గుంటూరు ఎడ్యుకేషన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతే దేశాభివృద్ధికి కొలమానమని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో స్థానిక పాతగుంటూరులోని యాదవ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ ఏర్పాటుచేసిన ప్రదర్శన ప్రారంభ సభలో ముఖ్యఅతిథి రావెల మాట్లాడుతూ దేశానికి శాస్త్ర,సాంకేతిక రంగాల ప్రగతి కీలకమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక రాజధాని నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
రాబోయే 50 ఏళ్లలో శాస్త్ర, సాంకేతిక రంగం ఏవిధంగా ఉంటుందో ఊహించి అందుకనుగుణంగా ఇప్పటి నుంచే విద్యార్థులను సంసిద్ధులను చేసేవిధంగా విద్యాబోధన సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్ అవార్డును ప్రవేశపెట్టిన తరువాతే వైజ్ఞానిక ప్రదర్శనలు విస్తృతంగా ఏర్పాటు జరుగుతున్నాయని, విద్యార్థుల్లో సైతం పరిశోధనలు చేయాలనే కాంక్ష పెరిగిందని వివరించారు.
విద్యార్థులు భావిశాస్త్రవేత్తలు..
-ఎమ్మెల్యే ముస్తఫా
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముస్తఫా మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో శాస్త్రవేత్తల పరిశోధనలు కీలకమని చెప్పారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, ఆర్డీవో టి.భాస్కరనాయుడు, ప్రదర్శన కన్వీనర్, గుంటూరు డీవైఈవో పి.రమేష్, డీవైఈవోలు జి.విజయలక్ష్మి, పీవీ శేషుబాబు, ఎ.కిరణ్‌కుమార్, యాదవ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మైలా అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా 226 ప్రాజెక్టులు
విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు 226నమూనా ప్రాజెక్టులను ప్రదర్శనకు తీసుకువచ్చారు. వీటిలో ఎక్కువ భాగం మూడు నెలల క్రితం గుంటూరులో ఏర్పాటుచేసిన ఇన్‌స్పైర్ సైన్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ప్రాజెక్టులే కావడం గమనార్హం! ప్రదర్శనలో 18 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపికచేసి రాష్ట్రస్థాయికి పంపారు.
జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బాల మేధావుల సృజనకు అద్దంపట్టింది. విద్యార్థులు తమ మదిలో మెదిలిన ఆలోచలనకు వాస్తవ రూపం కల్పిస్తూ పలు ప్రాజెక్టులు రూపొందించారు. వాటిలో పలు నమూనా ప్రాజెక్టులను పరిశీలిస్తే...
ప్రాజెక్టు పేరు: ఎమర్జెన్సీ ఎయిర్‌క్రాఫ్ట్ లొకేటర్ డివైజ్
రూపకల్పన: కేవీ నాగేశ్వరరావు, జెడ్పీహెచ్‌ఎస్, నుదురుపాడు, ఫిరంగిపురం మండలం
ప్రధానాంశం: హైజాక్ అయిన, కనిపించకుండాపోయిన విమానాల జాడ కనుగొనేందుకు ఎమర్జెన్సీ ఎయిర్‌క్రాఫ్ట్ లొకేటర్ డివైజ్ అనే నూతన పరికరం రూపకల్పన దిశగా విద్యార్థులు పరిశోధన చేశారు. శాటిలైట్ ఫోన్, కంప్యూటర్ నియంత్రణతో విమాన సమాచార వ్యవస్థను పటిష్టపరచవచ్చనే నూతన ఆలోచనకు నాంది పలికారు.
ప్రాజెక్టు పేరు: ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్స్ అండ్ గేట్
రూపకల్పన: కె.రాజేష్, ఎం.తిరుపతిరావు, జెడ్పీహెచ్‌ఎస్, ఎండుగుంపాలెం, నాదెండ్ల మండలం
ప్రధానాంశం: కాపలాదారులు లేని రైల్వేగేట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్స్, గేట్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రైల్వే లెవల్ క్రాసింగ్‌కు కిలోమీటరు దూరంలో ట్రాక్ కింద సెన్సార్లను అమర్చడం ద్వారా రైలు వస్తున్న సమాచారం గేటు వద్దనున్న అలారానికి చేరి మోగుతుంది. వెంటనే వాహనదారులు గుర్తించడం సాధ్యపడుతుంది. మనిషి అవసరం లేనివిధంగా ఆటోమేటిక్‌గా రైలుగేటు వేసి, తీయడం చేయవచ్చు.
ప్రాజెక్టు పేరు: రోబోటిక్ గన్
రూపకల్పన: జి.మానసి, కేర్ పబ్లిక్ స్కూల్, నరసరావుపేట
ప్రధానాంశం: బ్యాంకులు, జ్యుయలరీలు, వాణిజ్య సముదాయాల్లో నిరంతరం సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుని వారితో గస్తీ చేయించడం సాధ్యం కాని పరిస్థితుల్లో రోబోటిక్ గన్ నూతన ఆలోచనకు తెరతీసింది. బ్యాంకులో ఒకచోట రోబోటిక్ గన్‌ను ఏర్పాటుచేస్తారు. సీసీ కెమెరాల ద్వారా దానిని కంప్యూటర్‌కు అనుసంధానించి, నెట్ ఆధారిత రిమోట్‌ను సమీప పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతారు. దుండగులు చోరీకి పాల్పడిన సమయంలో సీసీ కెమెరా ద్వారా చూసిన పోలీసులు తమ వద్దనున్న రిమోట్ మీటను నొక్కగానే వెంటనే బుల్లెట్ దూసుకుపోతుంది. దీని ద్వారా చోరీలను అరికట్టి, దొంగల ఆట కట్టించవచ్చు.
భావి శాస్త్రవేత్తల కొలువు
Published Fri, Dec 12 2014 12:58 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement