రచ్చకెక్కిన అమరావతి పాఠశాల వివాదం | Amaravati School Conficts In Guntur | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన అమరావతి పాఠశాల వివాదం

Published Thu, Jun 14 2018 1:11 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Amaravati School Conficts In Guntur - Sakshi

సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ ప్రగతి ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటీకి సంబంధించిన అమరావతి పాఠశాల వివాదం తారస్థాయికి చేరింది. నిరసనలు, దీక్షలు, రాస్తారోకో చేపట్టిన సభ్యులు మంగళవారం స్థలానికి, పాఠశాలకు మధ్య సిమెంట్‌ పోల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. బుధవారం సిమెంట్‌ పోల్స్‌ను తొలగింప చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దాడులకు తెగబడడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడింది. శ్రీ ప్రగతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటీకి చెందిన కొండవీటి దత్తాత్రేయులు, మక్కెన వెంకట్రావు, కూలీలపై మారణాయుధాలతో దాడులు చేయడంతో వారు గాయపడ్డారు. వారు పట్టణంలోని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

ఖాళీ స్థలం కబ్జా చేసేందుకు యత్నాలు
శ్రీ ప్రగతి ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటీ కార్యదర్శి పరిటాల నరేష్‌ మాట్లాడుతూ సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని అమరావతి స్కూలులో ఖాళీ స్థలం కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ తమను బెదిరించి స్థలాన్ని కబ్జాదారులకు అప్పగించాలని చూస్తున్నారని, అన్యాయం గురించి  హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ వేశామని తెలిపారు. సివిల్‌ వ్యవహారంలో జోక్యం చేసుకున్నందుకు స్వయంగా న్యాయస్థానానికి వచ్చి రెండు వారాల్లో కౌంటర్‌ వేయమని డీఎస్పీని న్యాయమూర్తి ఆదేశించారన్నారు. తనపై కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేస్తారా? అనే కోపంతో డీఎస్పీ తమ స్థలాన్ని కాజేయాలని చూస్తున్న కబ్జాదారులకు సహకరించేందుకు పోలీసులకు అదేశాలు ఇచ్చారన్నారు.

బుధవారం కబ్జాదారులు వంద మంది రౌడీలను తీసుకొచ్చి తమ స్థలానికి వేసిన కంచెను తొలగింప చేశారని ఆయన ఆరోపించారు. పనులు చేయిస్తున్న కొండవీటి దత్తాత్రేయులు, మన్నె వెంకట్రావు, కూలీలపై కత్తులతో దాడి చేసి దారుణంగా గాయపరిచారని తెలిపారు. అల్లర్లు సృష్టించి గాయపరిచిన వారిలో లక్కరాజుగార్లపాడుకు చెందిన కొండవీటి కృష్ణమోహన్, సత్తెనపల్లికి చెందిన సూర్యదేవర శ్రీనివాసరావు, విజయవాడకు చెందిన మొక్కపాటి రాజశేఖర్, యెల్లినేడి కోటేశ్వరరావు, దమ్మాలపాడుకు చెందిన శిరిగిరి ప్రభాకరరావు, ధూళిపాళ్లకు చెందిన బండారుపల్లి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన ఫణి శ్రీధర్, కృష్ణారెడ్డి, పెదపాలేనికి చెందిన రాజేష్, అబ్బూరుకు చెందిన నెట్టెం కృష్ణ, తక్కెళ్ళపాటి బాబ్జి అలియాస్‌ పాకాలపాడు బాబ్జి మరికొంత మంది ఉన్నారని తెలిపారు. తమ స్థలంలో కంచెను తొలగించిన కబ్జాదారులు, మారణాæయుధాలతో దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement