ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుల ఉద్యోగాల భర్తీలో 200 పోస్టులకు కోత అని, ఏయూకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఏయూ అకడమిక్ డీన్ ఆచార్య ఎ.కిశోర్‌బాబు తెలిపారు. శనివారం పచ్చ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. 2015–16లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన రేషనలైజేషన్ కమిటీ అధ్యయనం తరువాత 2017లో ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్ 39ని విడుదల చేసిందని, దీనిలో ఏయూలో 936 ఖాళీలకు గాను రేషనలైజేషన్ తరువాత 750 ఉద్యోగాలు ఉన్నట్లు తేల్చిందని చెప్పారు.
కమిటీ సూచించిన ఖాళీల్లో తొలి దశలో 281, రెండో దశలో 104 ఉద్యోగాలు వెరసి 391 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయాలంటూ జీవో 39లో పేర్కొందని తెలిపారు. అయినప్పటికీ ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేకపోయిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్ 61ని విడుదల చేస్తూ ఏయూలో ఒకే దఫాలో మొత్తం 726 ఖాళీలు భర్తీ చేయాలని సూచించిందని చెప్పారు. ప్రస్తుత రేషనలైజేషన్ కమిటీ గత ఎనిమిది నెలల కాలంగా శాస్త్రీయంగా పరిశీలన జరిపి అందరి నుంచి వివరాలు తీసుకుని 726 ఉద్యోగాలు భర్తీచేయడానికి నోటిఫికేషన్ సిద్ధం చేయాలని సూచించిందని వెల్లడించారు.
దీనిని పరిశీలిస్తే ఏయూలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో భర్తీ చేయాలని విడుదల చేసిన ఖాళీల కంటే అధికంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సూచించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. ఏయూ అవసరాల దృష్ట్యా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కేవలం 24 పోస్టులే తగ్గాయి
ప్రస్తుతం ఏయూలో దూరవిద్య కేంద్రం పూర్తిగా ఆటోమేషన్ చేయడంతో పాటు విజయనగరం, కాకినాడ, తాడేపల్లిగూడెం పీజీ సెంటర్‌లను మూసివేయడం, ఇతర విశ్వవిద్యాలయాల్లో విలీనం చేయడం జరిగింది. క్యాంపస్‌లో న్యూక్లియర్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ వంటి కోర్సులకు విద్యార్థుల నుంచి తగినంత స్పందన లేకపోవడంతో నిలిపివేశారు. దీనికారణంగా కేవలం 24 ఉద్యోగాలు మాత్రమే తగ్గాయనే వాస్తవాన్ని గుర్తెరగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment