసిబ్బందిని పెట్టుకుని రాజకీయాలు చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారని, అయినా ఆయనను కలుస్తామంటూ మంత్రి రావెల ఓఎస్డీ కాల్ చేశారని పార్థసారథి తెలిపారు. ఈ విషయాన్ని టీవీలకు లీకులు ఇచ్చారని అన్నారు. వచ్చినవాళ్లను రిసీవ్ చేసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ తనకు చెప్పారని, తూర్పుగోదావరి పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా మంత్రి కిశోర్ బాబు, విప్ కూన రవికుమార్ వచ్చారా లేదా అని జగన్ తనను అడిగారని, వాళ్లు రాలేదని చెప్పడంతో రేపు కలుద్దాంలే అని తనతో అన్నారని వివరించారు. జగన్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి రావెల, రవికుమార్ వచ్చారని, వారిని తాను రిసీవ్ చేసుకుని రేపు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పానని, ఈ ఘటన అంతా చూస్తే ఎవరిది తప్పో అర్థమవుతుందని అన్నారు. అసలు ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే తీరు ఇదేనా, ఇలా చేయడం ప్రజాస్వామ్యంలో అవమానించడం కాదా అని ప్రశ్నించారు. -
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?
-
ప్రియుడి చేతిలో వివాహిత హత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రియుడి చేతిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కళాశాలలో తన సీనియర్ అయిన వ్యక్తితో కొనసాగించిన వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గుంటూరు అమరావతి రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం కొమ్మూరుకు చెందిన కుమ్మరి రమ్య (24)కు గుంటూరు గోరంట్లకు చెందిన సతీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇంజనీరింగ్ చదివే సమయంలో రమ్యకు కిషోర్‌బాబు అనే సీనియర్ విద్యార్థితో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే, పెళ్లయిన తర్వాత కూడా ఈ బంధం కొనసాగించడంతో వారు మరింత సన్నిహితమయ్యారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని రమ్య కిషోర్‌బాబుపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదే విషయమై మంగళవారం కిషోర్‌బాబు ఫ్లాట్‌లో వారిద్దరీ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆగ్రహించిన కిషోర్‌బాబు రమ్యను గొంతునులిమి నేలకేసి కొట్టడంతో ఆమె మృతి చెందింది. వెంటనే కిషోర్‌బాబు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముక్కిన బియ్యం.. మగ్గిన హామీ
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యమే దిక్కవుతోంది. కాస్త ఎక్కువ సేపు ఉడికిస్తే గంజిగా మారే అన్నం, మంట తగ్గిస్తే బిరుసుగా తయారవుతుండటంతో విద్యార్థులు తరచూ కడుపునొప్పి బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ఇప్పటికే సంబంధిత మంత్రి రావెల కిశోర్‌బాబు పలుమార్లు చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వసతిగృహాల్లోని విద్యార్థులకు సోనా మసూరి బియ్యం సరఫరా అవుతుండగా.. ఇక్కడ మాత్రం ముక్కిన బియ్యం తోనే సరిపెడుతున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతిగృహాలను కలుపుకొని మొత్తం 122 వసతిగృహాలు ఉండగా.. దాదాపు 13వేల మంది విద్యార్థినీ విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి సంబంధించి 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి 15 కిలోలు.. ఇంటర్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ లెక్కన ప్రతి నెలా 2040 క్వింటాళ్ల బియ్యం జిల్లాలోని అన్ని ఎస్సీ వసతి గృహాలకు అందుతోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరఫరా అవుతున్న ఈ బియ్యం పూర్తి నాణ్యతాలోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సంచి బాగుంటే, మరో సంచిలో ఏమాత్రం బాగాలేని బియ్యం వస్తున్నాయని, ఎక్కువ శాతం మట్టిపెడ్డలు, రాళ్లు ఉంటున్నాయని వంట మనుషులు వాపోతున్నారు. ముక్కిన బియ్యాన్ని ఎక్కువ సార్లు శుభ్రం చేస్తే నూకగా మారి అన్నం విరిగి పోతోందని వాపోతున్నారు. కళాశాల విద్యార్థులతో పాటు హైస్కూల్ స్థాయి విద్యార్థులకు కూడా ఇవే బియ్యం సరఫరా అవుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి సంక్షేమ వసతి గృహాలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి. ప్రస్తుతం సరఫరా అవుతున్న బియాన్ని పలుమార్లు శుభ్రం చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. రాళ్లు, మట్టి పెడ్డలు అధికంగా వస్తున్నాయి. గంజిగా ఉంటున్న అన్నాన్ని తినలేక అర్ధాకలితో ఉంటున్నాం. కొందరు విద్యార్థులు తరచూ కడుపునొప్పితో అల్లాడిపోతున్నారు. - నాగేంద్ర, బీకాం ఫైనలియర్ ఇచ్చిన హామీని మంత్రి అమలు చేయాలి సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని మంత్రి రావెల కిశోర్‌బాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. నాణ్యత లేని బియ్యం హాస్టళ్లకు సరఫరా అవుతున్నందున ఎక్కువ మంది విద్యార్థులు కడుపునిండా భోజనం చేయలేకపోతున్నారు. కళాశాల వసతి గృహాలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఫ్రెష్ విద్యార్థులకు ఇంతవరకు ప్రవేశాలు కల్పించలేదు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి. - జి.నాగరాజు, బీఏ ఫైనలియర్ -
వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడాశిక్షణ
మంత్రి రావెల కిశోర్‌బాబు కణేకల్లు: ‘గురుకుల పాఠశాలల్లో చదువుతోంది పేద విద్యార్థులే. వారిని వేసవి సెలవుల్లో ఇళ్లకు పంపితే కూలీలుగా మారతారు. పైగా కడుపు నిండా భోజనం కూడా తినలేరు. అందుకే ఇళ్లకు పంపకుండా క్రీడల్లో తర్ఫీదునివ్వాలని నిర్ణయించాము. స్పోకెన్ ఇంగ్లిష్, సంగీతం కూడా నేర్పిస్తామ ’ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. కణేకల్లుక్రాస్లో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో న్యూట్రీషన్ ఎక్స్‌పర్ట్‌ను నియమించి మంచి ఆహారాన్ని అందిస్తూ డైట్ కంట్రోల్ చేస్తామన్నారు. ప్రతి గురుకుల పాఠశాలలో రూ.10 లక్షలు వెచ్చించి కంప్యూటర్ విద్యను అందిస్తామన్నారు. గురుకుల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఐటీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోన శిశధర్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ధర్మవరం ఆర్డీఓ రామారావు, ఎంపీపీ షేక్ ఫాతిమాబీ, జెడ్పీటీసీ సభ్యురాలు శారద, సర్పంచు కౌసల్య, ఉప సర్పంచు ఆనంద్, తహశీల్దార్ వెంకటశేషు, ఇన్చార్జ్ ఎంపీడీఓ బారన్సాబ్ పాల్గొన్నారు. మాదిగ దళారులను తరిమికొట్టండి కళ్యాణదుర్గం: కొన్ని పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన దుర్మార్గపు మాదిగ దళారులను తరిమికొట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ ర్యాలీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులు దోపిడీ గురయ్యారన్నారు. దళితుల భూములను లాక్కున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌ను దళితులు భూస్థాపితం చేశారన్నారు. అనంతరం ఆయన వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశాన్ని తమకు వదిలివేయాలని, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి పాల్గొన్నారు. మాఫీ ఎప్పుడో చెప్పండి ఉరవకొండ :‘సార్.. మీరు వూ కోసం ఏమీ చేయొద్దు. ఎన్నికలప్పుడు చెప్పినవిధంగా దయుచేసి వూ బ్యాంకు రుణాలు వూఫీ చేయుండి చాలు’ అంటూ పలువురు రైతులు రాష్ట్ర సాంఘిక సంక్షేవు శాఖ వుంత్రి రావెల కిషోర్‌బాబును వేడుకున్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలోని కణేకల్లుకు వెళుతూ వూర్గవుధ్యంలోని ఉరవకొండలో ఆగారు. అంబేద్కర్ విగ్రహానికి పూలవూల వేసి నివాళులర్పించిన తర్వాత అక్కడే ఉన్న కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘వూ కడుపులు వుండుతున్నాయి. అప్పుల బాధతో అవస్థ పడుతున్నాం. రుణమాఫీ అయ్యేలా చూడండి’ అంటూ వాపోయారు. తర్వాత వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకారుులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల జోక్యంతో వారి ప్రయత్నం ఫలించలేదు. -
గిరిజనులకు ప్రత్యేక బీఈడీ కళాశాల
శ్రీశైలంప్రాజెక్టు: గిరిజనులకు ప్రత్యేక బీఈడీ కళాశాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు హామీనిచ్చారు. శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో చెంచు ఉత్సవాలను మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిమ జాతులు ప్రకృతిలో కలిసిపోయి, ప్రకృతిని కాపాడుతూ తాము ఇంకా నిరక్షరాస్యులుగా, అనాగరికులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రరాష్ట్ర చెంచు గిరిజన సమగ్ర అభివృద్ధి సంస్థ పరిధి మూడు జిల్లాకు తగ్గిందన్నారు. ఫలితంగా గిరిజనుల అభివృద్ధి కోసం పాటు పడేందుకు దోహదపడుతుందన్నారు. అన్ని గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశా ల కోసం ఒక ప్రత్యేక బీఈడీ కళాశాలను ఏ ర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సంపాదించడం కోసం కంప్యూటర్లో శిక్షణను ఇప్పించడమే కాకుండా విదేశాలలో ఉన్నత చదువులను చదువుకునే చెంచులకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. చదువు మధ్యలో ఆపివేసిన వారికి కాంట్రాక్ట్ పనులలో శిక్షణ ఇప్పించి గిరిజన గూడాలలో జరిగే అభివృద్ధి పనుల్లో వారిని భాగస్వాములుగా చేస్తామన్నారు. గిరిపుత్రిక కల్యాణ పథకం కింద గిరిజనుల పెళ్లికి రూ. 50వేలను ఉచితంగా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. చెంచు గిరిజనులు భవిష్యత్ తరాలలో ఉన్నత ఉద్యోగ, హోదాలలో ఉండేందుకు తప్పనిసరిగా చదువుకోవాలని మంత్రి అన్నారు. కార్యక్రమానికి హాజరైన సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గిరిజనులకు ఖర్చు పెట్టాల్సిన రూ. 12వేల కోట్ల ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్నిధులు పక్కదారి పట్టాయన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్నిధులు సక్రమంగా అందేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జెడ్పీటీసీ అయిన చెంచు గిరిజన మహిళ నారాయణమ్మను మంత్రులు అభినందించారు. చెంచు ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి చెంచు లక్ష్మి విగ్రహానికి పూలమాలలు వేశారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌లను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేకంగా ఆలపించిన చెంచు జానపద గీతాల సీడీని ఆవిష్కరించారు. గిరిజనులు తయారు చేసిన సంప్రదాయ వంటలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు రుచి చూశారు. వికలాంగుల గిరిజనులకు మంత్రి రావెల ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గిరిజనులకు సంప్రదాయ ఆటలపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డెరైక్టర్ చిన్నవీరభద్రుడు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి చెంచు ఉత్సవాలను ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లా గిరిజనులతో కలిపి నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ విజయమోహన్మాట్లాడుతూ.. అంతరించి పోతున్న చెంచు జాతి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించామని, అక్షరాస్యత, ఆధునిక సేద్యంపై చెంచులు మొగ్గు చూపాలని ఆయన అన్నారు. ఉత్సవ కార్యక్రమంలో శాసన సభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, వై. ఐజయ్య, జిల్లా పరిషత్చెర్మైన్ మల్లెల రాజశేఖర్, ఎస్పీ రవికృష్ణ, డీఎంఅండ్ హెచ్ఓ నిరుపమ, ఐటీడీఏ పీఓ ఈసా రవీంద్రబాబు, చెంచు గిరిజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
మంత్రి కిషోర్‌బాబును అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
ఒంగోలు(ప్రకాశం జిల్లా): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మందకృష్ణ మాదిగపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్నాయకులు ఒంగోలులో ఆయనను అడ్డుకున్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మందకృష్ణ మాదిగకు డబ్బులు ఇవ్వడంతో ఆయన ఆ పార్టీని విమర్శించడంలేదని ఆరోపించారు. దీంతో శనివారం ఒంగోలులో మరో మంత్రి సిద్దరాఘవరావు ఇంటి వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులుకిషోర్బాబును అడ్డుకున్నారు. ఆయన వారిని పట్టించుకోకపోవడంతో సిద్ధరాఘవరావు ఇంటి ముందు నినాదాలు చేశారు. దీంతో ఆయన వారిని ఇంటిలోకి పిలిచి మంతనాలు జరుపుతున్నారు. -
భావి శాస్త్రవేత్తల కొలువు
గుంటూరు ఎడ్యుకేషన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతే దేశాభివృద్ధికి కొలమానమని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో స్థానిక పాతగుంటూరులోని యాదవ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ ఏర్పాటుచేసిన ప్రదర్శన ప్రారంభ సభలో ముఖ్యఅతిథి రావెల మాట్లాడుతూ దేశానికి శాస్త్ర,సాంకేతిక రంగాల ప్రగతి కీలకమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక రాజధాని నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రాబోయే 50 ఏళ్లలో శాస్త్ర, సాంకేతిక రంగం ఏవిధంగా ఉంటుందో ఊహించి అందుకనుగుణంగా ఇప్పటి నుంచే విద్యార్థులను సంసిద్ధులను చేసేవిధంగా విద్యాబోధన సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డును ప్రవేశపెట్టిన తరువాతే వైజ్ఞానిక ప్రదర్శనలు విస్తృతంగా ఏర్పాటు జరుగుతున్నాయని, విద్యార్థుల్లో సైతం పరిశోధనలు చేయాలనే కాంక్ష పెరిగిందని వివరించారు. విద్యార్థులు భావిశాస్త్రవేత్తలు.. -ఎమ్మెల్యే ముస్తఫా విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముస్తఫా మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో శాస్త్రవేత్తల పరిశోధనలు కీలకమని చెప్పారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, ఆర్డీవో టి.భాస్కరనాయుడు, ప్రదర్శన కన్వీనర్, గుంటూరు డీవైఈవో పి.రమేష్, డీవైఈవోలు జి.విజయలక్ష్మి, పీవీ శేషుబాబు, ఎ.కిరణ్‌కుమార్, యాదవ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మైలా అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 226 ప్రాజెక్టులు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు 226నమూనా ప్రాజెక్టులను ప్రదర్శనకు తీసుకువచ్చారు. వీటిలో ఎక్కువ భాగం మూడు నెలల క్రితం గుంటూరులో ఏర్పాటుచేసిన ఇన్స్పైర్ సైన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ప్రాజెక్టులే కావడం గమనార్హం! ప్రదర్శనలో 18 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపికచేసి రాష్ట్రస్థాయికి పంపారు. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బాల మేధావుల సృజనకు అద్దంపట్టింది. విద్యార్థులు తమ మదిలో మెదిలిన ఆలోచలనకు వాస్తవ రూపం కల్పిస్తూ పలు ప్రాజెక్టులు రూపొందించారు. వాటిలో పలు నమూనా ప్రాజెక్టులను పరిశీలిస్తే... ప్రాజెక్టు పేరు: ఎమర్జెన్సీ ఎయిర్‌క్రాఫ్ట్ లొకేటర్ డివైజ్ రూపకల్పన: కేవీ నాగేశ్వరరావు, జెడ్పీహెచ్ఎస్, నుదురుపాడు, ఫిరంగిపురం మండలం ప్రధానాంశం: హైజాక్ అయిన, కనిపించకుండాపోయిన విమానాల జాడ కనుగొనేందుకు ఎమర్జెన్సీ ఎయిర్‌క్రాఫ్ట్ లొకేటర్ డివైజ్ అనే నూతన పరికరం రూపకల్పన దిశగా విద్యార్థులు పరిశోధన చేశారు. శాటిలైట్ ఫోన్, కంప్యూటర్ నియంత్రణతో విమాన సమాచార వ్యవస్థను పటిష్టపరచవచ్చనే నూతన ఆలోచనకు నాంది పలికారు. ప్రాజెక్టు పేరు: ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్స్ అండ్ గేట్ రూపకల్పన: కె.రాజేష్, ఎం.తిరుపతిరావు, జెడ్పీహెచ్ఎస్, ఎండుగుంపాలెం, నాదెండ్ల మండలం ప్రధానాంశం: కాపలాదారులు లేని రైల్వేగేట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్స్, గేట్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రైల్వే లెవల్ క్రాసింగ్‌కు కిలోమీటరు దూరంలో ట్రాక్ కింద సెన్సార్లను అమర్చడం ద్వారా రైలు వస్తున్న సమాచారం గేటు వద్దనున్న అలారానికి చేరి మోగుతుంది. వెంటనే వాహనదారులు గుర్తించడం సాధ్యపడుతుంది. మనిషి అవసరం లేనివిధంగా ఆటోమేటిక్‌గా రైలుగేటు వేసి, తీయడం చేయవచ్చు. ప్రాజెక్టు పేరు: రోబోటిక్ గన్ రూపకల్పన: జి.మానసి, కేర్ పబ్లిక్ స్కూల్, నరసరావుపేట ప్రధానాంశం: బ్యాంకులు, జ్యుయలరీలు, వాణిజ్య సముదాయాల్లో నిరంతరం సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుని వారితో గస్తీ చేయించడం సాధ్యం కాని పరిస్థితుల్లో రోబోటిక్ గన్ నూతన ఆలోచనకు తెరతీసింది. బ్యాంకులో ఒకచోట రోబోటిక్ గన్ను ఏర్పాటుచేస్తారు. సీసీ కెమెరాల ద్వారా దానిని కంప్యూటర్‌కు అనుసంధానించి, నెట్ ఆధారిత రిమోట్‌ను సమీప పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతారు. దుండగులు చోరీకి పాల్పడిన సమయంలో సీసీ కెమెరా ద్వారా చూసిన పోలీసులు తమ వద్దనున్న రిమోట్ మీటను నొక్కగానే వెంటనే బుల్లెట్ దూసుకుపోతుంది. దీని ద్వారా చోరీలను అరికట్టి, దొంగల ఆట కట్టించవచ్చు. -
ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య: కిశోర్ బాబు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను త్వరలోనే ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఇందుకు ఆర్హులైన విద్యార్థులను గుర్తిస్తామని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల నుంచే ఖర్చు చేయనున్నట్లు మంత్రి కిశోర్ బాబు చెప్పారు. ఈ ఏడాది సుమారు వెయ్యిమంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాలని యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
హైదరాబాద్‌లో ప్రణాళిక.. విజయవాడలో అమలు
ఎవరో కొంతమందికి లబ్ధి చేకూర్చాలని విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా ఎన్నుకోలేదని రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎంపికచేస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన స్పందించారు. రాజధాని ఏర్పాటు చేయాలంటే కొన్ని ప్రమాణాలు అవసరమని, ఆ ప్రమాణాలు అమలు చేయాలంటే ఓ తాత్కాలిక రాజధాని అవసరమని, అందుకోసమే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎన్నుకున్నామని కిశోర్‌బాబు వివరించారు. హైదరాబాద్‌లో ప్రణాళికలు వేసుకుని విజయవాడలో అమలు చేస్తామని, రాజధాని వికేంద్రీకరించి ఉండాలి కనుకే విజయవాడను ఎన్నుకున్నామని ఆయన అన్నారు. -
అయ్యబాబోయ్...మంత్రిరావెలా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు:రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు జిల్లాలో హల్చల్ సృష్టిస్తున్నారు. ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తూ ఇటు ఉద్యోగులు, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి కారకులవుతున్నారు. పార్టీ కార్యకర్తల ముందే ఉద్యోగులను తూలనాడుతున్నారనే విమర్శలుటీడీపీ వర్గీయుల నుంచే వినిపిస్తున్నాయి. ‘నేను సీరియస్ మంత్రిని మా కార్యకర్తలు చెప్పిన పనిచేయక పోతే శంకరగిరిమాన్యాలకు పంపుతా, సస్పెండ్ చేయిస్తా,ఇంటికి పంపిస్తా, కడపకు ట్రాన్స్ఫర్ చేయిస్తా’ అంటూ పార్టీ కార్యకర్తల ముందే అధికారులను చులకన చేసి మాట్లాడుతు న్నారు. ఆయన జిల్లాలో పర్యటించిన ప్రతిసారీ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం పరిపాటిగా మారింది. కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఉద్యోగులను ‘నీకు బుద్ధి ఉందా’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పినపని చేయకపోతే ఇంతే సంగతులంటూ బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ, పోలీస్, దేవాదాయశాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి రావెల చుక్కలు చూపించారు. బెదిరిపోయిన ఆయా శాఖల అధికారులు ఉద్యోగం అంటూ ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చనే భావనతో బదిలీపై వెళ్లే యత్నంలో ఉన్నారు. మహిళా ఉద్యోగులైతే మౌనంగా కుంగిపోతున్నారు. ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలకు చెప్పుకునేందుకు వెనుకాడుతున్నారు. ఆ షాక్ నుంచి తేరుకునేందుకు ఒకటి, రెండు రోజులు సెలువు పెట్టి మళ్లీ విధులకు హాజరవుతున్నారు. ‘ప్రజల వద్దకు పాలన’, ‘జన్మభూమి’ వంటి కార్యక్రమాలతో ప్రస్తుత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులు, అధికారులపై నోరుపారేసుకోవడం వల్లనే ఆ వర్గాలకు దూరమాయ్యరనే విషయాన్ని మంత్రి గుర్తించడం లేదని టీడీపీ శ్రేణులు భయాందోళనకు గురవుతున్నాయి. ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని చెప్పడానికి కొన్ని సంఘటనలను ఉదాహరణుగా చూపుతున్నారు. బుధవారం పెదనందిపాడులో మండల ఉపాధ్యక్షుడు నర్రా బాలకృష్ణ నివాసంలో మంత్రి రావెల పెదనందిపాడు, కాకుమాను మండల నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. నాలుగు గోడల మధ్య జరిగిన ఈ సమావేశానికి ప్రొటోకాల్ ప్రకారం అధికారులు వెళ్లాల్సిన అవసరం లేకపోయినా రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది హాజరయ్యారు. అన్నవరం గ్రామ ఎస్సీకాలనీ రోడ్డు సమస్యపై సర్పంచ్ ఎన్.శివశంకరరావు ఫిర్యాదు మేరకు మంత్రి రావెల మండల తహశీల్దారు సీహెచ్ పద్మావతి, ఎస్ఐ లోకేశ్వరరావులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు సమస్య తమ పరిధిలోకి రాదని ఆ ఇద్దరు అధికారులు చెప్పినప్పటికీ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు సమాచారం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల అనంతరం వట్టిచెరుకూరు మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇక్కడ కొందరు కార్యకర్తలు ఎస్ఐపై ఫిర్యాదు చేయడంతో, ‘పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం,కార్యకర్తలకు అనుగుణంగా పనులు చేయాలని’ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఎస్ఐపై ఫిర్యాదు చేయడమేకాకుండా డిఎస్పీ కె.నరసింహను పిలిపించి ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. ఇతను మాకు అవసరం లేదు. మెడికల్ లీవ్‌లో వెళ్లిపోయే విధంగా చూడాలని డిఎస్పీని ఆదేశించారు. మంత్రి వ్యవహార సరళి ఇలా వుండడంతో భయపడుతున్న కొందరు అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మరో వైపు మంత్రి రావెల పనితీరుపై పార్టీలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి ఆయన వద్దకు వెళ్లే కంటే ఇతర మార్గాలు చూసుకోవడం మేలనే భావనలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. అధికారులు కూడా ఆయనకు సహకరించే పరిస్థితులు లేవంటున్నారు. -
బాలిక కిడ్నాపర్ల అరెస్ట్
ఇద్దరు విశాఖ యువకులు అరెస్టు, రిమాండ్ బాధితురాలిది రంగారెడ్డి జిల్లా కేసు ఛేదించిన రెల్వే పోలీసులు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఓ మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి విశాఖకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుందామనుకున్న ఇద్దరు అన్నదమ్ముల కుట్రను రైల్వే పోలీసులు పటా పంచలు చేశారు. కిడ్నాపర్లు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి మైనర్ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలను జీఆర్పీ డీఎస్పీ వెంకటరావు గురువారం విలేకరులకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కే పల్లి గ్రామానికి చెందిన నిమ్మగడ్డ గంగాధరరావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ఇటీవల టెన్త్ ఉత్తీర్ణురాలైంది. మొక్కు తీర్చుకునేందుకు ఇటీవల విజయవాడ దుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం కుటుంబమంతా వచ్చారు. అమ్మవారి దర్శనం తర్వాత విజయవాడలోనే బంధువుల ఇంటికెళ్లారు. మైనర్ బాలిక తల్లికి అనారోగ్యంగా ఉండడంతో బాలికను ఇంట్లోనే ఉంచి బుధవారం అందరూ ఆస్పత్రికి వెళ్లారు. వారు ఇంటికి వచ్చి చూస్తే బాలిక కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ ఎస్పీ డాక్టర్ శ్యాంప్రసాద్ దృష్టికి ఈ విషయం రావటంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి విశాఖ జీఆర్పీని అప్రమత్తం చేశారు. రైళ్ల తనిఖీలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో మైనర్ బాలికతో బాటు విశాఖలోని గోకుల్ థియేటర్లో కేటరింగ్ స్టాల్లో పని చేసే రాజు (20), అతని అన్నయ్య కిశోర్ బాబు (32) దొరికిపోయారు. వీరిద్దరినీ ట్రయినీ ఎస్ఐ విజయ్ కుమార్ అరెస్టు చేసి విషయం రాబట్టారు. ప్రధాన అనుమానితుడు కిశోర్‌బాబు హైదరాబాద్‌లోనే కొంతకాలంగా ఉంటున్నాడు. మైనర్ బాలికకు కిశోర్ బాబుకు మధ్య పరిచయాలున్నాయి. ఈ పరిచయంతోనే మాయ మాటలు చెప్పి విశాఖకు తీసుకు వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు చెప్పారు. -
‘నన్ను కిడ్నాప్ చేశారు.. ఇవే చివరి మాటలు’
* కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి చివరి మాటలివి * ఖమ్మంలో గతనెల 31న కిడ్నాప్ * కృష్ణానదిలో మరుసటిరోజు రాత్రి మృతదేహం లభ్యం * వ్యాపారంలో గొడవలతోనే హత్య జరిగిందంటున్న కుటుంబసభ్యులు విజయవాడ : ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు.. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవే నా చివరి మాటలు కావచ్చు..’అని ఓ తండ్రి తీవ్ర ఆందోళనతో కుమారుడికి చివరిసారిగా ఫోన్లో చెప్పిన మాటలివి. వ్యాపారంలో గొడవల నేపథ్యంలో కిడ్నాప్‌కు గురైన ఆ వ్యక్తి ఆదివారం రాత్రి కృష్ణానదిలో శవమై తేలాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు చెందిన కిషోర్‌బాబు(48)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఖమ్మంలోని పొట్టిశ్రీరాములు రోడ్డులో ఇండూరు రాము అనే వ్యక్తితో కలిసి పురుగుమందులు, విత్తనాల వ్యాపారం చేస్తుంటాడు. గతనెల 31వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కిషోర్ బజారుకు వెళుతున్నానని భార్య ఉషకు చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుమారుడు వినయ్ పలుచోట్ల గాలించాడు. కిషోర్ ద్విచక్రవాహనం జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమీపంలో కనిపించింది. కిషోర్ బాబు జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. అదేరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వినయ్‌కు తండ్రి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవేనా నా చివరి మాటలు కావచ్చు’ అని ఆయన కుమారుడికి చెప్పాడు. దీంతో వినయ్ ఆందోళనకు గురై తల్లితో కలిసి ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కృష్ణానదిలో 38 వ ఖానా వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపిం చింది. స్థానికులు అందించిన సమాచారంతో స్థానిక స్టేషన్ సిబ్బందితోపాటు ఖమ్మం పో లీసులు, కిషోర్ బంధువులు అక్కడకు వెళ్లారు. మృతదేహాన్ని చూసి కిషోర్‌దిగా బంధువులు గుర్తించారు. ఎలా జరిగిందంటే.. కిషోర్ బజారులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి కొందరితో మాట్లాడేందుకు అని చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. అతడితోపాటు మరికొందరు కిషోర్ కాళ్లను తాళ్లతో కట్టివేసి కారులో పడవేసి విజయవాడకు బయలుదేరారు. నగరంలో పోలీసుల తనిఖీలు జరుగుతుండడంతో వాహనాన్ని కనకదుర్గమ్మ గుడికి సమీపంలో నిలిపారు. కిడ్నాపర్లు కారులోనుంచి దిగి పక్కకు వెళ్లారు. దీంతో కిషోర్ అప్రమత్తమై తన మొబైల్ నుంచి కుమారుడికి ఫోన్ చేయడంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో గొడవలతోనే.. తన భర్తకు వ్యాపారానికి సంబంధించి భాగస్వామి అయిన ఇండూరు రాముతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కిషోర్ భార్య ఉష పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. రాము బంధువైన ప్రభుత్వోద్యోగి పోటు శ్రీను కిడ్నాప్ ఇందులో ప్రధాన పాత్ర పోషించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆ నవ్వు చెరిగిపోయింది
