నెరవేరిన ఆశయం | Grand celebrations of telangana state in nalgonda district | Sakshi
Sakshi News home page

నెరవేరిన ఆశయం

Published Sat, Feb 22 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

Grand celebrations of telangana state in nalgonda district

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి వేణుగోపాల్‌రెడ్డి ఆశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసుకున్న ఆత్మ బలిదానం మరిచిపోలేని ఘట్టం. దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి కోటిరెడ్డి-లక్ష్మమ్మల చిన్నకుమారుడు వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమాలను చూసి చలించాడు. 2010, జనవరి 18న యూనివర్సిటీలోని లైబ్రరీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
 
 ఉదయం అటుగా వెళ్లిన విద్యార్థులు గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. ‘సోనియాగాంధీ గారూ.. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. 19న మొత్తం వేణుగోపాల్‌రెడ్డి శవాన్ని యూనివర్సిటీలోనే ఉంచి విద్యార్థులు ఆందోళన చేయడంతో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా యూనివర్సిటీకి చేరుకొని వేణుగోపాల్‌రెడ్డి శవం వద్ద ఇక మాజీలమని ప్రమాణాలు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డితో పాటు మరోమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డిలు అక్కడే ఉన్నారు.
 
 శవాన్ని గన్‌పార్క్ దాకా ర్యాలీగా తీసుకెళ్లాలని విద్యార్థులు ప్లాన్ చేస్తే అనుమతివ్వకుండా లాఠీచార్జి చేసి రబ్బర్ బుల్లెట్లు, భాష్పవాయువు ప్రయోగించారు. ఇదే సమయంలో ఆంధ్రా ప్రజాప్రతినిధులు ఇది తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్య కాదని.. ఎవరో చంపేశారని ఆరోపణలు చేయడంతో కుటుంబ సభ్యులు, ఉస్మానియా విద్యార్థులంతా ఇక్కడే పోస్టుమార్టం చేయాలని పట్టుపట్టారు.
 
 దీంతో పోస్టుమార్టం చేసి ఊపిరితిత్తుల్లో పొగ ఉండడంతో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా డాక్టర్లు నివేదిక ఇచ్చారు. 20న హైదరాబాద్ నుంచి దోసపహాడ్‌కు శవాన్ని తీసుకొచ్చేందుకు అడుగడుగునా పోలీసులు నాటకీయంగా వ్యవహరించి ప్రధాన రహదారిపై తీసుకురాకుండా రాంగ్ రూట్‌లో తీసుకొస్తుంటే గ్రామగ్రామానా ప్రజలు పోలీసుల తీరును నిరసించారు. దీంతో చౌటుప్పల్, నకిరేకల్‌లో లాఠీఛార్జి చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేట పట్టణంలో పెద్ద ఎత్తున వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సాయంత్రం దోసపహాడ్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.  అంత్యక్రియల్లో అన్ని పార్టీల నాయకులు పెద్దఎత్తున పాల్గొని వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.
 
 కుటుంబ నేపథ్యం..
 కొండేటి కోటిరెడ్డి-లక్ష్మమ్మ దంపతులకు శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి ఇరువురు సంతానం. గ్రామంలో నాలుగు ఎకరాల పొలం, రూ.2లక్షల విలువ చేసే ఇల్లు ఉండేది. చదువుల కోసం రెండు ఎకరాలతో పాటు ఇల్లు కూడా అమ్మి హైదరాబాద్‌లో నివసిస్తురు. పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌తో ఇరువురు చదువుకునేవారు.
 
 నేటికీ అందని సాయం :
 సిద్ధారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి మేనమామ
 ఓ తెలంగాణ నేత రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. తర్వాత ఆయనను కలిస్తే ‘ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటించాల్సి వచ్చింది, చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. అందరికీ ఇవ్వలేమని’ చెప్పారు. ఓ ఎమ్మెల్యే రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. కానీ రూ.లక్ష మాత్రమే అందజేశారు. రెండో వర్ధంతి సందర్భంగా టీఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి రూ.లక్ష, టీడీపీ నాయకుడు పటేల్ రమేష్‌రెడ్డి రూ.లక్ష అందజేశారు. భువనగిరి సభలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రూ.లక్ష అందజేశారు.
 
 కుమారుని దిగులుతో
 మరణించిన తండ్రి..
 వేణుగోపాల్‌రెడ్డి మరణంతో తండ్రి కోటిరెడ్డి దిగులు చెంది సంవత్సరన్నర తర్వాత మృతి చెందాడు. ప్రస్తుతం తల్లి లక్ష్మమ్మ దోసపహాడ్‌లోనే ఒంటరిగా నివసిస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement