శ్రీశైలంప్రాజెక్టు: గిరిజనులకు ప్రత్యేక బీఈడీ కళాశాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు హామీనిచ్చారు. శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో చెంచు ఉత్సవాలను మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిమ జాతులు ప్రకృతిలో కలిసిపోయి, ప్రకృతిని కాపాడుతూ తాము ఇంకా నిరక్షరాస్యులుగా, అనాగరికులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రరాష్ట్ర చెంచు గిరిజన సమగ్ర అభివృద్ధి సంస్థ పరిధి మూడు జిల్లాకు తగ్గిందన్నారు. ఫలితంగా గిరిజనుల అభివృద్ధి కోసం పాటు పడేందుకు దోహదపడుతుందన్నారు. అన్ని గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశా ల కోసం ఒక ప్రత్యేక బీఈడీ కళాశాలను ఏ ర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సంపాదించడం కోసం కంప్యూటర్లో శిక్షణను ఇప్పించడమే కాకుండా విదేశాలలో ఉన్నత చదువులను చదువుకునే చెంచులకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
చదువు మధ్యలో ఆపివేసిన వారికి కాంట్రాక్ట్ పనులలో శిక్షణ ఇప్పించి గిరిజన గూడాలలో జరిగే అభివృద్ధి పనుల్లో వారిని భాగస్వాములుగా చేస్తామన్నారు. గిరిపుత్రిక కల్యాణ పథకం కింద గిరిజనుల పెళ్లికి రూ. 50వేలను ఉచితంగా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. చెంచు గిరిజనులు భవిష్యత్ తరాలలో ఉన్నత ఉద్యోగ, హోదాలలో ఉండేందుకు తప్పనిసరిగా చదువుకోవాలని మంత్రి అన్నారు. కార్యక్రమానికి హాజరైన సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గిరిజనులకు ఖర్చు పెట్టాల్సిన రూ. 12వేల కోట్ల ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌నిధులు పక్కదారి పట్టాయన్నారు.
ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌నిధులు సక్రమంగా అందేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జెడ్పీటీసీ అయిన చెంచు గిరిజన మహిళ నారాయణమ్మను మంత్రులు అభినందించారు. చెంచు ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి చెంచు లక్ష్మి విగ్రహానికి పూలమాలలు వేశారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌లను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేకంగా ఆలపించిన చెంచు జానపద గీతాల సీడీని ఆవిష్కరించారు. గిరిజనులు తయారు చేసిన సంప్రదాయ వంటలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు రుచి చూశారు.
వికలాంగుల గిరిజనులకు మంత్రి రావెల ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గిరిజనులకు సంప్రదాయ ఆటలపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డెరైక్టర్ చిన్నవీరభద్రుడు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి చెంచు ఉత్సవాలను ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లా గిరిజనులతో కలిపి నిర్వహిస్తామన్నారు.
కలెక్టర్ విజయమోహన్‌మాట్లాడుతూ.. అంతరించి పోతున్న చెంచు జాతి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించామని, అక్షరాస్యత, ఆధునిక సేద్యంపై చెంచులు మొగ్గు చూపాలని ఆయన అన్నారు. ఉత్సవ కార్యక్రమంలో శాసన సభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, వై. ఐజయ్య, జిల్లా పరిషత్‌చెర్మైన్ మల్లెల రాజశేఖర్, ఎస్పీ రవికృష్ణ, డీఎంఅండ్ హెచ్‌ఓ నిరుపమ, ఐటీడీఏ పీఓ ఈసా రవీంద్రబాబు, చెంచు గిరిజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
గిరిజనులకు ప్రత్యేక బీఈడీ కళాశాల
Published Wed, Feb 18 2015 2:03 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement