businessman murder
-
బెజవాడలో వ్యాపారి హత్య
గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడలో యువ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యారు. కారులోనే అతడి గొంతుకు తాడుబిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బుధవారం రాత్రి ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లిన కరణం రాహుల్ (30) గురువారం బందరు రోడ్డులో కారులో మృతదేహంగా కనిపించారు. ఒంగోలుకు చెందిన రాహుల్ ప్రస్తుతం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఒక విల్లాలో ఉంటున్నారు. జి.కొండూరులో జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట స్నేహితుడు కోరాడ విజయ్‌కుమార్‌తో కలిసి 2016 నుంచి గ్యాస్ సప్లయ్ వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని ఎం.సి.పల్లె వద్ద సుమారు రూ.57 కోట్లతో జిక్సిన్ గ్యాస్ సిలిండర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో కారులో రాహుల్ ఇంటి వద్ద నుంచి బయటకెళ్లారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఇంతలో బందరురోడ్డులో కారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. అనుమానం వచ్చి అక్కడకు వెళ్లిన రాహుల్ తండ్రి రాఘవరావు, భార్య పూర్ణిమ.. ఆ మృతదేహం రాహుల్‌దని గుర్తించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రాహుల్‌ను విజయకుమార్ హత్యచేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విజయ్‌కుమార్ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆధారాల సేకరణ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు హత్య జరిగిన కారు నుంచి కొన్ని ఆధారాలు సేకరించాయి. రాహుల్ డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉండగా, తల వెనక్కి నెట్టబడి ఉంది. కుడిచేతి భుజం వద్ద రక్తపు మరకలున్నాయి. డ్రైవర్ పక్క సీటులో నైలాన్ తాడు, రాహుల్ ముఖంపై దిండు ఉన్నాయి. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్, అతడి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. కారే కీలక ఆధారం రాహుల్ ఫోర్డ్ ఎండీవర్ టాప్ ఎండ్ మోడల్ కారు వాడుతున్నారు. కారు ఎక్కడి నుంచి బయల్దేరింది.. ఎక్కడ ఆగింది.. ఎంత వేగంతో వచ్చింది.. బ్రేక్‌లు ఎప్పుడు వేసింది.. వంటి అంశాలను కారులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకునే వీలుంది. కారులో పెనుగులాట జరిగినా అందులో ఉన్న సెన్సిటివ్ సెన్సార్ల ద్వారా ఆ డేటా నిక్షిప్తం అవుతుంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘నన్ను కిడ్నాప్ చేశారు.. ఇవే చివరి మాటలు’
* కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి చివరి మాటలివి * ఖమ్మంలో గతనెల 31న కిడ్నాప్ * కృష్ణానదిలో మరుసటిరోజు రాత్రి మృతదేహం లభ్యం * వ్యాపారంలో గొడవలతోనే హత్య జరిగిందంటున్న కుటుంబసభ్యులు విజయవాడ : ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు.. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవే నా చివరి మాటలు కావచ్చు..’అని ఓ తండ్రి తీవ్ర ఆందోళనతో కుమారుడికి చివరిసారిగా ఫోన్లో చెప్పిన మాటలివి. వ్యాపారంలో గొడవల నేపథ్యంలో కిడ్నాప్‌కు గురైన ఆ వ్యక్తి ఆదివారం రాత్రి కృష్ణానదిలో శవమై తేలాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు చెందిన కిషోర్‌బాబు(48)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఖమ్మంలోని పొట్టిశ్రీరాములు రోడ్డులో ఇండూరు రాము అనే వ్యక్తితో కలిసి పురుగుమందులు, విత్తనాల వ్యాపారం చేస్తుంటాడు. గతనెల 31వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కిషోర్ బజారుకు వెళుతున్నానని భార్య ఉషకు చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుమారుడు వినయ్ పలుచోట్ల గాలించాడు. కిషోర్ ద్విచక్రవాహనం జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమీపంలో కనిపించింది. కిషోర్ బాబు జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. అదేరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వినయ్‌కు తండ్రి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవేనా నా చివరి మాటలు కావచ్చు’ అని ఆయన కుమారుడికి చెప్పాడు. దీంతో వినయ్ ఆందోళనకు గురై తల్లితో కలిసి ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కృష్ణానదిలో 38 వ ఖానా వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపిం చింది. స్థానికులు అందించిన సమాచారంతో స్థానిక స్టేషన్ సిబ్బందితోపాటు ఖమ్మం పో లీసులు, కిషోర్ బంధువులు అక్కడకు వెళ్లారు. మృతదేహాన్ని చూసి కిషోర్‌దిగా బంధువులు గుర్తించారు. ఎలా జరిగిందంటే.. కిషోర్ బజారులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి కొందరితో మాట్లాడేందుకు అని చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. అతడితోపాటు మరికొందరు కిషోర్ కాళ్లను తాళ్లతో కట్టివేసి కారులో పడవేసి విజయవాడకు బయలుదేరారు. నగరంలో పోలీసుల తనిఖీలు జరుగుతుండడంతో వాహనాన్ని కనకదుర్గమ్మ గుడికి సమీపంలో నిలిపారు. కిడ్నాపర్లు కారులోనుంచి దిగి పక్కకు వెళ్లారు. దీంతో కిషోర్ అప్రమత్తమై తన మొబైల్ నుంచి కుమారుడికి ఫోన్ చేయడంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో గొడవలతోనే.. తన భర్తకు వ్యాపారానికి సంబంధించి భాగస్వామి అయిన ఇండూరు రాముతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కిషోర్ భార్య ఉష పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. రాము బంధువైన ప్రభుత్వోద్యోగి పోటు శ్రీను కిడ్నాప్ ఇందులో ప్రధాన పాత్ర పోషించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.