- ఇద్దరు విశాఖ యువకులు అరెస్టు, రిమాండ్
- బాధితురాలిది రంగారెడ్డి జిల్లా
- కేసు ఛేదించిన రెల్వే పోలీసులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఓ మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి విశాఖకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుందామనుకున్న ఇద్దరు అన్నదమ్ముల కుట్రను రైల్వే పోలీసులు పటా పంచలు చేశారు. కిడ్నాపర్లు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి మైనర్ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలను జీఆర్పీ డీఎస్పీ వెంకటరావు గురువారం విలేకరులకు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్‌కే పల్లి గ్రామానికి చెందిన నిమ్మగడ్డ గంగాధరరావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ఇటీవల టెన్త్ ఉత్తీర్ణురాలైంది. మొక్కు తీర్చుకునేందుకు ఇటీవల విజయవాడ దుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం కుటుంబమంతా వచ్చారు. అమ్మవారి దర్శనం తర్వాత విజయవాడలోనే బంధువుల ఇంటికెళ్లారు. మైనర్ బాలిక తల్లికి అనారోగ్యంగా ఉండడంతో బాలికను ఇంట్లోనే ఉంచి బుధవారం అందరూ ఆస్పత్రికి వెళ్లారు. వారు ఇంటికి వచ్చి చూస్తే బాలిక కనిపించలేదు.
దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ ఎస్పీ డాక్టర్ శ్యాంప్రసాద్ దృష్టికి ఈ విషయం రావటంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి విశాఖ జీఆర్పీని అప్రమత్తం చేశారు. రైళ్ల తనిఖీలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో మైనర్ బాలికతో బాటు విశాఖలోని గోకుల్ థియేటర్‌లో కేటరింగ్ స్టాల్‌లో పని చేసే రాజు (20), అతని అన్నయ్య కిశోర్ బాబు (32) దొరికిపోయారు. వీరిద్దరినీ ట్రయినీ ఎస్‌ఐ విజయ్ కుమార్ అరెస్టు చేసి విషయం రాబట్టారు.
ప్రధాన అనుమానితుడు కిశోర్‌బాబు హైదరాబాద్‌లోనే కొంతకాలంగా ఉంటున్నాడు. మైనర్ బాలికకు కిశోర్ బాబుకు మధ్య పరిచయాలున్నాయి. ఈ పరిచయంతోనే మాయ మాటలు చెప్పి విశాఖకు తీసుకు వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు చెప్పారు.