గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రియుడి చేతిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కళాశాలలో తన సీనియర్ అయిన వ్యక్తితో కొనసాగించిన వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన గుంటూరు అమరావతి రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం కొమ్మూరుకు చెందిన కుమ్మరి రమ్య (24)కు గుంటూరు గోరంట్లకు చెందిన సతీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇంజనీరింగ్ చదివే సమయంలో రమ్యకు కిషోర్‌బాబు అనే సీనియర్ విద్యార్థితో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే, పెళ్లయిన తర్వాత కూడా ఈ బంధం కొనసాగించడంతో వారు మరింత సన్నిహితమయ్యారు.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని రమ్య కిషోర్‌బాబుపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదే విషయమై మంగళవారం కిషోర్‌బాబు ఫ్లాట్‌లో వారిద్దరీ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆగ్రహించిన కిషోర్‌బాబు రమ్యను గొంతునులిమి నేలకేసి కొట్టడంతో ఆమె మృతి చెందింది. వెంటనే కిషోర్‌బాబు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.