‘నన్ను కిడ్నాప్ చేశారు.. ఇవే చివరి మాటలు’
* కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి చివరి మాటలివి
* ఖమ్మంలో గతనెల 31న కిడ్నాప్
* కృష్ణానదిలో మరుసటిరోజు రాత్రి మృతదేహం లభ్యం
* వ్యాపారంలో గొడవలతోనే హత్య జరిగిందంటున్న కుటుంబసభ్యులు
విజయవాడ : ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు.. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవే నా చివరి మాటలు కావచ్చు..’అని ఓ తండ్రి తీవ్ర ఆందోళనతో కుమారుడికి చివరిసారిగా ఫోన్‌లో చెప్పిన మాటలివి. వ్యాపారంలో గొడవల నేపథ్యంలో కిడ్నాప్‌కు గురైన ఆ వ్యక్తి ఆదివారం రాత్రి కృష్ణానదిలో శవమై తేలాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు చెందిన కిషోర్‌బాబు(48)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఖమ్మంలోని పొట్టిశ్రీరాములు రోడ్డులో ఇండూరు రాము అనే వ్యక్తితో కలిసి పురుగుమందులు, విత్తనాల వ్యాపారం చేస్తుంటాడు. గతనెల 31వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కిషోర్ బజారుకు వెళుతున్నానని భార్య ఉషకు చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుమారుడు వినయ్ పలుచోట్ల గాలించాడు. కిషోర్ ద్విచక్రవాహనం జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమీపంలో కనిపించింది. కిషోర్ బాబు జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు.
అదేరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వినయ్‌కు తండ్రి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవేనా నా చివరి మాటలు కావచ్చు’ అని ఆయన కుమారుడికి చెప్పాడు. దీంతో వినయ్ ఆందోళనకు గురై తల్లితో కలిసి ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా కృష్ణానదిలో 38 వ ఖానా వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపిం చింది. స్థానికులు అందించిన సమాచారంతో స్థానిక స్టేషన్ సిబ్బందితోపాటు ఖమ్మం పో లీసులు, కిషోర్ బంధువులు అక్కడకు వెళ్లారు. మృతదేహాన్ని చూసి కిషోర్‌దిగా బంధువులు గుర్తించారు.
ఎలా జరిగిందంటే..
కిషోర్ బజారులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి కొందరితో మాట్లాడేందుకు అని చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. అతడితోపాటు మరికొందరు కిషోర్ కాళ్లను తాళ్లతో కట్టివేసి కారులో పడవేసి విజయవాడకు బయలుదేరారు. నగరంలో పోలీసుల తనిఖీలు జరుగుతుండడంతో వాహనాన్ని కనకదుర్గమ్మ గుడికి సమీపంలో నిలిపారు. కిడ్నాపర్లు కారులోనుంచి దిగి పక్కకు వెళ్లారు. దీంతో కిషోర్ అప్రమత్తమై తన మొబైల్ నుంచి కుమారుడికి ఫోన్ చేయడంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వ్యాపారంలో గొడవలతోనే..
తన భర్తకు వ్యాపారానికి సంబంధించి భాగస్వామి అయిన ఇండూరు రాముతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కిషోర్ భార్య ఉష పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. రాము బంధువైన ప్రభుత్వోద్యోగి పోటు శ్రీను కిడ్నాప్ ఇందులో ప్రధాన పాత్ర పోషించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.