అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు? | ysrcp leaders slam tdp over invitation to pushkarams | Sakshi
Sakshi News home page

అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?

Published Sat, Aug 13 2016 11:37 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు? - Sakshi

అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?

టీడీపీ తీరు అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుందని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు కె.పార్థసారథి విమర్శించారు. పుష్కరాలకు ఆహ్వానించే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఆహ్వానానికి వచ్చేటపుడు మీడియాను కూడా వెంటబెట్టుకుని వచ్చారని అన్నారు. ఆహ్వానించడానికి వచ్చినవారిని తాము గౌరవంగానే చూసుకున్నామని తెలిపారు. వారికి సాదరంగా స్వాగతం పలికామని, అయినా వాళ్లు మాత్రం వెళ్తూ వెళ్తూ ఈ అంశాన్ని రాజకీయం చేశారని, ఇంతకంటే కుసంస్కారం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. పుష్కరాలు ప్రారంభమైన 24 గంటల తర్వాత ఆహ్వానం ఇస్తారా, అయినా అసలు ఆహ్వానం అందించేటపుడు సంబంధిత వ్యక్తి ఉన్నారా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి కదా అని ఆయన అన్నారు. వైఎస్ జగన్ అందుబాటులో లేరని తెలిసి మరీ రాజకీయానికి పాల్పడ్డారని, టీవీల ద్వారా లీకులిచ్చి, నిఘాసిబ్బందిని పెట్టుకుని రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

వైఎస్ జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారని, అయినా ఆయనను కలుస్తామంటూ మంత్రి రావెల ఓఎస్డీ కాల్ చేశారని పార్థసారథి తెలిపారు. ఈ విషయాన్ని టీవీలకు లీకులు ఇచ్చారని అన్నారు. వచ్చినవాళ్లను రిసీవ్ చేసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ తనకు చెప్పారని, తూర్పుగోదావరి పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా మంత్రి కిశోర్ బాబు, విప్ కూన రవికుమార్ వచ్చారా లేదా అని జగన్ తనను అడిగారని, వాళ్లు రాలేదని చెప్పడంతో రేపు కలుద్దాంలే అని తనతో అన్నారని వివరించారు. జగన్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి రావెల, రవికుమార్ వచ్చారని, వారిని తాను రిసీవ్ చేసుకుని రేపు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పానని, ఈ ఘటన అంతా చూస్తే ఎవరిది తప్పో అర్థమవుతుందని అన్నారు. అసలు ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే తీరు ఇదేనా, ఇలా చేయడం ప్రజాస్వామ్యంలో అవమానించడం కాదా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement