ఆ నవ్వు చెరిగిపోయింది | lady constable committed suicide due to cheated by her boy friend | Sakshi
Sakshi News home page

ఆ నవ్వు చెరిగిపోయింది

Published Sat, Jan 4 2014 11:30 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

lady constable committed suicide due to cheated by her boy friend

ఏలూరు(టూ టౌన్), న్యూస్‌లైన్ : ‘పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదీలను నవ్వుతూ పలకరించేది.. పనిలో చురుకుగా ఉండేది.. ఆమె విగత జీవిగా మారటంతో స్టేషన్ బోసిపోయింది’  తోటి కానిస్టేబుళ్ల విచారం.. ‘మా మంచి చెడ్డలు అడిగి తెలుసుకునేది.. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండేది’ చుట్టుపక్కల ఇళ్లవారి వారి ఆవేదన.   ఆమె మెలగిన తీరును తలచుకుంటూ తెలిసిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కాగాని జ్యోతిరాణి ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావటమే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన జ్యోతిరాణి, అదే బ్యాచ్‌లో శిక్షణ పొందిన జ్యోతిబాబు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రసుత్తం జ్యోతిబాబు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

తమ ప్రేమ విషయం జ్యోతిరాణి ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. దానికి వారు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. తనకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇటీవల జ్యోతిరాణితో చెప్పిన జ్యోతిబాబు, ఆమెను కూడా ఇంట్లోవాళ్లు  చూసిన సంబంధం చేసుకోమని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె దిగాలుగా ఉంటోంది.  నాలుగు రోజుల క్రితం వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావకు రాగా, పెళ్ళి చేసుకోనని జ్యోతిబాబు  కరాఖండిగా చెప్పాడు. దీంతో జ్యోతిబాబు ఇంటికి వెళ్ళి అతని కుటుంబసభ్యులతో మాట్లాడమని గత నెల 31న ఆమె తన తల్లి సత్యవతిని కోరింది.

మూడు రోజుల్లో ఏమైందో ఏమో శుక్రవారం ఉదయం విధులకు వెళ్ళిన జ్యోతిరాణి సాయంత్రం ఇంటికి వచ్చింది. రాత్రి 8 గంటలకు చీర మార్చుకుంటానని తల్లికి చెప్పి తన గదిలోకి వెళ్ళింది. భోజనానికిగాను ఆమెను తల్లి పిలిచినా ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టం చేశారు. ఈ ఘటనపై ఏలూరు టూటౌన్ పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు.

 గానుగులపేటలో విషాదచాయలు
 పవర్‌పేట సమీపంలోని గానుగులపేటలో నివాసం ఉంటున్న కాగాని త్రిమూర్తులు, సత్యవతికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. మూడో కుమార్తె చదువుకుంటోంది. రెండో కుమార్తె జ్యోతిరాణి. ఆమె స్నేహితులు పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నించటంతో ఆ స్ఫూర్తితో ఆమె ప్రయత్నించి కృతకృత్యురాలైంది. చిన్న వయసులోనే కానిస్టేబుల్ ఉద్యోగం రావటంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఇంటి చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకునే జ్యోతిరాణి మృతికి స్థానికులు కంటతడి పెట్టారు. పోస్టుమార్టం చేసే సమయంలో స్ధానికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

 ఫిర్యాదీలను నవ్వుతూ పలకరించేది
 2010లో పోలీసు శాఖలోకి అడుగుపెట్టిన జ్యోతిరాణి ముందుగా పెదపాడు పోలీసుస్టేషన్‌లో మొదటి పోస్టింగ్ వచ్చిన ఆమె రెండేళ్ల క్రితం ఏలూరు రూరల్ స్టేషన్‌కు బదిలీ అయింది. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదీదారులను నవ్వుతు పలకరించి, ఫిర్యాదులు తీసుకునేదని హెడ్ కానిస్టేబుల్ నాని  చెప్పారు. రైటర్‌కు సహయకురాలైన ఆమె చురుకుగా పనిచేసేదని పలువురు కానిస్టేబుల్స్ పేర్కొన్నారు. జ్యోతిరాణి లేకపోవడంతో స్టేషన్ నిండుతనం కోల్పోయిందని 2010 బ్యాచ్ కానిస్టేబుల్స్ ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతిరాణికి ఇన్‌చార్జి డీఎస్పీ కర్రి పుష్పారెడ్డి, రూరల్ సీఐ శుభాకర్, రూరల్ ఎస్సై జోసెఫ్ రాజు, టూటౌన్ ఎస్సై కిషోర్‌బాబు,రూరల్ పోలీసు స్టేషన్ సిబ్బంది కన్నీటి వీడ్కొలు పలికారు. శనివారం జ్యోతిరాణి అంత్యక్రియలు జరిగాయి.

 జ్యోతిబాబుపై కేసు నమోదు  : జ్యోతిరాణిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై కానిస్టేబుల్ జ్యోతి బాబుపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు టూటౌన్ ఎస్సై కిషోర్‌బాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement