అరుదైన గౌరవం
* జయశంకర్‌కు పద్మవిభూషణ్, అంపశయ్య నవీన్‌కు, అంద్శైకి పద్మశ్రీ
* కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు
హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశంలోని అత్యున్నత అవార్డులకు జిల్లాకు చెందిన ప్రముఖుల పేర్లు అగ్రభాగంలో ఉన్నాయి. పద్మ విభూషణ్ అవార్డు కోసం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, పద్మశ్రీ అవార్డుల కోసం కథానవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, తెలంగాణ వాగ్గేయకారుడు అంద్శై పేర్లను కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేసింది.
గతంలో జిల్లాకు చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు పద్మవిభూషణ్, ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరేళ్లవేణుమాధవ్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆ తర్వాత చాలా విరామం ఏర్పడింది. గతంలో అవార్డులకు డాక్టర్ అంపశయ్యనవీన్, ఇంటాక్ జిల్లా కన్వీనర్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు, చిందు కళాకారుడు గడ్డం శ్రీనివాస్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నప్పటికీ.. వారికి రాలేదు.
ఆచార్య జయశంకర్..
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 1934 లో జన్మించారు. బనారస్, ఆలీఘర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్‌యసించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యావేత్తగా గుర్తింపు పొందారు. ప్రత్యేకించి తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవంగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన ప్రతి పాదనలు, ఎత్తుగడలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిపితగా పిలుచుకునే ఆచార్య జయశంకర్‌కు పద్మవిభూషణ్ ఇవ్వడం సమంజసమని తెలంగాణవాదులు, ఆయన అభిమానులు భావిస్తున్నారు.
డాక్టర్ అంపశయ్య నవీన్..
కథానవలా రచయిత అంపశయ్యనవీన్ 1941లో జన్మిం చారు. ఆయన అసలుపేరు దొంగరి మల్లయ్య. తను రాసిన నవల పేరుతో అంపశయ్య నవీన్‌గా గుర్తింపు పొందారు. ఆయన 30కిపైగా నవలలు రాశారు. కాలరేఖ నవల సుదీర్ఘమైన తెలంగాణ పోరాట నేపథ్య పరిస్థితులను వివరించేదిగా 16 వందల పేజీలతో ప్రచురించబడింది. ఈ నవలా రచనకు గాను 2004లో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. కేయూ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. తెలంగాణలో మంచి సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఆయన కరీంనగర్‌లో ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి కొత్త ఉద్యమానికి నాంది పలికారు. గత నాలుగేళ్లుగా నవీన్ పేరిట ఆయన పుట్టినరోజున తెలుగు నవలా సాహిత్య అవార్డులను అందజేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే నవీన్ పేరు పద్మశ్రీ అవార్డులకోసం ప్రతిపాదించబడినప్పటికీ ఆయనకు రాలేదు.
డాక్టర్ అంద్శై...
తెలంగాణ జన జీవితంలో ప్రతిష్టాత్మకమైన రీతిలో గుర్తింపు పొందిన వాగ్గేయకారుడు డాక్టర్ అంద్శై. ఆయన అసలు పేరు అందె అయిలయ్య. జనగామ పరిధిలోని రేబర్తి గ్రామంలో 1961లో జన్మించారు. శృంగేరి మఠానికి చెందిన శంకర్‌మహారాజ్ బోధనలతో ప్రభావితుడై ప్రజాకవిగా, ప్రకృతి కవిగా మారారు. 2006లో గంగా సినిమాలో రాసిన పాటకు అంద్శై నంది అవార్డు అందుకున్నారు. 2009లో అంద్శై రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ఎర్రసముద్రం సినిమాలో ఉపయోగించుకోవడమేకాకుండా... యూనివర్సిటీ స్థాయి డిగ్రీ రెండో సంవత్సరం పాఠ్యాంశంగా చేర్చబడింది.
అంద్శై రాసిన ‘పల్లె నీకు వందనాలమ్మో .., గలగల గజ్జెల బండి ఘల్లూ నీది ఓరుగల్లు నీది.., కొమ్మచెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా.., ఎల్లిపొతున్నావా తల్లి.., చూడా చక్కని తల్లి చక్కానీ జాబిల్లి.., జనజాతరలో మనగీతం జనకేతనమై ఎగరాలి’.. పాటలు ఆయనలోని తాత్వికతకు, చైతన్యశీలతకు నిదర్శనంగా కన్పిస్తాయి. అంద్శై రాసిన జయజయహే తెలంగాణ రాష్ట్రగీతంగా ఎంపికైంది. కేయూసీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంద్శైకి పద్మశ్రీ రావల్సిందేనని కళాకారులు, కవులు అంటున్నారు.