ఏలూరు(టూ టౌన్), న్యూస్‌లైన్ : ‘పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదీలను నవ్వుతూ పలకరించేది.. పనిలో చురుకుగా ఉండేది.. ఆమె విగత జీవిగా మారటంతో స్టేషన్ బోసిపోయింది’ తోటి కానిస్టేబుళ్ల విచారం.. ‘మా మంచి చెడ్డలు అడిగి తెలుసుకునేది.. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండేది’ చుట్టుపక్కల ఇళ్లవారి వారి ఆవేదన. ఆమె మెలగిన తీరును తలచుకుంటూ తెలిసిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కాగాని జ్యోతిరాణి ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావటమే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన జ్యోతిరాణి, అదే బ్యాచ్‌లో శిక్షణ పొందిన జ్యోతిబాబు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రసుత్తం జ్యోతిబాబు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తమ ప్రేమ విషయం జ్యోతిరాణి ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. దానికి వారు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. తనకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇటీవల జ్యోతిరాణితో చెప్పిన జ్యోతిబాబు, ఆమెను కూడా ఇంట్లోవాళ్లు చూసిన సంబంధం చేసుకోమని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె దిగాలుగా ఉంటోంది. నాలుగు రోజుల క్రితం వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావకు రాగా, పెళ్ళి చేసుకోనని జ్యోతిబాబు కరాఖండిగా చెప్పాడు. దీంతో జ్యోతిబాబు ఇంటికి వెళ్ళి అతని కుటుంబసభ్యులతో మాట్లాడమని గత నెల 31న ఆమె తన తల్లి సత్యవతిని కోరింది. మూడు రోజుల్లో ఏమైందో ఏమో శుక్రవారం ఉదయం విధులకు వెళ్ళిన జ్యోతిరాణి సాయంత్రం ఇంటికి వచ్చింది. రాత్రి 8 గంటలకు చీర మార్చుకుంటానని తల్లికి చెప్పి తన గదిలోకి వెళ్ళింది. భోజనానికిగాను ఆమెను తల్లి పిలిచినా ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టం చేశారు. ఈ ఘటనపై ఏలూరు టూటౌన్ పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. గానుగులపేటలో విషాదచాయలు పవర్‌పేట సమీపంలోని గానుగులపేటలో నివాసం ఉంటున్న కాగాని త్రిమూర్తులు, సత్యవతికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. మూడో కుమార్తె చదువుకుంటోంది. రెండో కుమార్తె జ్యోతిరాణి. ఆమె స్నేహితులు పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నించటంతో ఆ స్ఫూర్తితో ఆమె ప్రయత్నించి కృతకృత్యురాలైంది. చిన్న వయసులోనే కానిస్టేబుల్ ఉద్యోగం రావటంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఇంటి చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకునే జ్యోతిరాణి మృతికి స్థానికులు కంటతడి పెట్టారు. పోస్టుమార్టం చేసే సమయంలో స్ధానికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఫిర్యాదీలను నవ్వుతూ పలకరించేది 2010లో పోలీసు శాఖలోకి అడుగుపెట్టిన జ్యోతిరాణి ముందుగా పెదపాడు పోలీసుస్టేషన్లో మొదటి పోస్టింగ్ వచ్చిన ఆమె రెండేళ్ల క్రితం ఏలూరు రూరల్ స్టేషన్‌కు బదిలీ అయింది. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదీదారులను నవ్వుతు పలకరించి, ఫిర్యాదులు తీసుకునేదని హెడ్ కానిస్టేబుల్ నాని చెప్పారు. రైటర్‌కు సహయకురాలైన ఆమె చురుకుగా పనిచేసేదని పలువురు కానిస్టేబుల్స్ పేర్కొన్నారు. జ్యోతిరాణి లేకపోవడంతో స్టేషన్ నిండుతనం కోల్పోయిందని 2010 బ్యాచ్ కానిస్టేబుల్స్ ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతిరాణికి ఇన్చార్జి డీఎస్పీ కర్రి పుష్పారెడ్డి, రూరల్ సీఐ శుభాకర్, రూరల్ ఎస్సై జోసెఫ్ రాజు, టూటౌన్ ఎస్సై కిషోర్‌బాబు,రూరల్ పోలీసు స్టేషన్ సిబ్బంది కన్నీటి వీడ్కొలు పలికారు. శనివారం జ్యోతిరాణి అంత్యక్రియలు జరిగాయి. జ్యోతిబాబుపై కేసు నమోదు : జ్యోతిరాణిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై కానిస్టేబుల్ జ్యోతి బాబుపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు టూటౌన్ ఎస్సై కిషోర్‌బాబు చెప్పారు.